సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘బడిబాట’కు స్పందన నామమాత్రంగానే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించట్లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటుండగా..టీచర్ల నిర్లిప్తత ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రైవేటు స్కూళ్లు ఆకర్షించినట్టుగా విద్యార్థులను ప్రభుత్వ టీచర్లు ఆకర్షించడం లేదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నట్టు సమాచారం. కాగా చాలాచోట్ల బడిబాట కార్యక్రమానికి వెళ్లేందుకు టీచర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో వెళ్లినట్టుగా చూపిస్తూ, ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు పంపుతున్నారు. దీంతో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. డీఈవోలు, ఎంఈవోల కొరతతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
బడి మానేసినవారు తిరిగి చేరేలా..
బడి మానేసిన వారిని బడికి తిరిగి రప్పించడమే కాకుండా, ప్రభుత్వ స్కూళ్లలోకి విద్యార్థులను మరలించేందుకు విద్యాశాఖ ఈ నెల 3 నుంచి ‘బడిబాట’చేపట్టింది. ప్రతి స్కూల్ పరిధిలో టీచర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలు బడిలో చేరేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
గుర్తించింది 66 వేలు..
ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల మందిని కొత్తగా చేర్పిస్తున్నామని విద్యాశాఖ చెబుతోంది. కానీ ఇప్పటివరకు బడిలో చేర్పించాల్సిన విద్యార్థులు 66,847 మందిని మాత్రమే గుర్తించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో ఒకటవ తరగతిలో చేర్చాల్సిన వారి సంఖ్య 16,038 ఉంది.
ఇందులో 12,120 మందిని అంగన్‌వాడీల్లో చేరి్పంచేందుకు పేర్లు నమోదు చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చేరేందుకు 1,181 మంది మొగ్గుచూపారు. ఇక 2,737 మంది బడిబాట బృందాలతో సంబంధం లేకుండానే స్కూళ్లలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు 2–7 తరగతుల మధ్య బడి మానేసిన పిల్లలు 8,966 మందిని కూడా గుర్తించారు. వీళ్లు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చేరారన్నది స్పష్టత ఇవ్వలేదు.
రాజధాని పరిసరాల్లోనే ఎక్కువ
బడి మానేస్తున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకన్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 4,137 మందిని గుర్తించారు. హైదరాబాద్‌లో 2,376 మంది బడి మానేసినట్టు తెలుసుకున్నారు. మెదక్‌లో 2,254 మంది, మేడ్చల్‌లో 1,457 మంది బడికి దూరమైనట్టు గుర్తించారు.
ఇక ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 3,371 మంది, నిజామాబాద్‌లో 4,107 మంది బడి మానేసిన పిల్లలున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకెళ్లని విద్యార్థుల తల్లిదండ్రులంతా దినసరి కూలీలే కావడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు పిల్లలను కూడా రోజువారీ పనులకు పంపుతున్నట్టు తేలింది. వీళ్లను గుర్తించడమే తప్ప, వీరంతా స్కూళ్లలో చేరతారా? లేదా? అనేది మాత్రం స్పష్టం కావట్లేదు.
ప్రైవేటు టీచర్లకు టార్గెట్లు
ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికీ గాలమేస్తున్నాయి. గ్రామాల్లో కొంతమందికి కమీషన్లు ఇస్తూ పిల్లల్ని తమ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరుతున్నాయి.
ఊరూరా ఫ్లెక్ల్సీలతో ప్రచారం చేస్తున్నాయి. టీచర్లకు టార్గెట్లు వి«ధించి మరీ విద్యార్థులను చేర్చేలా ఒత్తిడి చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు రాష్ట్రం మొత్తమ్మీద లక్షమంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లలో చేరినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment