'వారికి లక్షల్లో ఫోన్ కాల్స్.. సీబీఐని ఆదేశించండి'
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారీ మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా విరాళాలు వస్తున్నాయని, ఆ పార్టీకి చెందిన నేతలు భారీ అవినీతికార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. గతంలోనే ఈ అంశంపై చాలా స్పష్టమైన వివరణ ఇచ్చినందున పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని తెలిపింది. గతంలో ఇలాంటి ఆరోపణలే ఆప్ ప్రభుత్వంపై రాగా వాటిని పరిశీలించాలని కేంద్రాన్ని ప్రశ్నించగా అప్పుడు ఆప్ కు కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది.
గతంలో ఉన్న ప్రభుత్వం ఆప్ పై ఆరోపణల విషయంలో దర్యాప్తు చేయించిందని అయినా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదని చెప్పింది. కానీ, తాజాగా ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో దుబాయ్ వంటి ఎన్నో నగరాలనుంచి ఢిల్లీకి లక్షల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయని, ముఖ్యంగా ఆప్ లో ఉన్న ముస్లిం నేతలకు ఇవి వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమ నిధుల ప్రవాహం కోసమే ఆ ఫోన్లు చేసినట్లు పిటిషన్ దారు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్ పేర్లను పేర్కొన్నారు.