helpings
-
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి
జైపూర్: సమాజంలో పేరు రావాలనే ఉద్దేశంతోకాకుండా ఎలాంటివి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయండని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. రాజస్తాన్‌లోని జామ్దోలీలో జరుగుతున్న సేవా సంఘ్‌లో ‘రాష్ట్రీయ సేవా భారతి’ ప్రతినిధులు, సంఘ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవత్ ఉపన్యసించారు. ‘ వ్యవస్థీకృతమైన శక్తులు ఎల్లప్పుడూ ఘన విజయాలను సొంతం చేసుకుంటాయి. విశ్వమానవాళి శ్రేయస్సు కోసం నిశ్శబ్దంగా సేవచేసే కార్యకర్తలం మనం. నిస్వార్థ సేవ అలవాటు చేసుకోండి. మనల్ని ఇంకెవరో పొగడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలపైకి దృష్టిని పోనివ్వకండి. సామాజిక సేవ చేస్తే పేరు అదే వస్తుంది. అంతమాత్రానికే దానిపై ధ్యాస పెట్టొద్దు. అహం మీకు అవరోధంగా మారొద్దు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటపుడు హుందాగా ఉండాలి. మనమేం గొప్ప పని చేయడంలేదు. సమాజం కోసం మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు. -
Pravasi Bharatiya Divas: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో సేవ
జీవితంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లినవారు తమను తాము నిరూపించుకునే దిశగా సాగుతారు. కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంటారు. తమ మూలాలను గుర్తుపెట్టుకొని సొంత గడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తుంటారు. వారి ఆలోచనలతో మరికొందరి అడుగులకు స్ఫూర్తిగా నిలుస్తారు. విదేశాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా స్వదేశంలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు విజయవాడ వాసి అయేషా, ఖమ్మం జిల్లా వాసి ఝాన్సీ. పిల్లలకు కష్టం విలువ తెలియాలని.. విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఆయేషా. ఉద్యోగం, కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్న ఆమె సేవాకార్యక్రమాలవైపు మళ్లిన ఆలోచనావిధానం గురించి తెలిపారు. ‘మా కుటుంబంతో కాలిపోర్నియాలో స్థిరపడ్డాను. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఇటీవల నాన్‌ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా అందుకున్నాను. ఉద్యోగినిగా ఉన్న నేను మొదట ఒక తల్లిగా మా పిల్లలకు సేవా ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అదే సమయంలో మా చుట్టుప్రక్కల ఉండే పిల్లల పరిస్థితి గమనించాను. పిల్లల్లో మానవతా విలువలు పెంచాలని కమ్యూనిటీ సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో ఏడేళ్ల క్రితం ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థని ప్రారంభించాను. ఇప్పుడు వందలాది మందికి పైగా వలెంటీర్లు మా ఆర్గనైజేషన్‌లో సేవలందిస్తున్నారు. మా అమ్మనాన్నలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతియేటా నిర్వహించేవాళ్లం. నాతోపాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పదిమందినైనా ఇండియాకు తీసుకువచ్చేదాన్ని. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. అందరం ఉపాధి కోసం విదేశాలకు వచ్చినవాళ్లమే. కాని మా మూలాలను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పరిస్థితులలోనే స్వదేశంలోని పిల్లలకు సర్వీస్ చేయాలనుకున్నాను. ట్రైబల్ ఏరియాలోని పిల్లలకు మా సేవలు అందేలా కృషి చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా మా సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. నిరుపేదలకు ఏదైనా సాయం కావాలని మా దృష్టికి వస్తే ఇక్కడ ఫండ్ రైజింగ్ కి వెబ్సైట్ లో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మనవాళ్లు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు ఆయేషా. మహిళల శ్రేయస్సు కోసం.. ఖమ్మం జిల్లా వాసి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అక్కడే ‘వెటా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే, పుట్టి పెరిగిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతో స్వదేశంలోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ‘‘లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని సాధించే దిశగానే మన అడుగులు ఉండాలి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లి, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పిల్లలు పుట్టాక వారిని చూసుకునే క్రమంలో ఉద్యోగాన్ని మానేసి, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఒక మహిళ ఏం చేస్తుంది ఈ రంగంలో అనుకునేవారికి నా విజయం ద్వారానే సమాధానం చెప్పాను. అమెరికాలోని మన భారతీయ మహిళల సమస్యల గురించి అర్థం చేసుకున్నాను. సొంతంగా ఎదగాలనుకునేవారు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు, గృహహింస వంటి బాధలు పడేవారు .. అన్ని రకాలుగా జీవితంతో పోరాటం చేసేవారున్నారు. అలాంటివారి శ్రేయస్సు కోసం పనిచేయాలని ‘వెటా’ను స్థాపించాను. మన విజయాలను మన అనుకున్న నలుగురికి కూడా పంచాలి. మా సొంత ఊళ్లకు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. మా ఊరు బనిగండ్లపాడు గ్రామంలోనే కాదు, మా వారు పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా తొర్రూరులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. స్కూల్ భవనాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాం. గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాం. మా చుట్టుçపక్కల మరో ఆరుగ్రామాల వరకు మా సేవలు అందిస్తుంటాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే, పేద విద్యార్థులకు ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తుంటాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చేతనైంత సాయం అందించాలన్నదే మా సిద్ధాంతం. ముందుగా మనకు మనంగా ఎదగాలి. అందుకోసం ఎంతటి కష్టమైనా పడాలి. అలాగే, నలుగురి మేలు కోసం పాటుపడినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది’’ అని వివరించారు ఝాన్సీరెడ్డి. -
సోనూసూద్ గొప్ప మనసు.. స్టూడెంట్ రిపోర్టింగ్‌కు ఫిదా.. సాయం చేస్తానంటూ
సోనూసూద్.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో.. తన సినిమాల కంటే చేసిన సేవలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా మారిన మంచి మనసున్న మహారాజు. లాక్డౌన్ కాలంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. కష్టం వచ్చిందని సోనూసూద్ దృష్టికి తీసుకొస్తే చాలు.. తనకు చేతనైనంత సాయం చేస్తుంటారు. నేటికి తన సేవలను కొనసాగిస్తున్నాడు. తాజాగా జార్ఖండ్లోనిని ఓ విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ బాలుడు తన ప్రభుత్వ పాఠశాల దుస్థితిని వివరిస్తూ రిపోర్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. సర్ఫరాజ్ అనే విద్యార్థి అచ్చం రిపోర్టర్లా నటిస్తూ పాఠశాల అంతా తిరుగుతూ తరగతి గదిలో అధ్వానమైన పరిస్థితులు, సరైన టాయిలెట్స్ లేకపోవడాన్ని రిపోర్టింగ్ చేశాడు. దీన్నంతటినీ మరో స్నేహితుడు వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ బాలుడి నైపుణ్యాలను ప్రశంసించారు. शायद आपने ऐसा पत्रकार नहीं देखा हो ये विडीओ है झारखंड की जहां एक छोटा बच्चा जर्नालिस्ट बन कर अपने स्कूल के बदहाली को एक्ष्पोस करता है बच्चे का नाम सरफराज है और विडीओ ज़िला गोड्डा से है। 1/2@zoo_bear @AshrafFem @khanumarfa @khan_zafarul @meerfaisal01 @alishan_jafri @IamYasmeeny pic.twitter.com/14Uw53iIRn — Mohammad Sunasara (@MdSunasara5) August 4, 2022 అయితే ఈ వీడియోపై తాజాగా సోనూసూద్ స్పందించాడు. బాలుడి వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘సర్ఫరాజ్.. ఇకపై నువ్వు కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొత్త పాఠశాల, హాస్టల్ తమ కోసం ఎదురుచూస్తున్నాయి’ అని తెలిపారు. ఇక సోనూసూద్ గొప్ప మనసును నెటిజన్లు మరోసారి కొనియాడుతున్నారు. -
బీఫ్ తినేవారికి సాయం చేయొద్దు!
న్యూఢిల్లీ: కేరళలో గొడ్డుమాంసం (బీఫ్) తిన్న వరదబాధతులకు సాయం చేయొద్దంటూ ఆలిండియా హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీఫ్ తినమని అఫిడవిట్ ఇచ్చిన వారికే సాయం చేయాలని పేర్కొన్నారు. హిందూధర్మం ప్రకారం గోమాతను చంపడం మహాపాపమన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ స్వామి చక్రపాణి మహారాజ్‌ను ఆలిండియా అఖాడా పరిషత్ ‘ఫేక్ బాబా’ల జాబితాలో చేర్చింది. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కారును స్వామి చక్రపాణి వేలంలో కొని తగులబెట్టిన సంగతి తెలిసిందే. -
ప్రజల కోసమే పోలీసులు
భీమారం : పోలీసులు పనిచేసేది ప్రజల కోసమేనని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండల కేంద్రంలోని బోయగూడెంలో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలంలో స్థానిక కుటుంబాలతో బుధవారం ఆయన మాట్లాడారు. 411 సర్వే నెంబర్లో 19 గుంటల భూమిని ప్రభుత్వం పీఎస్‌కు కేటాయించిందన్నారు. దీనిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సుపారిపాలన కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందులో కొత్తగా ఏర్పాటైన భీమారాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటేనే ఆ కార్యాలయాలకు కళ వస్తుందన్నారు. దసరా పండుగ సందర్భంగా జంబి పూజలు, మరోవైపు బతుకమ్మ ఆడుకుంటారని, ఇందుకోసమే అడ్డుకుంటున్నామని స్థానికులు తెలిపారు. వాటి కోసం మరోచోట స్థలం చూపించి ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఉన్న స్థలంలో కొంత భాగాన్ని బతుకమ్మ, జంబి చెట్టు కు కేటాయిస్తామని ఏసీపీ హామీఇచ్చారు. చెన్నూరు సీఐ కిశోర్, ఎస్సై మంగీలాల్ æరాజ్‌కుమార్‌నాయక్, ఎంపీపీ మెండె హేమలత, సర్పంచ్ ఎల్కటూరి శంకరమ్మ తదితరులు ఉన్నారు. ఆరెపల్లిలో కార్డెన్‌సెర్చ్ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో బుధవారం ఉదయం జైపూర్ ఏసీపీ సీతారాములు ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వాహనపత్రాలు లేని 10 ద్విక్ర వాహనాలతోపాటు టాటా ఏసీ, 9 ఆటోరిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి నిర్భంద తనిఖీ చేశారు. చెన్నూరు సీఐ కిశోర్, భీమారం ఎస్సై మంగీలాల్, శ్రీరాంపూర్ ఎస్సై రవిప్రసాద్, ఏఎస్సైలు గంగన్న, నజీర్ ఉన్నారు. -
భద్రత నినాదం కాదు.. జీవన విధానం
గడిచిన ఏడాది కాలంలో 2016 రోడ్డు ప్రమాదాలు జరిగితే 515 మంది దుర్మరణం పాలయ్యారు. 2,301 మందికి గాయాలయ్యాయి. అంతకు ముందు ఏడాది ప్రమాదాల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. దీంతో రవాణా శాఖ అధికారులు రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై 18234 కేసులు నమోదు చే సి రూ.10.72 కోట్లు వసూలు చేశారు. కఠినంగా ఉంటేనైనా వాహ నదారులు నిబంధనలు పాటిస్తారనే చిన్న ఆశ అధికారులది. ఇలా నిత్యం వాహన తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే కర్నూలు రవాణా శాఖ ఉప కమిషనర్(డీటీసీ) సీహెచ్. శివలింగయ్య తమ ప్రయత్నానికి తోడ్పాటునందిస్తున్న ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వాహనదారులు, ప్రయాణికులు ఆచరిస్తున్న రహదారి భద్రత గురించి ఆరా తీశారు. అవగాహన లేని వారికి ‘ రహదారి భద్రత కేవలం నినాదం కాదు.. అది మన జీవన విధానం కావాలి ’ అని తెలియజేశారు. ఆటో, ప్రైవేటు బస్సు డ్రైవర్లు, ద్విచక్ర వాహనచోదకులతో మాట్లాడారు. వారికి పలు సూచనలిచ్చారు. ప్రజలు లేవనెత్తిన సమస్యలు కార్యాలయంలో ఏజెంట్ల వ్యవస్థను నిర్మూలించాలి.కాల్ సెంటర్‌ను పటిష్టం చేసి.. మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి.ఆధార్ అనుసంధానంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తనిఖీలు విస్తృత చేయాలి.లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి.జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు, డాబాలపై నిషేధం ఉన్నప్పటికీ అమలు కావడం లేదు.వాహనాలపై చాలా మంది వివిధ శాఖల పేర్లతో స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా పోలీసు పిల్లలు తల్లిదండ్రుల వాహనాలతో బయట హల్చల్ చేస్తూ దౌర్జాన్యాలకు దిగుతున్నారు. డీటీసీ : మేడమ్, మీ కాలేజి బస్సు కండిషన్ ఎలా ఉంది? డ్రైవర్ అనుభవం ఉన్న వ్యక్తే ఉన్నాడా? ప్రవళ్లిక : బస్సు కండిషన్ బాగానే ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తరచూ అవగాహన సదస్సులు నిర్వహించాలి. మా బస్సుకు అనుభవం ఉన్న డ్రైవరే ఉన్నాడు. డీటీసీ : ఏమయ్యా.. ఎంత కాలంగా పనిచేస్తున్నావు?బస్సుకు సంబంధించిన అన్ని రికార్డులు ఉన్నాయా? షాలి బాషా(డ్రైవర్) : నేను 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి, వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. వారి వల్ల డ్రైవర్లందరికీ చెడ్డ పేరు వస్తోంది. లెసైన్సు లేనివాళ్లు చాలామంది వాహనాలు నడుపుతున్నారు. వారిని కట్టడి చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. డీటీసీ : ఇటీవల స్కూల్‌బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎప్పుడూ కండిషన్లో ఉంచుకోండి. ఆరు నెలలకు ఒకసారి మేము ఇచ్చే శిక్షణ తీసుకోండి. బస్ డ్రైవర్ : మీరు చెప్పిన సూచనలన్నీ తప్పకుండా పాటిస్తాం సార్, బస్సులో బోర్డు ఏర్పాటు చేసి పాఠశాల పేరు, టెలిఫోన్, మొబైల్ నంబర్‌తో సహా పూర్తి చిరునామా, బస్సు ఎడమ వైపు ముందు భాగంలో స్పష్టంగా ఏర్పాటు చేశాం. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఆపి డ్రైవర్‌తో మాట్లాడుతూ... డీటీసీ : నీ పేరేంటి? ఆటోరిక్షాల్లో ఓవర్ లోడింగ్ వేయడం తప్పు కదా? ఆటో డ్రైవర్ : నా పేరు శ్రీనివాసులు సార్, ఓవర్లోడింగ్ వేయడం తప్పే. తక్కువ పాసింజర్లతో ఆటో నడిపితే గిట్టుబాటు కాదు, డీజిల్ రేట్లు పెరిగాయి. కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణికులను ఎక్కువ మందిని ఎక్కించుకోక తప్పదు. ఫైనాన్స్ వాళ్లు బండ్లు తీసుకెళ్తున్నారు. రవాణా శాఖ, పోలీసులు కేసులు పెడుతున్నారు. సంపాదించిన సొమ్మంతా వాటికే సరిపోతుంది. కుటుంబాన్ని ఎలా బతికించుకోవాలి. డీటీసీ : పర్మిట్ సస్పెండ్ చేస్తున్నాం? అలాంటి చర్యలు వల్ల ఫలితం ఉంటుందని భావిస్తున్నారా? డ్రైవర్ : ఫలితం ఉంటుంది. కానీ కార్మికుల పట్ల కూడా అధికారులు దయతో వ్యవహరించాల్సి ఉంటుంది. డిగ్రీలు చదువుకున్న ఎంతో మంది ఉపాధి లేక ఆటోలు నడుపుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్య తీరిస్తే ఇలాంటి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. డీటీసీ : ప్రయాణికుల భద్రత కోసం రవాణా శాఖ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు? రేష్మా(పుల్లారెడ్డి దంత వైద్యశాల విద్యార్థిని) : ప్రజల్లో అవగాహన పెరగాలి. అందుకోసం రవాణ శాఖ తరచూ అవగాహన సదస్సులు నిర్వహించాలి. పాశ్చాత్య దేశాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పక్కా ప్రణాళిక ఉంటుంది. మన దేశంలో కనీసం అంబులెన్సుకు కూడా దారి ఇవ్వని పరిస్థితి ఉంది. రైల్వే గేట్ల వద్ద బస్సులు దాటుతూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. డీటీసీ : మీరు చెప్పమ్మా? ప్రమాదాలు తగ్గాలంటే ఏం చేయాలి? మౌనిక : యువతీయువకుల్లో మార్పు రావలి. ప్రమాదాలు తగ్గాలంటే ముఖ్యంగా రోడ్లు బాగుండాలి. కొంత మంది ఇయర్ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. ఫ్యాషన్ మోజులో యువకులు ద్విచక్రవాహనాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. డీటీసీ : మహిళలు ఆటోల్లో ఒంటరిగా వెళితే ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ఏమ్మా.. ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలేమిటో మీకు తెలుసా? ఇబ్బందులేమైనా ఉన్నాయా? ప్రయాణికులు మేరి, జ్యోతి : ఇటీవల కాలంలో నగరంలో చాలా సంఘటనలు జరిగినట్లు పేపరులో చూశాం. డ్రైవర్ల ముసుగులో కొంత మంది ఆరాచకాలకు పాల్పడుతున్నారు. వారిపై పోలీసులు నిఘా ఉంచాలి. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం చేసి మహిళలకు భద్రత కల్పించాలి. మేము ఆటో ప్రయాణించేటప్పుడు ఆటో నంబరు గుర్తుపెట్టుకుంటున్నాం. డీటీసీ: మీ పేరేంటి? ఆధార్ అనుసంధానం రవాణా శాఖలో కూడా అమలు చేస్తున్నాం? మీకు ఆ విషయం తెలుసా? మీరు ఆధార్ అనుసంధానం చేశారా? వాహనదారుడు : సార్, నా పేరు ప్రదీప్‌కుమార్. రవాణా శాఖలో ఆధార్ అనుసంధానం చేస్తున్న విషయం తెలుసు. అయితే ఈ వాహనం మా తండ్రి పేరుతో ఉంది. ఆయన ఆధార్ సీడింగ్ చేయించుకున్నాడు. డీటీసీ: ఆధార్ నమోదు గురించి రవాణా శాఖ విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 30 శాతం మందే ఆధార్ అనుసంధానం చేయించారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ప్రదీప్‌కుమార్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అవగాహన పెంచాలి. ఆధార్ అనుసంధానంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయి. బియ్యం కార్డు, పింఛను పోతాయన్న అనుమానాలున్నాయి? వాటిని నివృత్తి చేస్తే ప్రజలు ముందుకొస్తారు. అయినా ఫలితం కనిపించకపోతే చివరిగా ఆధార్ అనుసంధానం చేయించుకోకపోతే వారికి కార్యాలయాల్లో సేవలు నిలిపివేయాలి. లర్నింగ్ లెసైన్స్ కోసం క్యూలో నిలచివున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. డీటీసీ : మీ పేరేంటి ఎందుకొచ్చారు..? వినియోగదారుడు వెంకటేశ్వర్లు : ఎల్ఎల్ఆర్ కోసం వచ్చాను. నిబంధనల ప్రకారం లెసైన్స్‌ను ఇస్తున్నారు. డీటీసీ : ఏజెంట్ల ద్వారా వెళితేనే పనులవుతాయన్న ఫిర్యాదులున్నాయి..మీరేమంటారు ? వెంకటేశ్వర్లు : ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వచ్చిన వారికి కూడా పనులు చేస్తున్నారు. అయితే కౌంటర్ దగ్గర క్యూ లైన్ పాటించకపోవడం వల్ల కొంత మంది దౌర్జన్యంగా పనులు చేయించుకుంటున్నారు. కంప్యూటర్ టెస్ట్‌లో నిరక్షరాస్యులు ఇబ్బందు లు పడుతున్నారు. ఎల్ఎల్ఆర్, లెసైన్స్ మంజూరు పారదర్శకంగానే జరుగుతోంది. డీటీసీ : ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. వినియోగదారుడు రాజశేఖర్ : డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి వద్ద కుటుంబం ఎదురు చూస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడిపితే ప్రమాదాలు తగ్గుతాయి. నిరంతరం తనిఖీలు చేపట్టడం ద్వారా డ్రైవర్లలో కూడా మార్పు వస్తుంది. రోడ్లు శిథిలావస్థలో ఉండటం కూడా ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. సిగ్నల్స్ పై కూడా వాహన వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఐవీ శేఖర్‌రెడ్డి : సర్, నేను సీనియర్ సిటిజన్. మీతో మాట్లాడాలి. డీటీసీ : చెప్పండి. రవాణా శాఖ కార్యాలయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయా? శేఖర్‌రెడ్డి : కార్యాలయం మొత్తం అవినీతిమయమైంది. నేరుగా వెళ్లిన వారికి పనులు చేయడం లేదు. ఏజెంటు ద్వారా వెళితేనే కార్యాలయంలో పనులు జరుగుతున్నాయి. దళారుల వ్యవస్థను రూపుమాపుతామని ప్రతీ అధికారి చెబుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నాలుగు నెలల క్రితం నా ఆర్సీ బుక్ పోయింది. డూప్లికేటు పత్రం కోసం వెళితే.. వివిధ సాకులు చూపుతూ తిప్పుకుంటున్నారు. కార్యాలయం దూరంగా ఉన్నందు వల్ల వ్యయప్రయాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. లెసైన్ను రెన్యువల్ కూడా ఏజెంట్ల ద్వారా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పండి. కార్యాలయంలో ఏర్పాటు చేసిన సరిగా పనిచేయట్లేదు. పనిచేసినా.. స్పందన సరిగా లేదు. డీటీసీ: కాల్ సెంటర్‌ను పటష్టం చేస్తాం. కార్యాలయంలో నేరుగా వచ్చిన వారికి పనులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ఏజెంట్లను ఆశ్రయించవద్దు. డీటీసీ: అమ్మా మీ కళాశాల బస్సు కండిషన్లో ఉందా? డ్రైవర్ జాగ్రత్తగా మీమ్మల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాడా? భావన : ఏవీఆర్ అండ్ ఎస్వీఆర్ క ళాశాలలో నేను పనిచేస్తున్నా సర్, రోజూ మా కళాశాల బస్సులోనే నేను ఉద్యోగానికి వెళ్తాను. కళాశాల బస్సు మంచి కండిషన్లో ఉంది. డ్రైవర్ కూడా నిత్యం బస్సు కండిషన్‌ను గమనిస్తుంటాడు. ఏ చిన్న రిపేరి వచ్చినా.. వెంటనే వాటిని మరమ్మతు చేయిస్తాడు.