సరఫరా అరకొరే | Uniforms And Text Books Delayed In West Godavari Schools | Sakshi
Sakshi News home page

సరఫరా అరకొరే

Published Thu, Jun 28 2018 11:17 AM | Last Updated on Thu, Jun 28 2018 11:17 AM

Uniforms And Text Books Delayed In West Godavari Schools - Sakshi

కొవ్వూరు మండల విద్యావనరుల కేంద్రంలో గుట్టగా పోసిన పాఠ్యపుస్తకాలు

కొవ్వూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల పట్ల సర్కారు నిర్లక్ష్య ధోరణిì ప్రదర్శిస్తోంది. పాఠశాలలు తెరిచి పక్షం రోజులయినా ఇంతవరకు యూనిఫాంలు పూర్తి స్థాయిలో అందించలేదు. దాదాపు సగం పాఠ్య పుస్తకాలు నేటికీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు తెరిచే సమయానికి యూనిఫాంలు, పుస్తకాలు అందిస్తామంటూ జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటనలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇంతవరకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు పంపిణీ కాలేదు. జిల్లా వ్యాప్తంగా 3,257 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలున్నాయి. వీటికి 16,18,664 పాఠ్య పుస్తకాలు అందించాల్సి ఉండగా ఇంతవరకు ఐదు విడతల్లో కేవలం 10,88,415 పుస్తకాలు మాత్రమే ఆయా మండలాలకు  పంపిణీ చేశారు. బుధవారం మూడు లారీల్లో 84,893 పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలకు చేరడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గత ఏడాది మిగిలినవి 1,54,010 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని మినహాయిస్తే రావాల్సిన పాఠ్యపుస్తకాల్లో సుమారు సగం మాత్రమే పంపిణీ అయినట్లు స్పష్టమవుతోంది. మరో వైపు పాఠాలు ప్రారంభమైనా పుస్తకాలు అందకపోవడంతో చదువులో వెనుకబడి పోతా మని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇంగ్లీషు పుస్తకాలు అందాల్సి ఉంది
అసలే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో కాస్త పరిజ్జానం తక్కువ. ఇప్పుడు ప్రధానంగా ఇంగ్లీషు మీడియం పుస్తకాలు ఎక్కువ శాతం సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎనిమిదో తరగతికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు బైలాజికల్‌ సైన్స్‌ పుస్తకాలు, ఏడో తరగతి వాళ్లకు ఇంగ్లీషు మీడియం సోషల్‌ స్టడీస్, ఆరో తరగతికి హిందీ రీడర్, ఇంగ్లీషు మీడియం జనరల్‌ సైన్స్, ఇంగ్లీషు రీడర్, ఒకటి నుంచి  ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం లెక్కలు పుస్తకాలు రాలేదు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకుమాత్రం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు.

కుట్టుకూలీకి దిక్కులేదు
జిల్లా వ్యాప్తంగా 48 మండలాలకు గాను ఇరవై మండలాల్లో విద్యార్థులకు క్లాత్‌ సరఫరా చేశారు. మరో ఇరవై ఎనిమిది మండలాల్లో చిన్నారులకు కుట్టించిన యూనిఫాంలు అందజేశారు. క్లాత్‌ ఇచ్చిన ఇరవై మండలాలకు ఇంత వరకు కుట్టుకూలీ సొమ్ములివ్వలేదు. ఈ భారం, బాధ్యత ఆయా ప్రధానోపాధ్యాయుల పైనే మోపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2,06,720 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 15,185 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫాంలు ఉచితంగా అందించాల్సి ఉంది. ఇంత వరకు ఐదు విడతల్లో క్లాత్, కుట్టిన యూని ఫాంలు అందించామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో జత కుట్టడానికి ఆడ, మగపిల్లలు అయినా రూ.40 లు మాత్రమే కుట్టుకూలీ ధరగా నిర్ణయించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు ఇదే కుట్టుకూలీ ధరగా నిర్ణయించారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు అదనంగా చున్నీ ఇస్తారు. అయినా కుట్టుకూలీ ధర మాత్రం అందరికీ ఒక్కటే నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఇరవై మండలాల్లో యూనిఫాం కుట్టుకూలీ భారం ప్రధానోపాధ్యాయులపై పడుతుంది. దీంతో ఈ మండలాల్లో అరకొరగానే యూనిఫాంలు వేసుకుని విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. ఇంత వరకు ఈ సొమ్ములు రాలేదు. రెండు జతలు రూ.400లుగా నిర్ణయించారు. దీనిలో ఎనభై కుట్టుకూలీ మినహాయిస్తే రూ.320లు క్లాత్‌ ధరగా తేల్చారు. వాస్తవంగా మార్కెట్‌లో ఈ సొమ్ములు కుట్టుకూలీకే సరిపోతాయి. ఈ సంవత్సరం మాత్రం రెండు జతలు రూ.600లకు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు సొమ్ములు మాత్రం విడుదల కాలేదు. కొలతలు సరాసరిన పెట్టి కుట్టించి ఇవ్వడంతో కొన్ని చోట్ల యూనిఫాంలు వదులుగా ఉండడం, చాలకపోవడం, బిగుతుగా ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement