న్యూఢిల్లీ: నగరంలో మహిళా పోలీసులకే రక్షణ లేకుండాపోయింది. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ ఢిల్లీలోని మయాపురి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ విధులు ముగించికొని ఇంటికి తిరిగి వస్తుండగా 20 ఏళ్లలోపు ముగ్గురు యువ కులు ఆటకాయించి అసభ్యంగా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా ఆమె చేతిని పట్టుకొని లైంగిక దాడికి ప్రయత్నించారు. మహిళా పోలీస్ ఆ ముగ్గురి యువకులపై తిరగబడింది. అరుపులు, కేకలు వేయడంతో యువకులు పరారీ అయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకొన్నదని పోలీసులు పేర్కొన్నారు.
నిందితులపై ఆమె ఎఫ్‌ఐఆర్ నమోదు చే యించారు. నిందితులు ముగ్గురు బాధితురాలి ఇరుగుపొరుగు కావడంతో, కొందరు స్థానికులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించడంతో ఫిర్యాదు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయం అక్కడితో స్థానికంగా తెరపడింది.
ఎఫ్‌ఐఆర్ కొట్టివేత: కానీ, పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ హైకోర్టుకు అందజేశారు. బాధితురాలు ఉపసంహరించుకోవడంతో జస్టిస్ ప్రతిభా రాణి నేతృత్వంలోని ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసంది. సంఘటన తీరుపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో సాధారణ మహిళపైనే కాకుండా మహిళా పోలీసులకు కూడా రక్షణ లేకుండాపోయిందని పేర్కొంది. మహిళా పోలీసును అవమానించిన యువకులకు మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. ఒక మహిళా పోలీసు నగరంలో వీధుల్లో నడుచుకొంటూ వెళ్లే పరిస్థితి లేదు..సాధారణ మహిళలు, యువతుల పరిస్థితి ఏమిటని’ ప్రశ్నించింది.
పోలీసులు నివేదికపై ఇలా..: డిసెంబర్ 16, 2012లో మహిళపై సామూహిక లైంగిక దాడి ఘటన సంచలనం సృష్టించింది. అప్పట్లో మహిళలపై నేరాల సంఖ్య 35 శాతంగా నమోదు అయ్యింది. ఈ ఏడాది 1,794 అత్యాచార సంఘటనలు జరిగాయి. గతేడాది 1,330 కేసులుండగా ఈ సంవత్సరం పెరిగాయి. మొత్తంగా నగరంలో మహిళలపై నేరాల సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందని ఇటీవల ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అదేవిధంగా మహిళ పట్ల అసభ్యంగా వ ్యవహరించడం, రాగింగ్‌కు పాల్పడిన కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినందుకు 3,450 కేసులు, రాగింగ్‌కు పాల్పడినందుకు 1,024 కేసులు నమోదయ్యాయి. గతేడాది 2,544, 739 కేసులు నమోదు అయ్యాయి నివేదిక తెలియజేసిందని కోర్టు తెలియజేసింది.
కేసు ఉపసంహరణపై ఆక్షేపణ
‘అయినప్పటికీ మహిళా పోలీసు కానిస్టేబుల్ కూడా నిందితులకు ఎలాంటి గుణపాఠం చెప్పలేకపోయిందని జడ్జి పేర్కొన్నారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినా ఏమి చేయలేకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. నిందితులకు సరైన గుణపాఠ చెబితే..మరోసారి ఇలాంటి దురాఘతానికి పాల్పడడానికి భయపడుతారు. ‘ ఢిల్లీ వీధుల్లో మహిళా పోలీసులకే రక్షణ లేకుండా పోతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏమిట’ని ఎఫ్‌ఐఆర్ కొట్టెస్తూ జస్టిస్ ప్రతిభారాణి ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా నిందితుల్లో ఒకడిని ఎఫ్‌ఐఆర్ చదువాలని కోర్టు ఆదేశించగా, సంశయం వ్యక్తం చేశాడు. ‘ ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించేటప్పుడు సిగ్గు అనిపించనప్పుడు? ఎఫ్‌ఐఆర్ చదవడానికి ఎందుకు సిగ్గు పడుతున్నావని జస్టిస్ ప్రశ్నించారు. ప్రస్తుతం జరిగిన విషయాన్ని తేలికగా తీసుకోవద్దని నిందితులను హెచ్చరించారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే విచారణకు నిందితులు వారి తల్లిదండ్రులను కూడా తీసుకొని రావాలని ఆదేశించారు.
మహిళా పోలీసులకే రక్షణ కరువు !
Published Tue, Dec 2 2014 11:12 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement