మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్‌ని ప్రశంసించారు.
కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు.
టాయిలెట్స్ కడుగుతూ...
కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు.
సిగ్గుపడకుండా...
వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్.
‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’.
– లోగనాథన్
Comments
Please login to add a commentAdd a comment