
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండి డిజిటల్ పాఠాలు వినేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకున్న విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. విద్యార్థులు వాటిని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే ఆడి యో, వీడియో పాఠాలు వస్తాయి. గతంలో కొన్ని సబ్జెక్టులకు పైలట్ ప్రాజెక్టుగా ముద్రించిన క్యూ ఆర్ కోడ్‌ను ప్రభుత్వం ఈసారి అన్ని సబ్జెక్టుల పుస్తకాల్లో ముద్రించింది. దీంతో విద్యార్థులు మరింత మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
జిల్లా కేంద్రాల నుంచి పంపిణీ చేసేందుకు..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి వెంటవెంటనే మండల కేంద్రాలకు, పాఠశాలలకు పంపిణీ చేసేలా జిల్లాల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిగతా పాఠ్య పుస్తకాలనూ ఈ నెలాఖరులోగా స్కూల్ పాయింట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తోంది. వాటిలో ఆరు నుంచి నుంచి టెన్త్ వరకు చదువుకునే దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు క్యూఆర్ కోడ్ ముద్రించిన పుస్తకాలను ఇస్తారు. విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు ఆ పాఠానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఆడియోతో కూడిన వివరాలను పొందగలుగుతారు.
లాక్‌డౌన్‌తో మిగిలిపోయిన సేల్ పుస్తకాలు
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ముద్రించిన సేల్ పుస్తకాలు భారీగా మిగిలిపోయాయి. 2020–21 విద్యా సంవత్సరంలో 35 లక్షల వరకు సేల్ పుస్తకాలను ముద్రించగా, అందులో 17 లక్షల పుస్తకాలను మాత్రమే విద్యార్థులు కొనుగోలు చేశారు. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడంతో విద్యార్థులు పుస్తకాలను కొనుక్కోలేదు. దీంతో దాదాపు 18 లక్షల పుస్తకాలు మిగిలిపోయాయి. అయితే వాటిని 2021–22 విద్యా సంవత్సరంలో విక్రయించుకునేందుకు ప్రింటర్లు విద్యాశాఖ అనుమతి కోరారు. ఈ అంశంపై తాము నిర్ణయం తీసుకోలేమని, ప్రభుత్వానికి లేఖ రాశామని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో బడులెన్ని..?
పాఠశాలలు విద్యార్థులు
ప్రభుత్వ 30,135 26,88,805
ప్రైవేట్ 10,763 32,37,448
మొత్తం 40,898 59,26,253
Comments
Please login to add a commentAdd a comment