న్యూఢిల్లీ: ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లోని అణగారిన వర్గాల విద్యార్థుల (ఈడబ్ల్యూఎస్)కు ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు ఎందుకు అందజేయలేదో చెప్పాలని ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం నిలదీసింది. ఈ విషయమై విద్యాశాఖ కార్యాలయం సమర్పించిన స్థాయీనివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తులు బీడీ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన బెంచ్, రెండు వారాల్లోపు తాజా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నగరంలో 303 స్కూళ్లలో మాత్రమే ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందజేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నివేదికలో కచ్చితమైన సమాచారం లేదని, అస్పష్టంగా ఉందంటూ బెంచ్ మండిపడింది.
అసలు ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి ఎంత మంది వస్తారనే విషయాన్ని ముందుగా స్పష్టం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలతోపాటు.. ఈ రెండు విభాగాల పరిధిలోకి రాని స్కూళ్లు ఏవో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికి ఎందరు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలో అందజేశారో తెలియజేస్తూ ప్రత్యేక నివేదిక సమర్పించాలని బెంచ్ ఆజ్ఞాపించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన బెంచ్ పైఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నా, పేద విద్యార్థులకు ఉచిత వస్తువులు అందజేయడం లేదని పిటిషనర్ ఆరోపించారు. ఇందుకోసం విద్యాశాఖ 2011లోనే మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు.
పుస్తకాలు, యూనిఫారాలు ఎందుకివ్వలేదు?
Published Tue, Aug 5 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement