రాష్ట్రాన్ని విభజిస్తే దళితులకు రక్షణ కరువు
Published Sun, Sep 15 2013 2:04 AM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ :రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో దళితులకు రక్షణ కరువవుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ అన్నారు. గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంప్లాయీస్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ దళితుల పోరుదీక్ష చేపట్టారు. ఈ దీక్షను అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లూరి బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ దీక్షలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊబా రాజారావు, మాల మహానాడు నగర అధ్యక్షుడు ఏనుగుపల్లి రామకృష్ణ,
బద్దే జార్జీ అంథోని, కోరుకొండ చిరంజీవి, జిత్తుగ రాజేష్, తుమ్మత తాతారావు, తాడేపల్లి గణేశ్వరరావు, యండ్రపాటి జాన్ మార్కు, అంజలయ్య, శివ తదితరులు పాల్గొన్నారు. కారెం శివాజీ మాట్లాడుతూ సమష్టిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను వదులుకుంటే 13 జిల్లాలోని దళితుల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో సంవత్సరానికి 3 లక్షల 50 వేల మంది ఇంజనీర్లు, 4 లక్షల మండి ఐటీఐ చేసిన వారు ఉద్యోగాల కోసం హైదరాబాద్ పైనే ఆధారపడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. దొరలే తెలంగాణ ను కోరుతున్నారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు లు దొరలేనని వివరించారు. రాష్ట్రాన్ని విభజించకముందే దళితులపై దాడులకు పాల్పడుతున్న కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ వస్తే మరిన్ని దాడులకు పాల్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
మందా కృష్ణ ఏ జాతికి చెందిన వాడు
అంబేద్కర్ సిద్ధాంతం అని చెప్పి తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడుతున్న మందా కృష్ణ మాదిగ ఏ జాతికి చెందినవాడని శివాజీ ప్రశ్నించారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్‌జీఓ సంఘం చేపట్టిన ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాలలో దళితులను కలుపుకొని సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. కారెం శివాజీ చేపట్టిన ఒక రోజు దళితుల పోరు దీక్షకు పలువురు నాయకులు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ నాయకుడు పరిమి వాసు దీక్షా శిబిరానికి వచ్చి శివాజీని సన్మానించి పూలతో తయారు చేసిన కత్తిని బహూకరించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, వైఎస్సార్ సీపీ యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు, ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ తొక్కుల రామాంజనేయులు తదితరులు సంఘీభావం తెలిపారు. పోరు దీక్షను నన్నయ్య యూనివర్సిటీ వీసీ పి.జార్జి విక్టర్ విరమింపజేశారు. తురకల నిర్మల, ఇసుకపట్ట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement