న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యా సంవత్సరం తగ్గించాల్సి రావడంతో సిలబస్‌ను కూడా సీబీఎస్‌ఈ తగ్గించింది. దీనికోసం తొలగించిన అంశాల్లో లౌకికవాదం, పౌరసత్వం, జాతీయ వాదం, నోట్ల రద్దు వంటి అంశాలు. 9 నుంచి 12 తరగతుల వారికి దాదాపు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తూ తాజా సిలబస్‌ను బుధవారం వెల్లడించింది. ఇందులో పదో తరగతిలో తొలగించిన వాటిలో ప్రజాస్వామ్యం– వైవిధ్యత, లింగం, కులమతాలు, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. 11వ తరగతిలో సమాఖ్యవిధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు.
12వ తరగతిలో భారత్‌తో పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల సంబంధాలు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి, భారత్ లో సామాజిక ఉద్యమాలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. విద్యార్థులపై భారం పడకుండా ఉండేలా సిలబస్‌ను రూపొందించినట్లు హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సిలబస్ నుంచి ఇంటర్నల్ పరీక్షల్లోగానీ, సంవత్సరాంతపు పరీక్షల్లోగానీ ప్రశ్నలు రావని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.
ఒక్కసారి మాత్రమే..
9 నుంచి 12 తరగతుల వరకూ తగ్గించిన సిలబస్ కేవలం ఒక్క విద్యా సంవత్సరానికి (2020–21) మాత్రమేనని సీబీఎస్‌ఈ సెక్రెటరీ అనురాగ్ తిపాఠి చెప్పారు. 190 సబ్జెక్టులకు సంబంధించి 30 శాతం సిలబస్ తగ్గించామని చెప్పారు. ఏఏ అంశాలను తొలగించారో స్పష్టంగా తెలిసేందుకు పాఠశాలలు ఎన్సీఈఆర్టీ రూపొందించిన క్యాలెండర్‌ను పాటించాలని సూచించారు. తొలగించిన అంశాలకు సంబంధించిన పాఠాలు సిలబస్‌లో ఎక్కడో ఒక చోట ఉండేలా చూసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment