యూపీ వీధుల్లో కుప్పలుగా ఆర్మీ దుస్తులు
లక్నో: భారత సైనికులకు మాత్రమే లభించే ఆర్మీ దుస్తులు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో వీధివీధిలో అలవోకగా లభిస్తున్నాయి. భారత సైన్యం అధికారిక ముద్రతో ఉన్న దుస్తులను సాధారణ వస్త్ర దుకాణాదారులు కూడా విక్రయిస్తున్నారు. పఠాన్ కోట్ పై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు కూడా ఆర్మీ దుస్తుల్లోనే వైమానిక స్థావరంలోకి చొరబడినట్లు గుర్తించడంతో ఆర్మీ వాడే వస్తువుల విషయంలో కూడా ఇప్పుడు ఆందోళనగా మారింది.
ఆర్మీ దుస్తులు, బూట్లు ఎక్కడబడితే అక్కడ లభించడం భద్రతపరంగా తనిఖీ చేసుకోవాల్సిన అంశమేనని పలువురు చెప్తున్నారు. యూపీలో ఈ దుస్తులను విక్రయిస్తున్న షాపు యజమాని వద్దకు వెళ్లి ఈ విషయాన్ని ప్రశ్నించగా 'మేమే ఆర్మీ దుస్తువులను తయారుచేసి అమ్ముతున్నాం. ఇక్కడ వాటికి చాలా డిమాండ్ ఉంది. ఎంతోమంది యువకులు ఈ దుస్తులు కావాలని అడుగుతున్నారు.
అయితే, మేము ఈ దుస్తులు విక్రయించేముందు వారి దగ్గర గుర్తింపుకార్డులు తనిఖీ చేస్తున్నాం. అది చూపించని వారికి వాటిని అమ్మడం లేదు' అని తెలిపాడు. ఇక ఇదే విషయంలోపై ఆర్మీకి చెందిన ఎస్పీ బందాను ప్రశ్నించగా.. తమ సైనికులు ఉపయోగించే దుస్తులు ప్రత్యేకంగా ఓ ఫ్యాక్టరీలో తయారవుతాయని, వాటికి భారత ఆర్మీ ముద్ర ఉంటుందని, ఇలాంటి దుస్తులనే ఎవరైనా విక్రయించి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే మాత్ర కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.