అత్యధికుల గమ్యస్థానం అమెరికానే!
‘అంబేడ్కర్ ఓవర్సీస్’ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్లిన 268 మంది ఎస్సీ విద్యార్థుల్లో 241 మంది, 72 మంది ఎస్టీ విద్యార్థుల్లో 60 మందికిపైగా అమెరికాలోని కోర్సులను, అందులోనూ ఎక్కువ ఇంజనీరింగ్‌లో ఎమ్మెస్‌ను ఎంచుకున్నారు. షెడ్యూల్డ్‌కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి రూపంలో ఉన్నతవిద్యా స్పప్నం ఫలిస్తోంది. 2013-14లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రూ.10 లక్షల మేర ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న ఆర్థిక సహాయం సరిపోవడంలేదు.
దీంతో అప్పు చేస్తే తప్ప కోర్సులు పూర్తి చేసే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని బీసీ విద్యార్థులకు కూడా వర్తింపచేసి రూ.10 లక్షల మేర విదేశాల్లో ఉన్నతవిద్యకు సహాయాన్ని అందించాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఈ మేరకు బీసీ సంక్షే మ శాఖ రూ.50 కోట్లకు ప్రతిపాదనలను సమర్పించినా బడ్జెట్ మాత్రం కేటాయించలేదు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 268 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.26.80 కోట్ల మేర ప్రభుత్వం కేటాయించింది.