పంద్రాగస్టుకైనా.. అందేనా!
-
నీరుగారుతున్న విద్యాహక్కు చట్టం
-
ఏటా ఏడాది చివర్లోనే యూనిఫాం పంపిణీ
-
నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
-
జిల్లాకు 3.44 లక్షల విద్యార్థులకు యూనిఫాంలు అవసరం
రాయవరం :
బడిలో అందరూ సమానమన్న భావన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తప్పనిసరిగా యూనిఫామ్ అందజేస్తున్నారు. జాతీయతను చాటుతూ కులమతాలకు అతీతంగా పిల్లలందరూ ఐక్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి రెండు జతల యూనిఫామ్ పంపిణీ కార్యక్రమానికి 2009లో శ్రీకారం చుట్టారు. ఏటా యూనిఫామ్ పంపిణీలో జాప్యం చోటు చేసుకుంటోంది. పాఠశాలలు తెరిచి రెండు నెలలు కావస్తున్నా యూనిఫామ్ అందలేదు. పంద్రాగస్టు పండుగకైనా యూనిఫామ్ అందేలా కన్పించడం లేదు.
విద్యా హక్కు చట్టం ప్రకారం..
విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు యూనిఫారంను ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న బాలురకు నీలం రంగు నిక్కర్, తెలుపు, నీలం రంగు గళ్ల షర్ట్, బాలికలకు నీలం రంగు గౌను, తెలుపు, నీలం రంగు గళ్ల షర్ట్, 6,7,8 తరగతుల విద్యార్థులకు అదే రంగు పంజాబీ డ్రస్‌ను సరఫరా చేయాల్సి ఉంది. 2015–16 విద్యా సంవత్సరంలో పాఠశాల పునఃప్రారంభం నాటికి పంపిణీ చేయాల్సిన యూనిఫామ్ విద్యాసంవత్సరం ఆఖర్లో పంపిణీ చేశారు. 2016–17 విద్యా సంవత్సరంలోనైనా సమయానికి యూనిఫామ్ పంపిణీ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఆగస్టు 15 జెండా పండుగ నాటికి ఇస్తే విద్యార్థులకు నిజంగా పండుగలాగే ఉండేది. ఈ ఏడాది ఇప్పటికింకా క్లాత్ మండల కేంద్రాలకు చేరుకోలేదు.
జిల్లాలో 3.44 లక్షల మంది విద్యార్థులు
జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు మూడు లక్షల 44వేల 154 మంది ఉన్నట్టుగా అధికారులు అంచనా వేశారు. వీరిలో ఒక లక్ష 60వేల 224 మంది బాలురు, ఒక లక్ష 73వేల 930 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ యూనిఫాంలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒక్కొక్క విద్యార్థికి యూనిఫాం నిమిత్తం ప్రభుత్వం రూ.200 వెచ్చిస్తుంది. యూనిఫాం సరఫరా చేసే ఆప్కో కంపెనీకి రూ.160, కుట్టుకూలికి రూ.40 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా జిల్లాలో ఉన్న మూడు లక్షల 44వేల 154 మంది విద్యార్థులకు రెండు జతల వంతున రూ.13కోట్ల 76 లక్షల 61వేల 600లు చెల్లించనుంది. ఈ ఏడాది యూనిఫామ్‌ను ఆప్కో సంస్థ సరఫరా చేయనుంది. అయితే ఈ ఏడాది కొన్ని పాఠశాలలకు క్లాత్ సరఫరా జరిగినా మెజార్టీ పాఠశాలలకు క్లాత్ సరఫరా కాలేదు.
6,7,8 తరగతుల విద్యార్థినులకు చున్నీల క్లాత్ కూడా అందజేస్తారు. 6వ తరగతి విద్యార్థినులకు 1.40మీ, 7వ తరగతికి 1.50మీ, 8వ తరగతికి 1.80మీటర్ల వంతున చున్నీ క్లాత్ అందజేస్తారు. ఒక్కొక్కరికి రెండు చున్నీల వంతున క్లాత్ ఇస్తారు.
యూనిఫామ్ క్లాత్ తరగతుల వారీగా ఇలా ఇస్తారు
తరగతి బాలురకు బాలికలు షర్ట్ నిక్కరు ఫ్రాక్ షర్ట్
1,2 0.70మీ 0.30మీ 1.75మీ 0.75మీ
3,4l 1.05మీ 0.40మీ 0.80మీ 0.90మీ
5 1.20మీ 0.50మీ 1.10మీ 1.10మీ
6 1.20మీ 0.50మీ 1.35మీ 1.15మీ
7 1.35మీ 0.60మీ 1.50మీ 1.25మీ
8 1.40మీ 0.95మీ 1.65మీ 1.35మీ
వెంటనే సరఫరా చేయాలి..
యూనిఫామ్‌ను సమయానికి ఇవ్వాలి. పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేయాలి. అయినా నేటికీ సరఫరా చేయక పోవడం విచారకరం. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.
– చిన్నం అపర్ణాదేవి, జెడ్పీటీసీ, రాయవరం.