మూలనపడిన రాజీవ్ విద్యాదీవెన, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలు
విద్యాహక్కు చట్టప్రకారం ఈ పథకాలు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక ఆసరా ఇవ్వడమే లక్ష్యం
వేల మంది దరఖాస్తుదారులకు నిరీక్షణే మిగులు
ఒకే ఒక్క ఎస్సీ విద్యార్థికి నగదు జమ
వీరఘట్టం: దళితవర్గాల విద్యార్థుల్లో డ్రాపౌట్లను తగ్గించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యా దీవెన, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలు పూర్తిగా మూలన పడ్డాయి. ఈ పథకాల కింద జిల్లాలో ఒకే ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూర్చారు. విద్యాహక్కు చట్టం ప్రకారం సర్కారు విద్యను బలోపేతం చేసి, అన్ని వర్గాల వారికి విద్యావకాశాలు కల్పించాల్సి ఉంది. అందులో భాగంగా దళిత(ఎస్సీ, ఎస్టీ) వర్గాల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వడం ద్వారా చదువుకొనే అవకాశం కల్పించడానికి ఈ పథకాలు ప్రవేశపెట్టారు. రాజీవ్ విద్యా దీవెన ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు ఏడాదికి రూ.2250, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా 5 నుంచి 8 తరగతులకు చెందిన బాలికలకు రూ.1500, బాలురకు రూ.1000 చొప్పున స్కాలర్‌షిప్పు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతవరకు జిల్లాలో ఒక్క గిరిజన విద్యార్థికి కూడా ఈ పథకాలు అందలేదు. ఆధార్ కార్డులు అనుసంధానం కాకపోవడం, ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం వంటి కారణాలను అధికారులు చూపుతున్నా మొత్తం మీద విద్యార్థులకు మాత్రం నిరాశే మిగులుతోంది.
ఎస్టీ విభాగంలో...
రాజీవ్ విద్యాదీవెన కోసం ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా 1528 మంది ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 340 మంది పేర్లను ప్రతిపాదించారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా నగదు అందలేదు. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 452 మంది గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులేవీ ఇంతవరకు ఆన్‌లైన్‌కు నోచుకోలేదు.
ఎస్సీ విభాగంలో.....
రాజీవ్ విద్యా దీవెనకు 3662 మంది ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 3005 దరఖాస్తులను ఆన్‌లైన్ చేయగా 2651 మందికి స్కాలర్‌షిప్‌లు మంజూరయ్యాయి. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 5680 మంది దరఖాస్తు చేసుకోగా 4819 దరఖాస్తులను ఆన్‌లైన్ చేశారు. వీరిలో 1671 మందికి స్కాలర్‌షిప్‌లు మంజూరయ్యాయి. కానీ ఒక్క విద్యార్థికి మాత్రమే రూ.1000 స్కాలర్‌షిప్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. మిగిలిన వారంతా స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.
అందని ఆర్థిక దీవెన
Published Wed, Mar 4 2015 2:11 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement