గడిచిన ఏడాది కాలంలో 2016 రోడ్డు ప్రమాదాలు జరిగితే 515 మంది దుర్మరణం పాలయ్యారు. 2,301 మందికి గాయాలయ్యాయి. అంతకు ముందు ఏడాది ప్రమాదాల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. దీంతో రవాణా శాఖ అధికారులు రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై 18234 కేసులు నమోదు చే సి రూ.10.72 కోట్లు వసూలు చేశారు. కఠినంగా ఉంటేనైనా వాహ
నదారులు నిబంధనలు పాటిస్తారనే చిన్న ఆశ అధికారులది.
ఇలా నిత్యం వాహన తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే కర్నూలు రవాణా శాఖ ఉప కమిషనర్(డీటీసీ) సీహెచ్. శివలింగయ్య తమ ప్రయత్నానికి తోడ్పాటునందిస్తున్న ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వాహనదారులు, ప్రయాణికులు ఆచరిస్తున్న రహదారి భద్రత గురించి ఆరా తీశారు. అవగాహన లేని వారికి ‘ రహదారి భద్రత కేవలం నినాదం కాదు.. అది మన జీవన విధానం కావాలి ’ అని తెలియజేశారు. ఆటో, ప్రైవేటు బస్సు డ్రైవర్లు, ద్విచక్ర వాహనచోదకులతో మాట్లాడారు. వారికి పలు సూచనలిచ్చారు.
ప్రజలు లేవనెత్తిన సమస్యలు
కార్యాలయంలో ఏజెంట్ల వ్యవస్థను నిర్మూలించాలి.కాల్ సెంటర్‌ను పటిష్టం చేసి.. మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి.ఆధార్ అనుసంధానంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలి.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తనిఖీలు విస్తృత చేయాలి.లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి.జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు, డాబాలపై నిషేధం ఉన్నప్పటికీ అమలు కావడం లేదు.వాహనాలపై చాలా మంది వివిధ శాఖల పేర్లతో స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా పోలీసు పిల్లలు తల్లిదండ్రుల వాహనాలతో బయట హల్‌చల్ చేస్తూ దౌర్జాన్యాలకు దిగుతున్నారు.
డీటీసీ : మేడమ్, మీ కాలేజి బస్సు కండిషన్ ఎలా ఉంది? డ్రైవర్ అనుభవం ఉన్న వ్యక్తే ఉన్నాడా?
ప్రవళ్లిక : బస్సు కండిషన్ బాగానే ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తరచూ అవగాహన సదస్సులు నిర్వహించాలి. మా బస్సుకు అనుభవం ఉన్న డ్రైవరే ఉన్నాడు.
డీటీసీ : ఏమయ్యా.. ఎంత కాలంగా పనిచేస్తున్నావు?బస్సుకు సంబంధించిన అన్ని రికార్డులు ఉన్నాయా?
షాలి బాషా(డ్రైవర్) : నేను 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొంతమంది డ్రైవర్లు మద్యం సేవించి, వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. వారి వల్ల డ్రైవర్లందరికీ చెడ్డ పేరు వస్తోంది. లెసైన్సు లేనివాళ్లు చాలామంది వాహనాలు నడుపుతున్నారు. వారిని కట్టడి చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
డీటీసీ : ఇటీవల స్కూల్‌బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎప్పుడూ కండిషన్‌లో ఉంచుకోండి. ఆరు నెలలకు ఒకసారి మేము ఇచ్చే శిక్షణ తీసుకోండి.
బస్ డ్రైవర్ : మీరు చెప్పిన సూచనలన్నీ తప్పకుండా పాటిస్తాం సార్, బస్సులో బోర్డు ఏర్పాటు చేసి పాఠశాల పేరు, టెలిఫోన్, మొబైల్ నంబర్‌తో సహా పూర్తి చిరునామా, బస్సు ఎడమ వైపు ముందు భాగంలో స్పష్టంగా ఏర్పాటు చేశాం.
సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఆపి డ్రైవర్‌తో
మాట్లాడుతూ...
డీటీసీ : నీ పేరేంటి? ఆటోరిక్షాల్లో ఓవర్ లోడింగ్ వేయడం తప్పు కదా?
ఆటో డ్రైవర్ : నా పేరు శ్రీనివాసులు సార్, ఓవర్‌లోడింగ్ వేయడం తప్పే. తక్కువ పాసింజర్లతో ఆటో నడిపితే గిట్టుబాటు కాదు, డీజిల్ రేట్లు పెరిగాయి. కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణికులను ఎక్కువ మందిని ఎక్కించుకోక తప్పదు. ఫైనాన్స్ వాళ్లు బండ్లు తీసుకెళ్తున్నారు. రవాణా శాఖ, పోలీసులు కేసులు పెడుతున్నారు. సంపాదించిన సొమ్మంతా వాటికే సరిపోతుంది. కుటుంబాన్ని ఎలా బతికించుకోవాలి.
డీటీసీ : పర్మిట్ సస్పెండ్ చేస్తున్నాం? అలాంటి చర్యలు వల్ల ఫలితం ఉంటుందని భావిస్తున్నారా?
డ్రైవర్ : ఫలితం ఉంటుంది. కానీ కార్మికుల పట్ల కూడా అధికారులు దయతో వ్యవహరించాల్సి ఉంటుంది. డిగ్రీలు చదువుకున్న ఎంతో మంది ఉపాధి లేక ఆటోలు నడుపుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్య తీరిస్తే ఇలాంటి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది.
డీటీసీ : ప్రయాణికుల భద్రత కోసం రవాణా శాఖ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు?
రేష్మా(పుల్లారెడ్డి దంత వైద్యశాల విద్యార్థిని) : ప్రజల్లో అవగాహన పెరగాలి. అందుకోసం రవాణ శాఖ తరచూ అవగాహన సదస్సులు నిర్వహించాలి. పాశ్చాత్య దేశాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పక్కా ప్రణాళిక ఉంటుంది. మన దేశంలో కనీసం అంబులెన్సుకు కూడా దారి ఇవ్వని పరిస్థితి ఉంది. రైల్వే గేట్ల వద్ద బస్సులు దాటుతూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
డీటీసీ : మీరు చెప్పమ్మా? ప్రమాదాలు తగ్గాలంటే ఏం చేయాలి?
మౌనిక : యువతీయువకుల్లో మార్పు రావలి. ప్రమాదాలు తగ్గాలంటే ముఖ్యంగా రోడ్లు బాగుండాలి. కొంత మంది ఇయర్‌ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. ఫ్యాషన్ మోజులో యువకులు ద్విచక్రవాహనాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు.
డీటీసీ : మహిళలు ఆటోల్లో ఒంటరిగా వెళితే ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ఏమ్మా.. ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలేమిటో మీకు తెలుసా? ఇబ్బందులేమైనా ఉన్నాయా?
ప్రయాణికులు మేరి, జ్యోతి : ఇటీవల కాలంలో నగరంలో చాలా సంఘటనలు జరిగినట్లు పేపరులో చూశాం. డ్రైవర్ల ముసుగులో కొంత మంది ఆరాచకాలకు పాల్పడుతున్నారు. వారిపై పోలీసులు నిఘా ఉంచాలి. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం చేసి మహిళలకు భద్రత కల్పించాలి. మేము ఆటో ప్రయాణించేటప్పుడు ఆటో నంబరు గుర్తుపెట్టుకుంటున్నాం.
డీటీసీ: మీ పేరేంటి? ఆధార్ అనుసంధానం రవాణా శాఖలో కూడా అమలు చేస్తున్నాం? మీకు ఆ విషయం తెలుసా? మీరు ఆధార్ అనుసంధానం చేశారా?
వాహనదారుడు : సార్, నా పేరు ప్రదీప్‌కుమార్. రవాణా శాఖలో ఆధార్ అనుసంధానం చేస్తున్న విషయం తెలుసు. అయితే ఈ వాహనం మా తండ్రి పేరుతో ఉంది. ఆయన ఆధార్ సీడింగ్ చేయించుకున్నాడు.
డీటీసీ: ఆధార్ నమోదు గురించి రవాణా శాఖ విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 30 శాతం మందే ఆధార్ అనుసంధానం చేయించారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది?
ప్రదీప్‌కుమార్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అవగాహన పెంచాలి. ఆధార్ అనుసంధానంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయి. బియ్యం కార్డు, పింఛను పోతాయన్న అనుమానాలున్నాయి? వాటిని నివృత్తి చేస్తే ప్రజలు ముందుకొస్తారు. అయినా ఫలితం కనిపించకపోతే చివరిగా ఆధార్ అనుసంధానం చేయించుకోకపోతే వారికి కార్యాలయాల్లో సేవలు నిలిపివేయాలి.
లర్నింగ్ లెసైన్స్ కోసం క్యూలో నిలచివున్న వారినుద్దేశించి మాట్లాడుతూ..
డీటీసీ : మీ పేరేంటి ఎందుకొచ్చారు..?
వినియోగదారుడు వెంకటేశ్వర్లు : ఎల్‌ఎల్‌ఆర్ కోసం వచ్చాను. నిబంధనల ప్రకారం లెసైన్స్‌ను ఇస్తున్నారు.
డీటీసీ : ఏజెంట్ల ద్వారా వెళితేనే పనులవుతాయన్న ఫిర్యాదులున్నాయి..మీరేమంటారు ?
వెంకటేశ్వర్లు : ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వచ్చిన వారికి కూడా పనులు చేస్తున్నారు. అయితే కౌంటర్ దగ్గర క్యూ లైన్ పాటించకపోవడం వల్ల కొంత మంది దౌర్జన్యంగా పనులు చేయించుకుంటున్నారు. కంప్యూటర్ టెస్ట్‌లో నిరక్షరాస్యులు ఇబ్బందు లు పడుతున్నారు. ఎల్‌ఎల్‌ఆర్, లెసైన్స్ మంజూరు పారదర్శకంగానే జరుగుతోంది.
డీటీసీ : ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
వినియోగదారుడు రాజశేఖర్ : డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి వద్ద కుటుంబం ఎదురు చూస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడిపితే ప్రమాదాలు తగ్గుతాయి. నిరంతరం తనిఖీలు చేపట్టడం ద్వారా డ్రైవర్లలో కూడా మార్పు వస్తుంది. రోడ్లు శిథిలావస్థలో ఉండటం కూడా ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. సిగ్నల్స్ పై కూడా వాహన వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఐవీ శేఖర్‌రెడ్డి : సర్, నేను సీనియర్ సిటిజన్. మీతో మాట్లాడాలి.
డీటీసీ : చెప్పండి. రవాణా శాఖ కార్యాలయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయా?
శేఖర్‌రెడ్డి : కార్యాలయం మొత్తం అవినీతిమయమైంది. నేరుగా వెళ్లిన వారికి పనులు చేయడం లేదు. ఏజెంటు ద్వారా వెళితేనే కార్యాలయంలో పనులు జరుగుతున్నాయి. దళారుల వ్యవస్థను రూపుమాపుతామని ప్రతీ అధికారి చెబుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నాలుగు నెలల క్రితం నా ఆర్‌సీ బుక్ పోయింది. డూప్లికేటు పత్రం కోసం వెళితే.. వివిధ సాకులు చూపుతూ తిప్పుకుంటున్నారు. కార్యాలయం దూరంగా ఉన్నందు వల్ల వ్యయప్రయాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. లెసైన్ను రెన్యువల్ కూడా ఏజెంట్ల ద్వారా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పండి. కార్యాలయంలో ఏర్పాటు చేసిన సరిగా పనిచేయట్లేదు. పనిచేసినా.. స్పందన సరిగా లేదు.
డీటీసీ: కాల్ సెంటర్‌ను పటష్టం చేస్తాం. కార్యాలయంలో నేరుగా వచ్చిన వారికి పనులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ఏజెంట్లను ఆశ్రయించవద్దు.
డీటీసీ: అమ్మా మీ కళాశాల బస్సు కండిషన్‌లో ఉందా? డ్రైవర్ జాగ్రత్తగా మీమ్మల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాడా?
భావన : ఏవీఆర్ అండ్ ఎస్‌వీఆర్ క ళాశాలలో నేను పనిచేస్తున్నా సర్, రోజూ మా కళాశాల బస్సులోనే నేను ఉద్యోగానికి వెళ్తాను. కళాశాల బస్సు మంచి కండిషన్‌లో ఉంది. డ్రైవర్ కూడా నిత్యం బస్సు కండిషన్‌ను గమనిస్తుంటాడు. ఏ చిన్న రిపేరి వచ్చినా.. వెంటనే వాటిని మరమ్మతు చేయిస్తాడు.
భద్రత నినాదం కాదు.. జీవన విధానం
Published Sun, Feb 8 2015 3:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement