ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించండి... ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు ప్రచారం చేశారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఊదరగొట్టిన వారు పిల్లలను పాఠశాలలో చేర్చుకున్న తర్వాత చెప్పినవన్నీ మరిచిపోయారు. విద్యాసంవత్సరం సగం ముగిసినా ఏకరూప దుస్తులు కొందరికి ఇంత వరకూ అందలేదు. దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం విద్యాశాఖాధికారులకు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. చిరిగిన పాత దుస్తులతో పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల దుస్థితిని పట్టించుకోని పాలకుల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు.
కందుకూరు రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ చదువుతున్న పాఠశాలల్లోని బాలబాలికలకు ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫారం పంపిణీ చేస్తుంది. ఈ తరగతుల్లో 2,29,428 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో 1,20,159 మంది బాలికలుకాగా, 1,09,269 మంది బాలురు ఉన్నారు. గతంలో పాఠశాల ఖాతాలకు నగదు జమచేస్తే హెచ్‌ఎంలు వాటిని ఖర్చు చేసి క్లాత్, కుట్టు కూలి ఇచ్చి దుస్తులను కుట్టించేవారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానానికి స్వస్తిపలికారు. తొలి ఏడాది పాఠశాల యాజమాన్య కమిటీలు లేకపోవడంతో రాజకీయ ప్రతినిధులు సూచించిన వారికి కాంట్రాక్టుగా ఇచ్చేశారు. గత ఏడాది ఆప్కోకు అప్పగించినా వారు వాటిని కుట్టించి పంపిణీ చేసేసరికి విద్యా సంవత్సరం కూడా ముగిసింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది కనీసం జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కార్యాలయాలకు కూడా సంబంధం లేకుండా ఏకంగా> ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యాలయాల నుంచే విజయవాడ ఆప్కోకు రాష్ట్రవ్యాప్తంగా దుస్తులు కుట్టించి ఇచ్చే పని అప్పగించారు. ఒక జత క్లాత్, కుట్టు కూలి కలిపి రూ.200 చొప్పున రెండు జతలు రూ.400లు చొప్పున ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం ఆప్కోకు చెల్లిస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే యూనిఫారం పంపిణీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించి అయిదు మాసాలు గడిచినా ఇంకా జిల్లాలో 19 మండలాల్లో విద్యార్థులకు యూనిఫారం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఆప్కో చెబుతున్న లెక్కల ప్రకారం 71,024 మంది బాలురకు, 78103 మంది బాలికలకు దుస్తులు పంపిణీ అయ్యాయి. ఇంకా 38425 మంది బాలు రకు, 42056 మంది బాలికలకు పంపిణీ చేయాల్సి ఉంది. అంటే ఇప్పటికి పంపిణీ చేసింది 65 శాతం మాత్రమే. సర్వశిక్షా అభియాన్ అధికారులు మాత్రం మిగిలిన 35 శాతం యూనిఫారం ఈనెలాఖరులోగా పంపిణీ చేస్తామని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అందరూ పేదలే..
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో అధిక శాతం పేద విద్యార్థులే. అలాంటి పేద విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు ఇప్పటి వరకూ అందించకపోవడంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించవద్దని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని రెండు జతలు యూనిఫాం ఉచితంగా ఇస్తామని మాటలు చెప్పారు. కానీ ఇంత వరకూ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
పాత దుస్తులతోనే పాఠశాలలకు...
పేద విద్యార్థులు పాత దుస్తులతోనే పాఠశాలలకు వస్తున్నారు. చొక్కాలకు గుండీలు ఊడిపోవడంతో పిన్నీసులు పెట్టుకొని వస్తున్నారు. పాత మాసిపోయిన దుస్తులతో పాఠశాలకు వస్తున్నప్పటికీ అధికారులు స్పందిం చడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి ఏకరూప దుస్తులు త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ నెలాఖరికల్లా అందుతాయి : ఏకరూప దుస్తులు సర్వశిక్షా అభియాన్ నుంచి రావాల్సి ఉంది. గత సమావేశంలో ఎస్‌ఎస్‌ఏ పీఓ ఈ నెలాఖరికల్లా అన్ని మండలాల పాఠశాలలకు ఏకరూప దుస్తులు అందుతాయని చెప్పారు. రాగానే విద్యార్థులకు అందిస్తాం.- జి.సుబ్బరత్నం, డిప్యూటీ డీఈఓ, కందుకూరు
Comments
Please login to add a commentAdd a comment