ఇది జెడ్పీహెచ్‌ఎస్ దేవన్‌పల్లి స్కూల్. 378 మంది విద్యార్థులు, 15 మంది టీచర్లు ఈ స్కూళ్లో ఉన్నారు. ఇక్కడ వరండా శుభ్రం చేస్తున్నది స్కూల్ టీచర్ శ్రీనివాస్. స్కావెంజర్‌ను విద్యాశాఖ నియమించకపోవడం, స్థానిక సంస్థలే పారిశుద్ధ్య పనులు చేస్తాయని ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడం, అడిగితే స్థానిక సంస్థలు పట్టించుకోకపోవడం వంటి కారణాలతో టీచర్లు, హెడ్‌మాస్టర్లే స్కూళ్లను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. చాక్‌పీసులు పట్టి బోధించాల్సిన చేతులతోనే చీపుర్లు పట్టుకొని ఊడ్చుకోవాల్సి వస్తోంది. టీచర్లే వరండాలు, స్టాఫ్ రూమ్‌లను శుభ్రం చేసుకోవడమే కాదు, చివరకు టాయిలెట్లు కూడా వారే కడగాల్సిన పరిస్థితి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంది.
సాక్షి, హైదరాబాద్: ఇది ఆ ఒక్క స్కూల్లోనే కాదు.. రాష్ట్రంలోని 24,311 జిల్లా పరిషత్ పాఠశాలలు, 1,751 ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది. గత నెల 27వ తేదీ నుంచి టీచర్లంతా స్కూళ్లకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ పాఠశాలలను శుభ్రం చేయించే పనిని స్థానిక సంస్థలకు వదిలేసింది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ఓ లేఖ రాసి కూర్చుంది. మరోవైపు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. మండల స్థాయిలోని ఎంఈవోలు స్థానికంగా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమన్వయం చేసుకొని పాఠశాలలను శుభ్రం చేయించుకోవాలని సూచించింది. అయితే క్షేత్ర స్థాయిలో ఆయా శాఖలు విద్యాశాఖ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అడిగినా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు స్పందించకపోవడం, విద్యాశాఖ స్కావెంజర్ల నియామకాలకు చర్యలు చేపట్టకపోవడంతో టీచర్లు, ప్రధానోపాధ్యాయులే పారిశుద్ధ్య పనులను చేసుకోవాల్సి వస్తోంది.
గత విద్యా సంవత్సరంలో నిధులు ఇచ్చినా..
పాఠశాలలు ఊడ్చేందుకు, టాయిలెట్స్ శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులను (స్కావెంజర్స్) నియమించుకునేందుకు గత విద్యా సంవత్సరంలో(2019–20) విద్యాశాఖ నిధులను ఇచ్చింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో గత మార్చి నెల నుంచి పాఠశాలలు బంద్ అయ్యాయి. దీంతో జూన్‌లో ప్రారంభం కావాల్సిన(2020–21) కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 1నుంచి డిజిటల్ (వీడియో పాఠాలు) పాఠాల బోధనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టీచర్లంతా స్కూళ్లకు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో టీచర్లంతా వచ్చారు. స్కావెంజర్లను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో స్కూళ్లను, స్టాఫ్ రూమ్‌లను వారే శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది.
అయితే అన్‌లాక్ నిబంధనల ప్రకారం ఈనెల 21వ తేదీ నుంచి 50 శాతం టీచర్లు స్కూళ్లకు వచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే పాఠశాలలను శుభ్రం చేసే స్కావెంజర్లను నియమించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేయలేదు. దీంతో మళ్లీ టీచర్లే స్టాఫ్ రూమ్‌లు, వరండాలు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా మున్సిపల్ అధికారులను, గ్రామ పంచాయతీని సంప్రదించినా వారు ఇప్పటికీ స్పందించలేదని, మళ్లీ తామే ఆ పనులను చేసుకోవాల్సి వస్తుందని టీచర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖనే స్కావెంజర్ల నియామకానికి నిధులను విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు, మాజీ నేతలు రఘునందన్, వేణుగోపాల్, నావత్ సురేష్, మహిపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment