Uniforms
-
రెండేళ్లయినా రెండు జతలే.. పాత దుస్తులతోనే..
సాక్షి,కరీంనగర్: సర్కారు పాఠశాలల్లో చదివేవిద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల యూనిఫాం దుస్తులు అందిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఉచితదుస్తుల పంపిణీకి మంగళం పాడడంతో పాత దుస్తులు వేసుకునే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇటీవల ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యపెరగడంతో దుస్తులు, పాఠ్యపుస్తకా లు, సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. రెండేళ్లుగా దుస్తుల పంపిణీ లేకపోవడంతో చాలా చోట్ల సాధారణ దుస్తులతోనే విద్యార్థులు బడికివెళ్తున్నారు. కరోనా ఉధృతి తగ్గాక ఈ ఏడాది సెప్టెంబరు 1నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా.. ఇప్పటి వరకు ఏకరూ ప దుస్తులు అందలేదు.కుట్టించడానికి వస్త్రం కూడా జిల్లాకు రాలేదు. గతంలో ఇచ్చిన ఏకరూప దుస్తులు పెరిగిన పిల్లలకు పొట్టివై పనికి రావడం లేదు. జిల్లాలో 652 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 42,218 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఏటా రెండు జతల దుస్తులను ప్రభుత్వం అందిస్తోంది. టెస్కో సంస్థ నుంచి దుస్తులకు అవసరమైన వస్త్రాన్ని సరఫరా చేసేది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు.. తప్ప దుస్తుల పంపిణీ జరుగలేదు. ‘రెండు జతల దుస్తుల పంపిణీపై జిల్లా నుంచి నివేదిక పంపించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటిని విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. రాగానే అందరికి పంపిణీ చేస్తాం’ అని డీఈవో జనార్ధన్‌రావు తెలిపారు. చదవండి: ‘సచ్చినా సరే.. టీకా మాత్రం వేసుకోను’ -
3 కోట్ల 65 లక్షలతో కార్మికులకు యూనిఫాం
సాక్షి, కరీంనగర్ : సింగరేణి కార్మికులకు యూనిఫాం కొనుగోలు, 4 భూగర్భ గనుల మైనింగ్ ప్లానులకు, ఒక కొత్త ఓ.సి. గనికి అనుమతితో పాటు సింగరేణిలో 3వ దశ సోలార్ పవర్ ప్లాంటుల నిర్మాణం కాంట్రాక్టులకు సిఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శనివారం జరిగిన 555వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఎన్.శ్రీధర్ అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రానున్న కాలంలో నిర్దేశించుకొన్న అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా కొత్తగూడెం ఏరియా పరిధిలో మరో ఓపెన్ కాస్ట్ గని నిర్మాణానికి ఏర్పటు చేయనున్నామన్నారు. అలాగే ప్రస్తుత భూగర్భ గనుల విస్తరణలో భాగంగా కాసీపేట, ఆర్.కె.-1 ఎ, శ్రీరాంపూర్ 1, శ్రీరాంపూర్ 3, 3ఎ గనుల మైనింగ్ ప్లానులకు బోర్డు అనుమతించిందన్నారు. దీంతోపాటు సింగరేణి కార్మికులకు రెండు జతల యూనిఫాంలను 3 కోట్ల 65 లక్షల రూపాయలతో యూనిఫాంలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణా రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుంచి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతించింది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటుల నిర్మాణంలో చివరిదైన 3వ దశ నిర్మాణం పనుల కాంట్రాక్టుల అప్పగింతకు బోర్డు అనుమతించిందన్నారు. ఈ 3వ దశలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వాటర్ రిజర్వాయర్ పైన 10 మెగావాట్లు, మూతపడిన బెల్లంపల్లి డోర్లీ ఓ.సి. గని క్వారీ నీటిపై 5 మెగావాట్ల సామర్థ్యంతోనీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులతో పాటు కొత్తగూడెం, చెన్నూరు లో నేలపై నిర్మించే సోలార్ ప్లాంటు, ఆర్.జి. ఓ.సి.-1, డోర్లీ ఓ.సి.-1 ఓవర్ బర్డెన్ డంపుల మీద నిర్మించే సోలార్ ప్లాంటుల నిర్మాణం పనుల అప్పగింత ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయన్నారు. రానున్న రెండేళ్లకు ఓ.సి. గనుల్లో వాడే పేలుడు పదార్ధాల కొనుగోలుకు, కంపెనీ నిర్వహిస్తున్న పేలుడు పదార్ధాల ఉత్పత్తి ప్లాంటులకు కావాలసిన అమ్మోనియాం నెట్రేట్, మొదలగు వాటి కొనుగోలుకు, రూఫ్ బోల్టుల కొనుగోలు తదితర పనులకు బోర్డు తన అంగీకారం తెలిపిందని వెల్లడించారు. సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (డైరెక్టర్ ఆపరేషన్స్ & పా), ఎన్.బలరామ్ (డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పి&పి), డి.సత్యనారాయణ రావు (డైరెక్టర్ ఇ&ఎం) పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఢిల్లీ నుంచి బొగ్గు శాఖ సహాయ కార్యదర్శులు పి.ఎస్.ఎల్.స్వామి, అజితేష్ కుమార్, నాగపూర్ నుండి వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ ఛైర్మన్ ఆర్.ఆర్.మిశ్రా లు పాల్గొన్నారు. కార్యక్రమంలో జి.ఎం. (సి.డి.ఎన్.) కె.రవిశంకర్, కంపెనీ వ్యవహారాల కార్యదర్శి మురళీధర్ రావులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులను వణికిస్తోన్న ప్రైవేటు స్కూలు ఫీజులు
సాక్షి, తాడూరు(నాగర్ కర్నూలు): ఈనెల 12నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రులకు టెన్షన్ ప్రారంభమైంది. పిల్లలను ఏ కళాశాలలో, ఏ పాఠశాలలో చేర్పించాలన్న తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. కాగా, ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలంటే వేలకు వేలు ఫీజులు ఉండడంతో తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. పాఠశాల అడ్మిషన్ ఫీజుతో పాటు వారికి కావాల్సిన ఇతర సామగ్రిని కలుపుకొని రెండింతలు కావడంతో అయోమయంలో పడిపోతున్నారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. యూనిఫామ్స్, బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు సంసిద్ధం అవుతున్నారు. దీంతో స్టేషనరీ, జనరల్, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షల దుకాణాలు, విద్యా సంబంధిత వస్తు సామగ్రి దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇంగ్లిష్, తెలుగు మీడియం అయినా యూనిఫామ్ తప్పని సరి. పోటాపోటీగా ప్రచారం ప్రైవేట్ పాఠశాలలో పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. పిల్లలను స్కూల్ చేర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు అధికంగా ఉన్నా దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు విధిగా యాజమాన్యాలు నిర్దేశించిన యూనిఫామ్ ధరించాలి. దీనికి తోడు విద్యా సామాగ్రి, ధరలు అధికంగా ఉన్నాయి. స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్, నోట్ పుస్తకాలు, విద్యా సామాగ్రి విద్యార్థుల తల్లిదండ్రులు కొనుగోలు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలలో చేర్పించే క్రమంలో నిమగ్నమయ్యారు. చిన్నారుల విద్య కోసం బడ్జెట్ వేసుకొని విద్యా సామాగ్రి కొనుగోలు చేసుకుంటున్నారు. ఫీజుల మోత ప్రైవేట్ పాఠశాలలో నర్సరీకి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఫీజులు ఉన్నాయి. ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి ఇలా తరగతుల వారిగా రూ.5వేల చొప్పున ఫీజులు పెరుగుతున్నాయి. దీనికి తోడు పుస్తకాలు, ఇతర వాహనాల చార్జీలు కలుపుకుంటే ఫీజులు కట్టడానికి మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పాఠ్య పుస్తకాలు, ఎమ్మార్సీ భవనానికి చేరుతున్నాయి. అనుమతి లేని విద్యాసంస్థలతో ఇబ్బందులు మండలంలో అనుమతులు లేని పాఠశాలలపై అధికారులు దృష్టి సారించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడం, వారిని తిరిగి ఇతర పాఠశాలలో చేర్పించే సమయంలో రికార్డు సీట్స్, టీసీలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం ఆడిండే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రైవేట్ యాజమాన్యాలను నియంత్రించే దిశలో అధికారులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధరలు పెరిగాయి పెరిగిన విద్యా సామగ్రి ధరలను తట్టుకోలేకపోతున్నాం. వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగించే తమకు విద్యా సామాగ్రి కొనుగోలు పిల్లల చదువు విషయంలో ప్రతి పైసా బేరీజు వేసుకుంటూ నిర్ణయం తీసుకుంటాం. మాలాంటి కుటుంబాలకు చదువు భారంగా మారుతుంది. – శ్రీశైలం, గుంతకోడూరు ఫీజులు నియంత్రించాలి ప్రైవేట్ పాఠశాలలో అధిక మొత్తంలో ఫీజలు వసూలు చేస్తున్నారు. వాటిని నియంత్రించాలి. ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేయాలి. అధికారులు సకాలంలో పాఠశాలలో మౌలిక వసతులపై స్పందించాలి. – కురుమూర్తి, తాడూరు -
స్కూల్‌కు డుమ్మా కొట్టడం కుదరదిక!
బీజింగ్: స్కూల్‌కు, కాలేజీకి వెళ్తున్నామని చెప్పి... డుమ్మాలు కొట్టే విద్యార్థుల ఆటలు ఇకపై సాగవు. ఎందుకంటే మీరెక్కడున్నా ఇట్టే చెప్పేసే స్మార్ట్ యూనిఫామ్స్ వచ్చేస్తున్నాయి. అద్భుతాలకు అడ్డాగా చెప్పుకునే చైనా ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. స్కూల్ ఎగ్గొట్టి బయట తిరుగుతున్న విద్యార్థులకు చెక్ పెట్టేందుకు ‘స్మార్ట్ యూనిఫామ్స్’ను ప్రయోగిస్తోంది. యూనిఫామ్‌లకు అమర్చిన చిప్‌ల ద్వారా విద్యార్థులు ఏ సమయంలో స్కూల్‌కి వచ్చారో? ఎప్పుడు బయటికి వెళ్లారో? లొకేషన్తోసహా తల్లిదండ్రులేకాదు.. పాఠశాలల యాజామాన్యాలు కూడా పర్యవేక్షించవచ్చు. ‘‘విద్యార్థులు స్కూల్లో ప్రవేశించగానే ఫోటో, వీడియో తీసేందుకు స్మార్ట్ యూనిఫామ్‌లు సాయం చేస్తాయి’’ అని గిఝౌ ప్రావిన్స్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపాల్ ర్యాన్ రుగ్జియాంగ్ పేర్కొన్నారు. ఈ స్కూల్లో గతేడాది నవంబర్ నుంచే స్మార్ట్ యూనిఫామ్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ విద్యార్థులు అనుమతి లేకుండా స్కూల్ నుంచి బయటికి వెళ్తే వెంటనే ఆటోమేటిక్ వాయిస్ అలారం మోగుతుందట. స్కూల్ తలుపులపై అమర్చిన ఫేషియల్ రికగ్నిషన్ డివైజ్‌లను యూనిఫామ్‌లకు అనుసంధానం చేయడం వల్ల.. ఎవరైనా యూనిఫామ్ మార్చుకునేందుకు ప్రయత్నించినా ఇట్టే తెలిసిపోతుందట. విద్యార్థులు తప్పిపోయినా, తరగతులు ఎగ్గొట్టినా ఎక్కడున్నారో తెలుసుకునేందుకు స్మార్ట్ యూనిఫామ్‌లు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. యూనిఫామ్‌లోని చిప్‌తో అనుసంధానమైన యాప్ ద్వారా విద్యార్థులకు హోమ్‌వర్క్‌లు, నోటిఫికేషన్లు కూడా పంపుతున్నారట! -
అ'డ్రెస్' లేదు!
చిలకలూరిపేట: విద్యార్థులకు యూనిఫాం అందించడంలో ప్రతి ఏటా ప్రభుత్వం విఫలమవుతోంది. పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో విద్యార్థులకు యూనిఫాం అందలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేస్తోంది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేస్తోంది. 2016–17 విద్య సంవత్సరంలోనూ మార్చి వరకు విద్యార్థులకు యూనిఫాం ఇస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 శాతం మందికి విద్యార్థులకు కూడా యూనిఫాం అందని పరిస్థితి నెలకొంది. ఎస్ఎస్ఏ ద్వారా.. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం అందజేయాల్సి ఉంది. జిల్లాలో 3565 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో బాలురు 1,26,439 మంది, బాలికలు 1,34,734 మంది కలిపి మొత్తం 2,61,173 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 91,338 మంది విద్యార్థులకు మాత్రమే దుస్తులను అందజేశారు. ఒకటి నుంచి ఏడవ తరగతి బాలురకు చొక్కా, నిక్కరు, బాలికలకు చొక్కా, స్కర్టు ఇవ్వాలి. ఎనిమిదో తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాడీ దుస్తులు అందించాలి. ఈ క్రమంలోనే ప్రభుత్వం క్లాత్ కొనుగోలు చేసి యూనిఫాం కుట్టించే బాధ్యతను ఆప్కోకు అప్పగించింది. ప్రైవేటులో మరోలా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు వేసవి సెలవల్లోనే యూనిఫాం, పుస్తకాల అమ్మకాలు మొదలుపెడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ తీరు, అధికారుల అలసత్వం కారణంగా విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో ప్రతిసారి ఆలస్యం జరుగుతోంది. దీంతో చాలా మంది విద్యార్థులు పాత, చిరిగిన దుస్తులతోనే సూల్‌కి వెళ్తున్నారు. ఆగస్టు నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అందరికీ పూర్తిస్థాయిలో యూనిఫాం అందజేసేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు చెబుతున్నా.. ఆచరణలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కమిషన్ల కోసమే ప్రతియేటా ఇలా యూనిఫాం సరఫరాలో ఆలస్యం చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఆప్కో అధికారులు మండల కేంద్రాలకు దుస్తులను సకాలంలో అందించడంలో విఫలమవుతున్నారు. అక్కడి నుంచి అవి పాఠశాలలకు చేరే సరికి మరింత జాప్యం జగరుగుతోంది. ఫలితంగా కొంతమేర సిద్ధంగా ఉన్న దుస్తులు కూడా విద్యార్థులకు సకాలంలో అందటం లేదని విమర్శలు వస్తున్నాయి. త్వరలో పంపిణీ పూర్తి చేస్తాం.. యూనిఫాం సరఫరా బాధ్యతను ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. యూని ఫాం విషయమై ఆప్కో అధికారులతో తరచు సంప్రదిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలోని 26 మండలాల్లోని పాఠశాలలకు యూనిఫాం అందజేశాం. మరో 31 మండలాలకు అందాల్సి ఉంది. ఈ నెలలో విద్యార్థులందరికీ యూనిఫాం అందేలా చర్యలు తీసుకుంటాం.– అరుణకుమారి, సీఎంవో, సర్వశిక్ష అభియాన్ -
సరఫరా అరకొరే
కొవ్వూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల పట్ల సర్కారు నిర్లక్ష్య ధోరణిì ప్రదర్శిస్తోంది. పాఠశాలలు తెరిచి పక్షం రోజులయినా ఇంతవరకు యూనిఫాంలు పూర్తి స్థాయిలో అందించలేదు. దాదాపు సగం పాఠ్య పుస్తకాలు నేటికీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు తెరిచే సమయానికి యూనిఫాంలు, పుస్తకాలు అందిస్తామంటూ జిల్లా కలెక్టర్ భాస్కర్ ప్రకటనలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇంతవరకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు పంపిణీ కాలేదు. జిల్లా వ్యాప్తంగా 3,257 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలున్నాయి. వీటికి 16,18,664 పాఠ్య పుస్తకాలు అందించాల్సి ఉండగా ఇంతవరకు ఐదు విడతల్లో కేవలం 10,88,415 పుస్తకాలు మాత్రమే ఆయా మండలాలకు పంపిణీ చేశారు. బుధవారం మూడు లారీల్లో 84,893 పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలకు చేరడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గత ఏడాది మిగిలినవి 1,54,010 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని మినహాయిస్తే రావాల్సిన పాఠ్యపుస్తకాల్లో సుమారు సగం మాత్రమే పంపిణీ అయినట్లు స్పష్టమవుతోంది. మరో వైపు పాఠాలు ప్రారంభమైనా పుస్తకాలు అందకపోవడంతో చదువులో వెనుకబడి పోతా మని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు పుస్తకాలు అందాల్సి ఉంది అసలే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో కాస్త పరిజ్జానం తక్కువ. ఇప్పుడు ప్రధానంగా ఇంగ్లీషు మీడియం పుస్తకాలు ఎక్కువ శాతం సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎనిమిదో తరగతికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు బైలాజికల్ సైన్స్ పుస్తకాలు, ఏడో తరగతి వాళ్లకు ఇంగ్లీషు మీడియం సోషల్ స్టడీస్, ఆరో తరగతికి హిందీ రీడర్, ఇంగ్లీషు మీడియం జనరల్ సైన్స్, ఇంగ్లీషు రీడర్, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం లెక్కలు పుస్తకాలు రాలేదు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకుమాత్రం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. కుట్టుకూలీకి దిక్కులేదు జిల్లా వ్యాప్తంగా 48 మండలాలకు గాను ఇరవై మండలాల్లో విద్యార్థులకు క్లాత్ సరఫరా చేశారు. మరో ఇరవై ఎనిమిది మండలాల్లో చిన్నారులకు కుట్టించిన యూనిఫాంలు అందజేశారు. క్లాత్ ఇచ్చిన ఇరవై మండలాలకు ఇంత వరకు కుట్టుకూలీ సొమ్ములివ్వలేదు. ఈ భారం, బాధ్యత ఆయా ప్రధానోపాధ్యాయుల పైనే మోపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2,06,720 మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 15,185 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున యూనిఫాంలు ఉచితంగా అందించాల్సి ఉంది. ఇంత వరకు ఐదు విడతల్లో క్లాత్, కుట్టిన యూని ఫాంలు అందించామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో జత కుట్టడానికి ఆడ, మగపిల్లలు అయినా రూ.40 లు మాత్రమే కుట్టుకూలీ ధరగా నిర్ణయించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకు ఇదే కుట్టుకూలీ ధరగా నిర్ణయించారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు అదనంగా చున్నీ ఇస్తారు. అయినా కుట్టుకూలీ ధర మాత్రం అందరికీ ఒక్కటే నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఇరవై మండలాల్లో యూనిఫాం కుట్టుకూలీ భారం ప్రధానోపాధ్యాయులపై పడుతుంది. దీంతో ఈ మండలాల్లో అరకొరగానే యూనిఫాంలు వేసుకుని విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. ఇంత వరకు ఈ సొమ్ములు రాలేదు. రెండు జతలు రూ.400లుగా నిర్ణయించారు. దీనిలో ఎనభై కుట్టుకూలీ మినహాయిస్తే రూ.320లు క్లాత్ ధరగా తేల్చారు. వాస్తవంగా మార్కెట్లో ఈ సొమ్ములు కుట్టుకూలీకే సరిపోతాయి. ఈ సంవత్సరం మాత్రం రెండు జతలు రూ.600లకు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు సొమ్ములు మాత్రం విడుదల కాలేదు. కొలతలు సరాసరిన పెట్టి కుట్టించి ఇవ్వడంతో కొన్ని చోట్ల యూనిఫాంలు వదులుగా ఉండడం, చాలకపోవడం, బిగుతుగా ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
ప్రమాదంలో భద్రత !
సాక్షి, న్యూఢిల్లీ : భారత సైనికులు యూనిఫామ్.. సరిహద్దు నగరాల్లో అత్యంత చౌకగా అమ్మేస్తున్నారు. రాజస్తాన్‌లో సైనిక దుస్తులను అక్రమంగా కేవలం రూ. 500, రూ. 1000కే విక్రయిస్తున్నారు. ఇటువంటి చర్యలు దేశ భద్రతకు, సైనికులు రక్షణకు సవాలు విసిరే అవకాశముంది. రాజస్థాన్ సరిహద్దు పట్టణాల్లోని సైనిక వస్తువులు విక్రయించే దుకాణదారులు.. యధేచ్చగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. రక్షణ విభాగాల్లోని పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూసిన తరువాతే.. డిఫెన్స్ దుకాణదారులు వస్తువులు అమ్మాలన్న నిబంధన ఉంది. అయితే దీనిని దుకాణ యజమానులు తుంగలో తొక్కి యధేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. పొరపాటున ఈ దస్తులు శత్రుసైనికుల చేతుల్లోకి వెళితే.. భద్రతాపరంగా పెనుముప్పుకు దారితీస్తుంది. ముష్కరులు సైనిక దుస్తుల్లో వచ్చే.. పఠాన్‌కోట్‌పై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒక్క యూనిఫామ్ మాత్రమేకాకుండా.. బూట్లు, జాకెట్లు, బెల్ట్, బెడ్ రోల్స్ వంటివి కూడా.. బహిరంగంగా అమ్ముతున్నారు. ఇదిలావుండగా.. పఠాన్‌కోట్ ఘటన తరువాత పంజాబ్‌లో ఆర్మీ వస్తువుల అమ్మకాలపై నిషేధం విధించారు. సైనిక దుస్తులు, ఇతర వస్తువులు అవసరమైన వ్యక్తి తగిన గుర్తింపుకార్డులు పొందుపరిచి.. ప్రభుత్వం ఎంపిక చేసిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. -
ఏకరూప దుస్తులు కొందరికేనా?
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించండి... ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు ప్రచారం చేశారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఊదరగొట్టిన వారు పిల్లలను పాఠశాలలో చేర్చుకున్న తర్వాత చెప్పినవన్నీ మరిచిపోయారు. విద్యాసంవత్సరం సగం ముగిసినా ఏకరూప దుస్తులు కొందరికి ఇంత వరకూ అందలేదు. దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం విద్యాశాఖాధికారులకు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. చిరిగిన పాత దుస్తులతో పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల దుస్థితిని పట్టించుకోని పాలకుల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు. కందుకూరు రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ చదువుతున్న పాఠశాలల్లోని బాలబాలికలకు ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫారం పంపిణీ చేస్తుంది. ఈ తరగతుల్లో 2,29,428 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో 1,20,159 మంది బాలికలుకాగా, 1,09,269 మంది బాలురు ఉన్నారు. గతంలో పాఠశాల ఖాతాలకు నగదు జమచేస్తే హెచ్ఎంలు వాటిని ఖర్చు చేసి క్లాత్, కుట్టు కూలి ఇచ్చి దుస్తులను కుట్టించేవారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానానికి స్వస్తిపలికారు. తొలి ఏడాది పాఠశాల యాజమాన్య కమిటీలు లేకపోవడంతో రాజకీయ ప్రతినిధులు సూచించిన వారికి కాంట్రాక్టుగా ఇచ్చేశారు. గత ఏడాది ఆప్కోకు అప్పగించినా వారు వాటిని కుట్టించి పంపిణీ చేసేసరికి విద్యా సంవత్సరం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కనీసం జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కార్యాలయాలకు కూడా సంబంధం లేకుండా ఏకంగా> ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయాల నుంచే విజయవాడ ఆప్కోకు రాష్ట్రవ్యాప్తంగా దుస్తులు కుట్టించి ఇచ్చే పని అప్పగించారు. ఒక జత క్లాత్, కుట్టు కూలి కలిపి రూ.200 చొప్పున రెండు జతలు రూ.400లు చొప్పున ఎస్ఎస్ఏ కార్యాలయం ఆప్కోకు చెల్లిస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే యూనిఫారం పంపిణీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించి అయిదు మాసాలు గడిచినా ఇంకా జిల్లాలో 19 మండలాల్లో విద్యార్థులకు యూనిఫారం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఆప్కో చెబుతున్న లెక్కల ప్రకారం 71,024 మంది బాలురకు, 78103 మంది బాలికలకు దుస్తులు పంపిణీ అయ్యాయి. ఇంకా 38425 మంది బాలు రకు, 42056 మంది బాలికలకు పంపిణీ చేయాల్సి ఉంది. అంటే ఇప్పటికి పంపిణీ చేసింది 65 శాతం మాత్రమే. సర్వశిక్షా అభియాన్ అధికారులు మాత్రం మిగిలిన 35 శాతం యూనిఫారం ఈనెలాఖరులోగా పంపిణీ చేస్తామని పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అందరూ పేదలే.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో అధిక శాతం పేద విద్యార్థులే. అలాంటి పేద విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు ఇప్పటి వరకూ అందించకపోవడంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించవద్దని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని రెండు జతలు యూనిఫాం ఉచితంగా ఇస్తామని మాటలు చెప్పారు. కానీ ఇంత వరకూ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. పాత దుస్తులతోనే పాఠశాలలకు... పేద విద్యార్థులు పాత దుస్తులతోనే పాఠశాలలకు వస్తున్నారు. చొక్కాలకు గుండీలు ఊడిపోవడంతో పిన్నీసులు పెట్టుకొని వస్తున్నారు. పాత మాసిపోయిన దుస్తులతో పాఠశాలకు వస్తున్నప్పటికీ అధికారులు స్పందిం చడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి ఏకరూప దుస్తులు త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నెలాఖరికల్లా అందుతాయి : ఏకరూప దుస్తులు సర్వశిక్షా అభియాన్ నుంచి రావాల్సి ఉంది. గత సమావేశంలో ఎస్ఎస్ఏ పీఓ ఈ నెలాఖరికల్లా అన్ని మండలాల పాఠశాలలకు ఏకరూప దుస్తులు అందుతాయని చెప్పారు. రాగానే విద్యార్థులకు అందిస్తాం.- జి.సుబ్బరత్నం, డిప్యూటీ డీఈఓ, కందుకూరు -
పంద్రాగస్టుకైనా.. అందేనా!
నీరుగారుతున్న విద్యాహక్కు చట్టం ఏటా ఏడాది చివర్లోనే యూనిఫాం పంపిణీ నెరవేరని ప్రభుత్వ లక్ష్యం జిల్లాకు 3.44 లక్షల విద్యార్థులకు యూనిఫాంలు అవసరం రాయవరం : బడిలో అందరూ సమానమన్న భావన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తప్పనిసరిగా యూనిఫామ్ అందజేస్తున్నారు. జాతీయతను చాటుతూ కులమతాలకు అతీతంగా పిల్లలందరూ ఐక్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి రెండు జతల యూనిఫామ్ పంపిణీ కార్యక్రమానికి 2009లో శ్రీకారం చుట్టారు. ఏటా యూనిఫామ్ పంపిణీలో జాప్యం చోటు చేసుకుంటోంది. పాఠశాలలు తెరిచి రెండు నెలలు కావస్తున్నా యూనిఫామ్ అందలేదు. పంద్రాగస్టు పండుగకైనా యూనిఫామ్ అందేలా కన్పించడం లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం.. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు యూనిఫారంను ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న బాలురకు నీలం రంగు నిక్కర్, తెలుపు, నీలం రంగు గళ్ల షర్ట్, బాలికలకు నీలం రంగు గౌను, తెలుపు, నీలం రంగు గళ్ల షర్ట్, 6,7,8 తరగతుల విద్యార్థులకు అదే రంగు పంజాబీ డ్రస్‌ను సరఫరా చేయాల్సి ఉంది. 2015–16 విద్యా సంవత్సరంలో పాఠశాల పునఃప్రారంభం నాటికి పంపిణీ చేయాల్సిన యూనిఫామ్ విద్యాసంవత్సరం ఆఖర్లో పంపిణీ చేశారు. 2016–17 విద్యా సంవత్సరంలోనైనా సమయానికి యూనిఫామ్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఆగస్టు 15 జెండా పండుగ నాటికి ఇస్తే విద్యార్థులకు నిజంగా పండుగలాగే ఉండేది. ఈ ఏడాది ఇప్పటికింకా క్లాత్ మండల కేంద్రాలకు చేరుకోలేదు. జిల్లాలో 3.44 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు మూడు లక్షల 44వేల 154 మంది ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. వీరిలో ఒక లక్ష 60వేల 224 మంది బాలురు, ఒక లక్ష 73వేల 930 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ యూనిఫాంలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒక్కొక్క విద్యార్థికి యూనిఫాం నిమిత్తం ప్రభుత్వం రూ.200 వెచ్చిస్తుంది. యూనిఫాం సరఫరా చేసే ఆప్కో కంపెనీకి రూ.160, కుట్టుకూలికి రూ.40 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా జిల్లాలో ఉన్న మూడు లక్షల 44వేల 154 మంది విద్యార్థులకు రెండు జతల వంతున రూ.13కోట్ల 76 లక్షల 61వేల 600లు చెల్లించనుంది. ఈ ఏడాది యూనిఫామ్‌ను ఆప్కో సంస్థ సరఫరా చేయనుంది. అయితే ఈ ఏడాది కొన్ని పాఠశాలలకు క్లాత్ సరఫరా జరిగినా మెజార్టీ పాఠశాలలకు క్లాత్ సరఫరా కాలేదు. 6,7,8 తరగతుల విద్యార్థినులకు చున్నీల క్లాత్ కూడా అందజేస్తారు. 6వ తరగతి విద్యార్థినులకు 1.40మీ, 7వ తరగతికి 1.50మీ, 8వ తరగతికి 1.80మీటర్ల వంతున చున్నీ క్లాత్ అందజేస్తారు. ఒక్కొక్కరికి రెండు చున్నీల వంతున క్లాత్ ఇస్తారు. యూనిఫామ్ క్లాత్ తరగతుల వారీగా ఇలా ఇస్తారు తరగతి బాలురకు బాలికలు షర్ట్ నిక్కరు ఫ్రాక్ షర్ట్ 1,2 0.70మీ 0.30మీ 1.75మీ 0.75మీ 3,4l 1.05మీ 0.40మీ 0.80మీ 0.90మీ 5 1.20మీ 0.50మీ 1.10మీ 1.10మీ 6 1.20మీ 0.50మీ 1.35మీ 1.15మీ 7 1.35మీ 0.60మీ 1.50మీ 1.25మీ 8 1.40మీ 0.95మీ 1.65మీ 1.35మీ వెంటనే సరఫరా చేయాలి.. యూనిఫామ్‌ను సమయానికి ఇవ్వాలి. పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేయాలి. అయినా నేటికీ సరఫరా చేయక పోవడం విచారకరం. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. – చిన్నం అపర్ణాదేవి, జెడ్పీటీసీ, రాయవరం. -
‘ఏకరూప’త ఏదీ?
♦ యూనిఫారాలకు పంపని ప్రతిపాదనలు ♦ పాత దుస్తులతోనే విద్యార్థుల బడిబాట ♦ ప్రైవేటుతో పోటీ అంటే ఇదేనా? ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఫలితాలే కాదు వసతులు, పాఠ్యాంశాల బోధన.. ఇలా ఎందులోనూ తేడా రాకుండా చూస్తాం... అంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. అయితే ఇవన్నీ ఒట్టిమాటలేనని తేలిపోయింది. పాఠశాలలు పునఃప్రారంభమైనా ఇప్పటివరకు యూనిఫారాలకే దిక్కులేదు. క్రమశిక్షణతోపాటు పాఠశాలలో చదివే పిల్లలంతా సమానమని తెలియజేసే ఏకరూప దుస్తుల పంపిణీ ముచ్చటే లేదు. ఇప్పటివరకు ప్రతిపాదనలే సిద్ధం కాలేదంటే అవి ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి. యూనిఫారాల వద్దే విద్యాశాఖ బోల్తా పడిందంటే మిగతా విషయాల్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ఎక్కడ పోటీపడుతుందో పాలకులకు, అధికారులకే తెలియాలి. సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందుకుగాను 7 లక్షల యూనిఫారాలు అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జూన్ 12లోగా స్కూల్ యూనిఫారాల వివరాలను తీసుకునేది. కానీ తొలిసారిగా జూన్ ఒకటి నుంచే స్కూలు యూనిఫారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు గతంలో రెండోతరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం స్కూలు యూనిఫారాలను ప్రభుత్వం ఇచ్చేది. కానీ తాజాగా ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫారాలను ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారనే విషయమై అధికారులు ఇంతవరకు అంచనాకు రాలేకపోయారు. ఎన్ని యూనిఫారాలు అవసరమో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది 2.54 లక్షల మంది విద్యార్థులకు 5.09 లక్షల యూనిఫారాలు అందజేయడానికి అవసరమైన క్లాత్ సరఫరా కోసం ఆప్కోకు అనుమతి ఇచ్చింది. క్లాత్‌ను సరఫరా చేసిన అనంతరం స్థానిక మహిళా సంఘాలు, పలు ప్రైవేటుఏజెన్సీలకు కుట్టడానికి ఇచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరం మాత్రం అధికారులు కనీసం యూనిఫారాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?, క్లాత్ ఎంత అవసరం అనే ప్రతిపాదనలు సిద్ధం చేయలేకపోయారు. మరో వైపు గత ఏడాది మాదిరిగానే రెండోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2.17 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి స్కూలు యూనిఫారాలు సరఫరా చేయడం కోసం ప్రతిపాదనలు తయారు చేసిన ప్రభుత్వం ఈసారి ఒకటో తరగతి విద్యార్థులకు కూడా యూనిఫారాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపాదనలు పంపలేకపోయామని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా ఏటా పాఠశాలలు పునఃప్రారంభం కాగానే కొత్త పాఠ్యపుస్తకాలతోపాటు స్కూల్ యూనిఫారాలు అందజేసేది. ఈ సారి మాత్రం కనీసం ఎన్ని యూనిఫారాలు అవసరమున్నాయో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేకపోయారు. దీంతో పాత దుస్తులతోనే విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విషయంపై ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేకపోయారు. -
షూస్ పాలిష్ చేస్తున్నారా!!
ఇంటిప్స్ పాఠశాలలు మొదలవబోతున్నాయి. పిల్లలకు కొనాల్సిన జాబితాలో యూనిఫామ్స్, షూస్ (బూట్లు) తప్పనిసరి. నలుపు, తెలుపు రంగు అంటూ ఓ రెండు రకాల షూస్ కొంటే ఏడాదంతా చూసుకోనవసరం లేదు అనుకోవడానికి లేదు. ఇంట్లోనూ, స్కూల్లోనూ చదువుల ఒత్తిడితో నలిగిపోయే పిల్లలకు షూస్ పెద్ద భారం కాకూడదు. ఏడాది పొడవునా పిల్లల పాదాలను సంరక్షించే షూస్ విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు షూస్ తయారీదారులు, సప్లయర్ల కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ సాహిల్ గుప్తా. వారు ఇస్తున్న కొన్ని సూచనలు ఇవి. స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఎగుడుదిగుడు రోడ్లలో పరిగెడుతుంటారు. దుమ్ములో నడుస్తుంటారు. ఇసుకలో గెంతులేస్తుంటారు. పాదాన్ని సంరక్షిస్తున్నట్టుగా షూస్ లేకపోతే అడ్డంకే. అందుకే ఎదిగే పాదానికి తగ్గట్టుగా షూస్ ఎంపిక ఉండాలి. పిల్లవాడి పాదానికన్నా ఒక అంగుళం పెద్ద సైజు షూస్ తీసుకోవాలి.చర్మం ఏ తరహా మెటీరియల్‌ను ఇష్టపడుతుందో షూస్‌ని బట్టి తెలుసుకోవచ్చు. మిగతావాటన్నింటికన్నా లెదర్‌ని మాత్రమే చర్మం భరిస్తుంది. పాదాలకు సౌకర్యంగా ఉంటుంది. మురికిపటినా, ఇసుక చేరినా ఏ రోజుకారోజు శుభ్రం చేయకపోతే.. పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని రోజూ పాఠశాల నుంచి రాగానే ముందుగా షూస్ బయటే వదిలేయమని చెప్పాలి. {పతీరోజూ పాలిష్ చేస్తే షూస్ ఎక్కువ రోజులు మన్నుతాయి. షూ పాలిష్‌లో రెండు పద్ధతులున్నాయి. క్రీమ్ పాలిష్ పోయిన కలర్‌ని తిరిగి తెప్పిస్తుంది. వ్యాక్స్ పాలిష్ షూ మెరిసేలా చేస్తుంది. అందుకని స్కూల్ షూస్‌కి ఎప్పుడైనా క్రీమ్ పాలిష్ బెస్ట్ ఆప్షన్. దీని తర్వాత వ్యాక్స్ పాలిష్‌తో ఒక కోట్ వేస్తే షూస్ మెరుస్తాయి. షూస్ పాలిషింగ్ రోజూ చేయడం వల్ల ఎక్కడైనా చిరిగినా, మడమ దగ్గర విడిపోయినా, లేసులు ఊడిపోయినా తెలుసుకోవడం సులువు అవుతుంది. ఇవన్నీ పిల్లలు బాగా గుర్తించగలరు కాబట్టి రోజూ తమ షూస్ పాలిష్ చేసే బాధ్యతను వారికే అప్పగించాలి. అందరివీ ఒకే చోట కాకుండా పిల్లలకోసం షూస్ కేస్ ప్రత్యేకంగా కేటాయించడం వల్ల శుభ్రత బాగుంటుంది. పని సులువు అవుతుంది.వర్షాకాలంలో షూస్ తడిగా ఉండే అవకాశాలు ఎక్కువ. వాటిని పొడిబార్చడానికి వేడి చేయడం, లోపల న్యూస్ పేపర్లు పెట్టడం వంటివి చేస్తే... అవి దుర్వాసన రావడంతో పాటు, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకని, రాత్రిపూట సోడా బై కార్బనేట్ను షూస్ లోపల చల్లి ఉంచాలి. దీని వల్ల తేమ తగ్గడమూ, బాక్టీరియా నశించడమూ రెండూ జరుగుతాయి.స్కూళ్లలో చెప్పే పాఠాలలో టీచర్లు షూస్ కేర్ గురించి కూడా వివరిస్తే పిల్లలు తమ పాదాల సంరక్షణ పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. షూ పాలిష్ చేయడం ఎలాగో పిల్లలకే చెబితే తల్లిదండ్రులకూ పని సులువు అవుతుంది. ఈ అలవాటు వల్ల పిల్లలకు షూస్ పరిశుభ్రత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. -
యూపీ వీధుల్లో కుప్పలుగా ఆర్మీ దుస్తులు
లక్నో: భారత సైనికులకు మాత్రమే లభించే ఆర్మీ దుస్తులు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో వీధివీధిలో అలవోకగా లభిస్తున్నాయి. భారత సైన్యం అధికారిక ముద్రతో ఉన్న దుస్తులను సాధారణ వస్త్ర దుకాణాదారులు కూడా విక్రయిస్తున్నారు. పఠాన్ కోట్ పై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు కూడా ఆర్మీ దుస్తుల్లోనే వైమానిక స్థావరంలోకి చొరబడినట్లు గుర్తించడంతో ఆర్మీ వాడే వస్తువుల విషయంలో కూడా ఇప్పుడు ఆందోళనగా మారింది. ఆర్మీ దుస్తులు, బూట్లు ఎక్కడబడితే అక్కడ లభించడం భద్రతపరంగా తనిఖీ చేసుకోవాల్సిన అంశమేనని పలువురు చెప్తున్నారు. యూపీలో ఈ దుస్తులను విక్రయిస్తున్న షాపు యజమాని వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ప్రశ్నించగా 'మేమే ఆర్మీ దుస్తువులను తయారుచేసి అమ్ముతున్నాం. ఇక్కడ వాటికి చాలా డిమాండ్ ఉంది. ఎంతోమంది యువకులు ఈ దుస్తులు కావాలని అడుగుతున్నారు. అయితే, మేము ఈ దుస్తులు విక్రయించేముందు వారి దగ్గర గుర్తింపుకార్డులు తనిఖీ చేస్తున్నాం. అది చూపించని వారికి వాటిని అమ్మడం లేదు' అని తెలిపాడు. ఇక ఇదే విషయంలోపై ఆర్మీకి చెందిన ఎస్పీ బందాను ప్రశ్నించగా.. తమ సైనికులు ఉపయోగించే దుస్తులు ప్రత్యేకంగా ఓ ఫ్యాక్టరీలో తయారవుతాయని, వాటికి భారత ఆర్మీ ముద్ర ఉంటుందని, ఇలాంటి దుస్తులనే ఎవరైనా విక్రయించి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే మాత్ర కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కుట్టు... కొట్టేసేందుకు...!
విద్యార్థుల యూనిఫాంలపై టీడీపీ నేతల కన్ను కుట్టు పనిని తమకే ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు కొటేషన్ లేకుండా ఇస్తే ఇబ్బందొస్తుందేమోనని భయపడుతున్న అధికారులు ఒక్కొక్కరికీ అందజేయవలసిన యూనిఫాంలు : రెండు జతలు జతకు చెల్లించవలసిన రుసుం : రూ.40 మొత్తం విలువ : రూ.కోటీ 37 లక్షలు జిల్లా సమాఖ్యకు : 12 మండలాలు ఇంకా ఎవరికీ ఇవ్వని మండలాలు : 22 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే యూనిఫాంలపైనా అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఆ దుస్తులు కుట్టే పనిని ఎటువంటి కొటేషన్ లేకుండా కొట్టేసేందుకు అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తుండడంతో అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ పనికి దాదాపు రూ. కోటీ 37లక్షలు కేటాయించడంతో వచ్చిన అవకాశాన్ని వదలుకోకూడదని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇది అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఎవరికి అప్పగించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. సమాఖ్యకు ఇవ్వకుండా మోకాలడ్డు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలను కుట్టించే బాధ్యతల్ని గతంలో జిల్లా సమాఖ్యకు అప్పగించేవారు. డీఆర్డీఏ అనుబంధ సంస్థగా, డ్వాక్రా మహిళల అభివృద్ధికి దోహద పడిన వ్యవస్థగా పనిచేస్తుండడంతో ఎటువంటి కొటేషన్ లేకుండా జిల్లా సమాఖ్యకు కుట్టుబాధ్యతను అప్పగిస్తూ వచ్చారు. ఆ వచ్చే లాభమేదో మహిళలకు దక్కుతుందనేది ప్రభుత్వం అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే జిల్లా సమాఖ్య తమకు అందుబాటులో ఉన్న టైలర్లతో కుట్టించి, ఐదారు రూపాయల మార్జిన్ తీసుకునేది. కానీ రెండేళ్ల క్రితం జిల్లా సమాఖ్యను తప్పించి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లకు దుస్తులు కుట్టించే బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు తమకు తెలిసిన దర్జీలతో కుట్టించేవి. రెండేళ్ల కాలపరిమితితో ఏర్పడిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు ఈ ఏడాది మార్చిలో పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం పాఠశాలలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల్లేవు. దీంతో ఈ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో ఏకంగా జిల్లా సమాఖ్యకే కుట్టు బాధ్యతల్ని అప్పగించేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, మహిళలకు ఉపాధి కల్పించినట్టవుతుందని ప్రాథమిక విద్య శాఖ కమిషనర్ సంధ్యారాణి రాష్ట్ర స్థాయిలో ప్రతిపాదించినట్టు తెలిసింది. కానీ, టీడీపీ నేతలు ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. జిల్లా సమాఖ్యకు అప్పగిస్తే తమకు లబ్ధి చేకూరదన్న ఉద్దేశంతో జిల్లా సమాఖ్య ప్రతిపాదన తీసుకొచ్చిన కమిషనర్‌నే ఏకంగా బదిలీ చేయించినట్టు ఆరోపణలున్నాయి. మహిళల స్వయం ఉపాధికి దోహదపడే నిర్ణయాన్ని వ్యతిరేకించారన్న భావన బయటకెళ్తే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందన్న భయంతో కంటి తుడుపుగా కొన్ని మండలాలను జిల్లా సమాఖ్యకు అప్పగించి, మిగతా వాటిని తమ పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు వ్యూహరచన చేశారు. అందులో భాగంగా సూచన ప్రాయ ఆదేశాలిస్తూ నిర్ణయ అధికారాన్ని కలెక్టర్లకు వదిలేశారు. మల్లగుల్లాలు జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థులు లక్షా 72వేల మంది ఉన్నారు. వీరందరికీ రెండేసి జతలు చొప్పున యూనిఫాంలను అందించాల్సి ఉంది. ఒక్కొక్క జతకు రూ. 200 చొప్పున కేటాయింపులు జరిగాయి. ఆప్కో నుంచి కొనుగోలు కూడా చేసేశారు. జతకు రూ. 40 చొప్పున కుట్టు చార్జీలు చెల్లించనున్నారు. ఈ లెక్కన రెండు జతలకు రూ. 80 కుట్టు చార్జీలవుతాయి. ఈ లెక్కన లక్షా 72వేల మంది విద్యార్థుల దుస్తుల కుట్టు చార్జీల కింద రూ. కోటీ 37లక్షల వరకు ఖర్చు పెట్టనున్నారు. జిల్లా సమాఖ్యకు కొన్ని కేటాయించేసి, మిగతావి తమకిచ్చేయాలని టీడీపీ నేతలు అధికారుల్ని సతాయించడం ప్రారంభించారు. ఈ క్రమంలో 12మండలాల పాఠశాలల విద్యార్థుల దుస్తుల కుట్టు బాధ్యతల్ని జిల్లా సమాఖ్యకు అప్పగించారు. మిగతా మండలాల్ని కేటాయించే విషయమై తర్జనభర్జన పడుతున్నారు. తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. భారీ మొత్తంలో కావడంతో కొటేషన్ లేకుండా ప్రైవేటు వ్యక్తులకిస్తే విమర్శలకు గురి కావల్సి వస్తుందని, అలాగని నేతల సిఫార్సుల మేరకు ఇవ్వకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయిస్తే తప్పనిసరిగా కొటేషన్ పిలవాల్సిందే. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇవ్వవల్సి ఉంటుంది. అలా చేస్తే నేతల సిఫార్సుల మేరకు కట్టబెట్టే అవకాశం ఉండదు.దీన్ని దృష్ట్యా అధికారులు సందిగ్ధంలో పడ్డట్టు తెలిసింది. -
ఆర్మీ యూనిఫాంలో స్కూల్లోకి వచ్చిన ఉగ్రవాదులు
కరాచీ: పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్లోకి ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శ్మశాన వాటిక నుంచి ఆరుగురు ఉగ్రవాదులు స్కూలు వెనుక గేటు ద్వారా ప్రవేశించినట్టు చెప్పారు. ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించిన వెంటనే ఓ వాహనానికి నిప్పు పెట్టారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. ఈ దుర్ఘటనలో వందమందికి పైగా విద్యార్థులు మరణించిగా, మరో 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో టీచర్లు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించినపుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓ టీచర్ చెప్పారు. ఉగ్రవాదులు అరగంట పాటు కాల్పులు జరిపిన అనంతరం సైన్యం పాఠశాల చుట్టుముట్టినట్టు తెలిపారు. సైన్యం స్కూల్లో నుంచి విద్యార్థులను తరలిస్తున్నట్టు చెప్పారు. -
పుస్తకాలు, యూనిఫారాలు ఎందుకివ్వలేదు?
న్యూఢిల్లీ: ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లోని అణగారిన వర్గాల విద్యార్థుల (ఈడబ్ల్యూఎస్)కు ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు ఎందుకు అందజేయలేదో చెప్పాలని ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం నిలదీసింది. ఈ విషయమై విద్యాశాఖ కార్యాలయం సమర్పించిన స్థాయీనివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తులు బీడీ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన బెంచ్, రెండు వారాల్లోపు తాజా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నగరంలో 303 స్కూళ్లలో మాత్రమే ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందజేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నివేదికలో కచ్చితమైన సమాచారం లేదని, అస్పష్టంగా ఉందంటూ బెంచ్ మండిపడింది. అసలు ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి ఎంత మంది వస్తారనే విషయాన్ని ముందుగా స్పష్టం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలతోపాటు.. ఈ రెండు విభాగాల పరిధిలోకి రాని స్కూళ్లు ఏవో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికి ఎందరు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలో అందజేశారో తెలియజేస్తూ ప్రత్యేక నివేదిక సమర్పించాలని బెంచ్ ఆజ్ఞాపించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన బెంచ్ పైఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు రీయింబర్స్మెంట్ పొందుతున్నా, పేద విద్యార్థులకు ఉచిత వస్తువులు అందజేయడం లేదని పిటిషనర్ ఆరోపించారు. ఇందుకోసం విద్యాశాఖ 2011లోనే మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. -
రాష్ట్ర పోలీసు శాఖకు ఇకపై యూనిఫారానికి బదులుగా డబ్బులు
సాక్షి, ముంబై: రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఇకనుంచి యూనిఫారానికి బదులుగా డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో కానిస్టేబుల్ మొదలుకొని ఇన్స్పెక్టర్ స్థాయి వరకు దాదాపు 1.88 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ రెండేళ్లకు ఒకసారి ప్రభుత్వం యూనిఫారాలు(జత) అందజేస్తోంది. ఇక నుంచి యూనిఫారం అందజేయకుండా ఒకేసారి రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు నగదును అందజేయాలని నిర్ణయించారు. ఇదివరకు పోలీసులకు డీజీపీ ద్వారా నియమించిన సంబంధిత కాంట్రాక్టర్ సరఫరా చేసిన యూనిఫారాలు లభించేవి. అందుకు ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు వెచ్చించేది. కాని వాటిని సరఫరాచేస్తున్న కాంట్రాక్టర్లు పారదర్శకత పాటించినప్పటికీ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత పాటించడం లేదని, వాటి కొనుగోలులో అవకతవకలు, అక్రమాలు జరిగాయనే కథనాలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. దీంతో వీటికి చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూనిఫారానికి అయ్యే మొత్తం ఖర్చును రెండేళ్లకోసారి అందజేయాలని నిర్ణయించింది. ఇదిలాఉండగా ఎండనకా, వాననకా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తరచూ వారాంతపు సెలవు కూడా రద్దు కావడం, అదనపు గంటలు పనిచేయాల్సి రావడం, దర్యాప్తు పనుల మీద సుదూర ప్రయాణాలు చేయడం వల్ల ఒంటిపైనే యూనిఫారం ఎక్కువ సమయం ఉంటోంది. దీంతో అది తొందరగా పాడవుతోందని, సంవత్సరానికి ఒకసారి డబ్బులు అందజేయాలని పోలీసుశాఖ కోరుతోంది. అయితే నిధుల కొరత వల్ల రెండేళ్లకు ఒకసారి మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పోలీసు శాఖలో పురుష, మహిళా కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది, స్టేట్ రిజర్వుడు పోలీసు దళం, ట్రాఫిక్ శాఖ, అల్లర్ల నియంత్రణ బృందం, నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఇలా వారు ధరించే వేర్వేరు యూనిఫారాన్ని బట్టి రెండేళ్లకు ఒకసారి రూ. 5వేల నుంచి రూ. 8 వేల వరకు చెల్లించాలని నిర్ణయించామని, అందుకు ఆర్థికశాఖ నుంచి కూడా ఆమోదముద్ర పడిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకూ ఇక ఎస్ఎస్ఏ యూనిఫాంలే
సాక్షి, ముంబై: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం యూనిఫారాలను అందజేయదు. వీరికి కూడా సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) పథకం ద్వారానే యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూనిఫారాలు అందజేయబోమని అందులో స్పష్టం చే సింది. అందుకుగల కారణాలను సంబంధిత అధికారి ఒకరు వివరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం నిధులు వృథా అవుతున్నాయని, పథకం అమలులో చోటుచేసుకుంటున్న అవకతవకలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పా రు. సర్వశిక్షా అభియాన్ ఎస్సీ, ఎస్టీలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు యూనిఫారాల కోసం నిధులను 2010 నుంచే అందజేస్తోందని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయిస్తున్నాయని, దీంతో మరో పథకం ద్వారా ప్రత్యేకించి యూనిఫారాల కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం లేకుండా ఎస్ఎస్ఏ ద్వారానే ఎస్సీ, ఎస్టీలకు యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించిందన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్-2009 ప్రకారం ఎస్ఎస్ఏ ఏర్పాటైంది. దీనిలోభాగంగా ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫారాల కోసం రూ.400 అందజేస్తారు. ఇక నుంచి ఈ పద్ధతినే ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేయనున్నారు. పెదవి విరుస్తున్న ప్రధానోపాధ్యాయులు... ఎస్ఎస్ఏలో భాగంగా యూనిఫారాల కోసం ఇస్తున్న రూ.400 ఎటూ సరిపోవడంలేదని జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ఒక జత యూనిఫారానికి రూ. 200 ఇవ్వడంవల్ల నాసిరకం దస్తులతోనే విద్యార్థులు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. యూనిఫారాల డబ్బులు కూడా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయడం ద్వారా అవి సద్వినియోగం అయ్యే అవకాశం లేదని, నేరుగా దుస్తులు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ పథకమే బాగుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర పాఠశాల ఉపాధ్యాయుల అసోసియేషన్ అధికారి అనిల్ బోర్నారే వ్యక్తం చేశారు.