poor kids
-
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
పేద పిల్లలకు సంగీతం నేర్పిస్తున్న అక్కాచెల్లెళ్లు
‘నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుదాం’ అంటున్నారు కామాక్ష్మి, విశాల సిస్టర్స్. ముంబైకి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ‘ది సౌండ్ స్పేస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తాము నేర్చుకున్న సంగీతాన్ని పేద పిల్లల చెంతకు తీసుకువెళుతున్నారు. గత పది సంవత్సరాలుగా కామాక్షి, విశాల సిస్టర్స్ పది వేలమంది పిల్లలకు సంగీత పాఠాలు బోధించారు. టైమ్‌తో అప్డెట్ అవుతూ పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలను డిజైన్ చేశారు. ‘జీవితంలో ప్రతి దశలో సంగీతం ఆహ్లాదాన్ని, శక్తిని ఇస్తుంది. సంగీతం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ల కోసమే అనే భావనను మార్చాలనుకున్నాం’ అంటుంది కామాక్షి. విశాల, కామాక్షి లక్నో యూనివర్శిటీలో మ్యూజిక్ కోర్సు చేశారు. ‘చదువు, ఆరోగ్యం... మొదలైనవి మాత్రమే పిల్లలకు ముఖ్యం అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కోవిడ్ కల్లోల కాలంలో మ్యూజిక్ థెరపి గొప్పదనం ఏమిటో తెలిసింది’ అంటుంది విశాల. -
పేద పిల్లల చదువుకు వెలుగు.. అమ్మఒడి
సాక్షి, అమరావతి: పేదపిల్లలు బడిలో ఉండేలా చూసేందుకు ఉద్దేశించిన ‘అమ్మఒడి’ పథకం వంటివి గతంలో దేశంలో ఎక్కడా అమలుచేయలేదని, పేద కుటుంబాల్లోని పిల్లల విద్యకు ఆర్థికంగా ఏ సాయం చేసినా మంచిదేనని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా అన్నారు. అదే సమయంలో.. నగదు బదిలీ చేసి వదిలేయకుండా పథకం లక్ష్యం నెరవేరేలా పటిష్ట కార్యాచరణ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు అధికారులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు, పంచాయతీల్ని విద్యావ్యవస్థలో బాధ్యుల్ని చేయాలని సూచించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకంపై సోమవారం ఆమె సాక్షితో సంభాషించారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తే.. సామాజికంగా మనం ఆశించే మార్పులు సాధ్యమవుతాయని, అయితే ఇది ఏ ఒక్క రోజులోనో సాధ్యం కాదని.. నిరంతరాయంగా 20 ఏళ్లపాటు కొనసాగాలన్నారు. ‘అమ్మఒడి’ సహా విద్యా వ్యవస్థపై ఎంవీ ఫౌండేషన్ వ్యస్థాపకురాలిగా కూడా వ్యవహరిస్తున్న శాంతాసిన్హా పలు అభిప్రాయాలు పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే.. బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ.. ‘అమ్మఒడి’ పథకంపై తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు ఈ బాధ్యత అప్పగించాలి. అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఏదో డబ్బులిచ్చారు? ఖర్చు చేద్దాంలే.. అనేలా ఉండకూడదు. పిల్లలు బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్కూళ్లు బాగా నడిస్తే పిల్లలు వారంతట వారే వస్తారు. విద్యావ్యవస్థపై ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండేలా చూడాలి. పైనుంచి కిందివరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలి. పనిచేయకపోతే చర్యలు తీసుకోవాలి. ఎంఈవోలు, ఎంఆర్సీలు, సీఆర్సీలు, హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు ఇలా అందరూ పూర్థి స్థాయిలో ఉండి విద్యావ్యవస్థలో వారి విధుల్ని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ఇవన్నీ ఉన్నా.. పిల్లలు రాకపోతే అప్పుడు పిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. స్కూళ్ల అభివృద్ధికి ‘నాడు–నేడు’ దోహదం స్కూళ్ల అభివృద్ధికి నాడు–నేడు కార్యక్రమం ఎంతో ప్రయోజనకరం. తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ పంచాయతీల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి. బడి బయట ఏ ఒక్క చిన్నారి ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వ లక్ష్యం అదే కావాలి. పేరెంట్స్ కమిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా బాధ్యత అప్పగించాలి. అవకాశం కల్పిస్తే పేద పిల్లలు బాగా చదవగలరన్నది సాధ్యం చేసి చూపించాలి. కార్పొరేట్ సంస్థల్ని రద్దు చేయాలి విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్ని పూర్తిగా రద్దుచేయాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు సొంత ప్రయోజనాలే తప్ప సామాజిక, సేవా దృక్పథం ఉండదు. అమెరికా, యూరోప్‌లో విద్య పబ్లిక్ సర్వీస్‌గానే ఉంది. విద్య ప్రభుత్వ బాధ్యత. ప్రైవేట్‌లో ఉండడం వల్లే అసమానతలు ఏర్పడుతున్నాయి. పిల్లలందరికీ చదువు చెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వాలి. తగినన్ని సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లను పెట్టాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ఈ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్ని బంద్ చేయిస్తే ప్రజలపై చదువు కోసం ఆర్థిక భారం ఉండదు. లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థలకు పాఠశాలలు నడిపించే బాధ్యత అప్పగించాలి. ఫిర్యాదుల్ని పరిష్కరించేలా కమిషన్లు విద్యారంగంలో ప్రమాణాల కోసం కమిషన్ల ఏర్పాటు మంచి నిర్ణయమే. వాటిలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఉండాలి. ఎవరైనా తమకు సమస్య ఎదురైతే కమిషన్‌కు చెప్పుకుని పరిష్కారం పొందేలా చూడాలి. పంచాయతీలకు బాధ్యతలు అప్పగించాలి ప్రభుత్వ విద్యా విధానంలో పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణ బాధ్యత చాలా ముఖ్యం. కేరళలో ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. అక్కడి ప్రభుత్వం పంచాయతీలకు పెద్ద పాత్ర ఇచ్చింది. అక్కడి నిపుణులను రప్పించి ఇక్కడ మార్పులు చేసినా మంచిదే. -
పేదరికంతో ఆ పిల్లల చదువులు చెట్లకిందే !
-
పుస్తకాలు, యూనిఫారాలు ఎందుకివ్వలేదు?
న్యూఢిల్లీ: ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లోని అణగారిన వర్గాల విద్యార్థుల (ఈడబ్ల్యూఎస్)కు ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు ఎందుకు అందజేయలేదో చెప్పాలని ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం నిలదీసింది. ఈ విషయమై విద్యాశాఖ కార్యాలయం సమర్పించిన స్థాయీనివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తులు బీడీ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన బెంచ్, రెండు వారాల్లోపు తాజా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నగరంలో 303 స్కూళ్లలో మాత్రమే ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందజేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నివేదికలో కచ్చితమైన సమాచారం లేదని, అస్పష్టంగా ఉందంటూ బెంచ్ మండిపడింది. అసలు ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి ఎంత మంది వస్తారనే విషయాన్ని ముందుగా స్పష్టం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలతోపాటు.. ఈ రెండు విభాగాల పరిధిలోకి రాని స్కూళ్లు ఏవో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికి ఎందరు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలో అందజేశారో తెలియజేస్తూ ప్రత్యేక నివేదిక సమర్పించాలని బెంచ్ ఆజ్ఞాపించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన బెంచ్ పైఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు రీయింబర్స్మెంట్ పొందుతున్నా, పేద విద్యార్థులకు ఉచిత వస్తువులు అందజేయడం లేదని పిటిషనర్ ఆరోపించారు. ఇందుకోసం విద్యాశాఖ 2011లోనే మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు.