సాక్షి, ముంబై: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం యూనిఫారాలను అందజేయదు. వీరికి కూడా సర్వ శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) పథకం ద్వారానే యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాయి. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూనిఫారాలు అందజేయబోమని అందులో స్పష్టం చే సింది. అందుకుగల కారణాలను సంబంధిత అధికారి ఒకరు వివరిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం నిధులు వృథా అవుతున్నాయని, పథకం అమలులో చోటుచేసుకుంటున్న అవకతవకలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పా రు.
సర్వశిక్షా అభియాన్ ఎస్సీ, ఎస్టీలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు యూనిఫారాల కోసం నిధులను 2010 నుంచే అందజేస్తోందని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయిస్తున్నాయని, దీంతో మరో పథకం ద్వారా ప్రత్యేకించి యూనిఫారాల కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం లేకుండా ఎస్‌ఎస్‌ఏ ద్వారానే ఎస్సీ, ఎస్టీలకు యూనిఫారాలు అందజేయాలని నిర్ణయించిందన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్-2009 ప్రకారం ఎస్‌ఎస్‌ఏ ఏర్పాటైంది. దీనిలోభాగంగా ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫారాల కోసం రూ.400 అందజేస్తారు. ఇక నుంచి ఈ పద్ధతినే ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేయనున్నారు.
పెదవి విరుస్తున్న ప్రధానోపాధ్యాయులు...
ఎస్‌ఎస్‌ఏలో భాగంగా యూనిఫారాల కోసం ఇస్తున్న రూ.400 ఎటూ సరిపోవడంలేదని జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ఒక జత యూనిఫారానికి రూ. 200 ఇవ్వడంవల్ల నాసిరకం దస్తులతోనే విద్యార్థులు సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. యూనిఫారాల డబ్బులు కూడా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయడం ద్వారా అవి సద్వినియోగం అయ్యే అవకాశం లేదని, నేరుగా దుస్తులు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ పథకమే బాగుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర పాఠశాల ఉపాధ్యాయుల అసోసియేషన్ అధికారి అనిల్ బోర్‌నారే వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకూ ఇక ఎస్‌ఎస్‌ఏ యూనిఫాంలే
Published Tue, Nov 12 2013 12:47 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement