Sabiha Hashmi Story In Telugu: ఒక మంచి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మార్గం కూడా ఉంటుంది. సమయం కూడా వస్తుంది. అందుకు ఉదాహరణ సబిహా హష్మి. స్కూల్ డ్రాప్ అవుట్‌లుగా మిగులుతున్న బాలికల కోసం ఆమె ఏడు పదుల వయసులో మళ్లీ ఉద్యోగం చేస్తున్నారు.
ఢిల్లీలో పుట్టి పెరిగిన సబిహా హష్మి నేషనల్ మ్యూజయమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఆర్ట్, కన్జర్వేషన్ అండ్ మ్యూజయాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఢిల్లీ, గుర్‌గావ్‌లోని హెరిటేజ్ స్కూల్‌లో పిల్లలకు స్కెచింగ్, పెయింటింగ్, కళల చరిత్ర బోధించేవారు. పిల్లలకు బోధనేతర విజ్ఞానం కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లేవారు. ఓసారి ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి కుగ్రామాల్లో నివసించే అమ్మాయిలను చూసి బాధపడేవారామె. స్కూలు వయసులోనే చదువు మానేసి పెళ్లి చేసుకుని చంకలో బిడ్డతో, ఇంటి బాధ్యతలు మోస్తున్న ఆడపిల్లలు కనిపించేవారు.
చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే..
అక్షరానికి దూరమైన బాల్యం ఆమె గుండెను కదిలించేది. అయితే వాళ్ల కోసం తాను చేయగలిగిందేమీ ఆమెకు కనిపించలేదు. అప్పటికామె చేయగలిగింది బాధపడి ఊరుకోవడమే. ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్లకు ఆమె పిల్లల దగ్గరకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆమె 2010 లో కర్నాటక, రామనగర జిల్లా, జ్యోతిపాళయ గ్రామానికి వచ్చారు. ‘‘ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారిగా హిమాలయ పర్వత గ్రామాల్లో చూసినటువంటి దృశ్యాలు కనిపించాయి. నేను అక్కడ చూసినప్పుడు అక్కడి అమ్మాయిల కోసం ఏదైనా చేయాలంటే తగిన ఆర్థిక వెసులుబాటు లేదు. ఇప్పుడైతే నాకు చేతనైనదేదో చేయగలను... అనిపించింది.
గ్రామం శివారులో మా పొలానికి సమీపంలో చిన్న కాటేజ్ కట్టించి బాలికలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలు పెట్టాను. నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చే బాలికల్లో ఓ ఎనిమిది మందికి పుస్తకాలు కొనుక్కోవడం కూడా కష్టమేనని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. వాళ్ల చదువు కొనసాగాలంటే పుస్తకాల వంటి కనీస అవసరాలు తీరాలి. నాకు కొంత స్థిరమైన సంపాదన ఉంటే తప్ప సాధ్యం కాదనిపించింది. దాంతో స్థానికంగా ఓ స్కూల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అలాగే నాకు ఆర్ట్, క్రాఫ్ట్ కూడా తెలిసి ఉండడంతో పిల్లలకు పాఠాల తర్వాత బొమ్మలు వేయడం, కార్డ్‌బోర్డుతో బుక్ రాక్, పెన్సిల్ హోల్డర్, రిమోట్ బాక్సులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలు వంటి ఇంటి వాడుకలో అవసరమైన వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడం కూడా నేర్పిస్తున్నాను. వీటిని నెలకోసారి నేను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న స్కూల్‌లో స్టాల్ పెడతాం.
చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..!
ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా ఉత్పత్తులను తీసుకుంటుంది. అలా వచ్చిన డబ్బుతో జ్యోతిపాళయంలో చదువుకు దూరమైన ఆడపిల్లల చదువు కొనసాగుతోంది. నలుగురు విద్యార్థినులు టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. ఈ మధ్యనే ఒకమ్మాయి బీఈడీ పూర్తి చేసింది. ఒకమ్మాయి బీకామ్ 74 శాతంతో పూర్తి చేసి మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేస్తోంది. నా దగ్గర చదువుకుంటున్న వాళ్లలో బాలికలతోపాటు పెళ్లయిన యువతులు, బిడ్డ తల్లులు ఉన్నారు. పరీక్షలు రాసి పై చదువులకు వెళ్లలేకపోయినప్పటికీ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటామని వచ్చే వాళ్లు, చదువుకోవడం ద్వారా తమకంటూ ఒక గుర్తింపు కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లను చూసినప్పుడు వాళ్ల చేత స్కూల్ డ్రాప్ అవుట్ చేయించి పెళ్లి చేసినన తల్లిదండ్రుల మీద ఆగ్రహం కలుగుతుంటుంది కూడా’’ అంటారు సబిహా హష్మి.
అజ్జి లైబ్రరీ!
సబిహ తన డెబ్బై రెండేళ్ల వయసులో తన అక్షరసేవను పాఠ్యపుస్తకాల నుంచి కథల పుస్తకాలకు విస్తరింపచేశారు. పిల్లల పుస్తకాలతో ఒక మోస్తరు లైబ్రరీని ఏర్పాటు చేశారామె. ఆ లైబ్రరీ పేరు ‘అజ్జిస్ లెర్నింగ్ సెంటర్’. అజ్జి లైబ్రరీకి జ్యోతిపాళయం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా వారానికోసారి వచ్చి పుస్తకాలు తీసుకెళ్లి చదువుకుంటున్నారు. ఆమె సర్వీస్‌ను చూసిన వాళ్లు ప్రశంసలతో సరిపుచ్చకుండా లైబ్రరీ విస్తరణ కోసం విరాళాలిస్తున్నారు. దాంతో ఆమె కంప్యూటర్ ట్రైనింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అజ్జి లెర్నింగ్ సెంటర్‌ను పిల్లల సమగ్ర వికాసానికి దోహదం చేసే వేదికగా మలచాలనేదే తన కోరిక అంటారామె. ఇలాంటి వాళ్లు ఊరికొక్కరు ఉన్నా చాలు. బడికి దూరమైన అమ్మాయిల జీవితాలు అక్షరాలా బాగుపడతాయి.
చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment