డుమ్మా టీచర్లపై నజర్‌!  | Telangana Government Focus on Govt School teachers | Sakshi
Sakshi News home page

డుమ్మా టీచర్లపై నజర్‌! 

Published Mon, Aug 21 2023 1:03 AM | Last Updated on Mon, Aug 21 2023 9:55 AM

Telangana Government Focus on Govt School teachers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఫలానా పాఠశాలలో.. ఫలానా టీచర్‌.. రికార్డుల్లో వివరాలు ఉంటాయి. బడిలో చూస్తే ఆ టీచర్‌ ఉండరు. నెలలకు నెలలుగా బడి మొహమే చూడరు. ఏమయ్యారంటే.. ప్రధానోపాధ్యాయుడికీ తెలియదు, మండల విద్యాధికారికీ తెలియదు.. ఆపై అధికారులకు అసలు సమాచారమే ఉండదు. ఇలా ఒకరిద్దరు కాదు.. ఐదు వేల మందికిపైనే ప్రభుత్వ టీచర్లు సుదీర్ఘకాలం నుంచి పాఠశాలలకు రావడం లేదని అంచనా. లెక్కల్లో మాత్రం ఆయా స్కూళ్లలో సదరు టీచర్లు పనిచేస్తున్నట్టు ఉంటుంది.

విద్యార్థులకు మాత్రం చదువు అందదు. ఇలాంటి టీచర్లు రాజీనామా చేస్తేనో, ప్రభుత్వమే తొలగిస్తేనో, మరోచోటికి బదిలీ చేస్తేనో తప్ప.. ఆ స్కూల్‌కు మరో టీచర్‌ను నియమించలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలం నుంచి విధులకు రాని ఉపాధ్యాయులపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. ‘డుమ్మా’టీచర్ల వివరాలు ఇవ్వాలని తాజాగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. 

ప్రత్యేక వెబ్‌సైట్లో వివరాలు.. 
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల వరకు ప్రభుత్వ స్కూళ్లుండగా.. వాటిలో ప్రస్తుతం 1.05 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఐదు వేల మందికిపైగా విధులకు రావడం లేదని పాఠశాల విద్య డైరెక్టరేట్‌ అధికారులు చెప్తున్నారు. వీరిలో చాలా మంది తొలుత సెలవు పెట్టి, ఆ గడువు ముగిసినా హాజరవడం లేదు. ఇంకొందరైతే సెలవులు కూడా పెట్టకుండానే గైర్హాజరు అవుతున్నారని అంటున్నారు.

అలాంటివారి వివరాలన్నీ తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ తాజాగా ఆదేశించింది. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. టీచర్లకు సంబంధించిన ఏడాది డేటాను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించింది. 

ఏదో ఓ కారణం చెప్తూ.. 
కొందరు టీచర్లు విదేశాల పర్యటనలకు వెళ్తున్నారు. కొందరు మహిళా టీచర్లు.. వారి భర్త, పిల్లలు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే వారి దగ్గరికి వెళ్లాలంటూ సెలవులు పెడుతున్నారు. కానీ ముందుగా తీసుకునే సెలవు నెలా రెండు నెలలు మాత్రమే అయితే.. గడువు తీరినా అక్కడే ఉండటమో, తిరిగి వచ్చినా.. బడులకు గైర్హాజరు కావడమో చేస్తున్నారు. ఇలాంటి వారు తొలుత పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకుంటున్నారని.. కానీ తర్వాత సెలవులు పొడిగించాలంటూ తమకు మెసేజీలు, మెయిల్స్‌ పెడుతున్నారని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు.

కానీ నిబంధనల మేరకు వాటిని తాము అనుమతించలేక పోతున్నామని అంటున్నారు. అలాంటి టీచర్లంతా అనధికారికంగా గైర్హాజరైనట్టు రికార్డుల్లో నమోదవుతోంది. ఈ సమాచారం డైరెక్టరేట్, డీఈవో పరిధిలో ఉండటం లేదు. మరికొందరు టీచర్లు ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నట్టు విద్యాశాఖ దృష్టికొచ్చింది.

అలాంటి వారు అనారోగ్య కారణాలతో సెలవులు పెడుతున్నారని.. ఆ తర్వాత అయినా సరైన పత్రాలతో సెలవుల పొడిగింపునకు ప్రయత్నించడం లేదని అధికారులు చెప్తున్నారు. వారు కూడా అనధికారికంగా గైర్హాజరవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఉన్న పలువురు టీచర్లు.. వారికి బదులు ఎవరికో కొంత డబ్బులిచ్చి బడుల్లో బోధించేలా చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. 
 
‘డుమ్మా’మాస్టార్ల లెక్క ఎందుకు లేదు? 
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లపై చాలా ఏళ్లుగా సరైన పర్యవేక్షణ లేదని.. డీఈవోలు, ఎంఈవోల కొరత దీనికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్‌ హెచ్‌ఎంలకు ఏడెనిమిది మండలాలను అప్పగించి.. ఇన్‌చార్జి ఎంఈవో బాధ్యతలు నిర్వర్తింపజేస్తున్న పరిస్థితి ఉంది. స్కూళ్లలో అటెండర్లు, క్లర్కుల కొరతతో హెచ్‌ఎంలపై పని ఒత్తిడి పెరిగింది.

దీనికితోడు ఇప్పటివరకు ఆన్‌లైన్‌ హాజరు విధానం లేకపోవడంతో ఉపాధ్యాయుల అటెండెన్స్‌ రాష్ట్ర కార్యాలయం పరిధిలోకి రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నారు. టీచర్ల సెలవులు, ఎన్ని రోజులకు అనుమతి తీసుకున్నారు? ఎన్ని రోజుల నుంచి గైర్హాజరు అవుతున్నారు? అనే వివరాలను అందులో అప్‌లోడ్‌ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా బడి ఎగ్గొట్టే టీచర్ల బండారం బయటపడుతుందని, వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుందని పాఠశాల విద్య డైరెక్టరేట్‌ వర్గాలు చెప్తున్నాయి. 
 
సెలవుల అనుమతి ఎలా..? 
► సాధారణంగా ఉపాధ్యాయులు వివిధ రకాలుగా సెలవులు పెట్టే వీలుంది. క్యాజువల్‌ లీవ్‌ పెట్టేందుకు గరిష్టంగా 10 రోజులకు అనుమతి ఉంటుంది. అనారోగ్య సమస్యలతో మెడికల్‌ లీవ్‌ పెట్టడానికి ఎలాంటి కాలపరిమితి ఉండదు. తగిన ధ్రువపత్రాలు, వైద్యుల సిఫార్సులను చూపించాల్సి ఉంటుంది. 
► ఇవి కాకుండా 180 వరకు ఈఎల్స్‌ (ఎర్న్‌డ్‌ లీవ్స్‌) ఉంటాయి. వీటిని పైఅధికారి అనుమతితో వాడుకోవచ్చు. 
► సెలవుల మంజూరుకు సంబంధించి 2009లో తెచ్చిన జీవో 70యే ప్రస్తుతం అమల్లో ఉంది. దాని ప్రకారం టీచర్లకు నాలుగు నెలల వరకు సెలవు ఇచ్చేందుకు సంబంధిత స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడికి అధికారం ఉంటుంది. 4–12 నెలల వరకూ డీఈవో అనుమతి తీసుకోవాలి. ఏడాది నుంచి 4 ఏళ్ల వరకూ లీవ్‌ తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. అంతకు మించి సెలవు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 

డుమ్మాలపై చర్యలు ఎలా? 
► ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అనుమతి లేకుండా సెలవును పొడిగిస్తే దాన్ని గైర్హాజరుగానే పరిగణిస్తారు. ఇలా చేసినప్పుడు నిబంధనల ప్రకారం.. సదరు ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోవచ్చు. 
► ఉద్యోగి గైర్హాజరైన కాలాన్ని సర్వీస్‌ నుంచి తొలగించాలి. సస్పెండ్‌ చేయవచ్చు. అనధికార గైర్హాజరు ఎక్కువగా ఏళ్లకేళ్లు ఉంటే నోటీసు ఇచ్చి సర్వీసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. 
► ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఐదేళ్లు దాటి గైర్హాజరైతే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్టుగానే భావించి చర్యలు తీసుకోవచ్చు. 
► అనుమతి లేకుండా సెలవులను పొడిగించినా, గైర్హాజరైనా ఆ కాలానికి ఎలాంటి వేతనం ఇవ్వరు. పూర్తిగా లాస్‌ ఆఫ్‌ పే గానే పరిగణిస్తారు. సస్పెండ్‌ చేస్తే మాత్రం సగం వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. 

ఏళ్లకేళ్లు రాకున్నా మళ్లీ విధుల్లోకి.. 
అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నిబంధనలు సరిగా అమలుకాని పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏళ్లకేళ్లు విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి విధుల్లో చేర్చుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. 
► జగిత్యాల జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు ఏకంగా 12 ఏళ్లపాటు విధులకు రాకున్నా.. తిరిగి జాయిన్‌ చేసుకున్నారు. 
► మరో జిల్లాలో మూడేళ్ల పాటు డుమ్మా కొట్టిన టీచర్‌ను విధుల్లోకి తీసుకున్నారు. అంతకాలం గైర్హాజరైనవారిని తిరిగి జాయిన్‌ చేసుకునే అధికారం డీఈవోకు లేకున్నా తీసుకోవడం విశేషం. 
 
పర్యవేక్షణ లోపమే అసలు కారణం 
డుమ్మా కొట్టే టీచర్ల వివరాలు ఇప్పటికీ డైరెక్టరేట్‌ కార్యాలయంలో అందుబాటులో లేవంటే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఈవోలు 16 మంది మాత్రమే. డిప్యూటీ డీఈవోల ఖాళీలు భారీగా ఉన్నాయి. డీఈవోలు 16 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీ పోస్టులన్నింటినీ డైట్‌ కాలేజీల లెక్చరర్లు, ఇతర అధికారులను ఇన్‌చార్జులుగా పెట్టి నడిపిస్తున్నారు. దీంతో బడులపై పర్యవేక్షణ లోపించింది. టీచర్లు ఇష్టానుసారం అనుమతి లేకుండా డుమ్మా కొట్టడం సహించరాని నేరమే. దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అలాంటి వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. 
– చావా రవి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement