కుట్టు... కొట్టేసేందుకు...!
విద్యార్థుల యూనిఫాంలపై టీడీపీ నేతల కన్ను
కుట్టు పనిని తమకే ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు
కొటేషన్ లేకుండా ఇస్తే ఇబ్బందొస్తుందేమోనని భయపడుతున్న అధికారులు
ఒక్కొక్కరికీ అందజేయవలసిన యూనిఫాంలు : రెండు జతలు
జతకు చెల్లించవలసిన రుసుం : రూ.40 మొత్తం విలువ : రూ.కోటీ 37 లక్షలు
జిల్లా సమాఖ్యకు : 12 మండలాలు ఇంకా ఎవరికీ ఇవ్వని మండలాలు : 22
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే యూనిఫాంలపైనా అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఆ దుస్తులు కుట్టే పనిని ఎటువంటి కొటేషన్ లేకుండా కొట్టేసేందుకు అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తుండడంతో అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ పనికి దాదాపు రూ. కోటీ 37లక్షలు కేటాయించడంతో వచ్చిన అవకాశాన్ని వదలుకోకూడదని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇది అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఎవరికి అప్పగించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
సమాఖ్యకు ఇవ్వకుండా మోకాలడ్డు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలను కుట్టించే బాధ్యతల్ని గతంలో జిల్లా సమాఖ్యకు అప్పగించేవారు. డీఆర్‌డీఏ అనుబంధ సంస్థగా, డ్వాక్రా మహిళల అభివృద్ధికి దోహద పడిన వ్యవస్థగా పనిచేస్తుండడంతో ఎటువంటి కొటేషన్ లేకుండా జిల్లా సమాఖ్యకు కుట్టుబాధ్యతను అప్పగిస్తూ వచ్చారు. ఆ వచ్చే లాభమేదో మహిళలకు దక్కుతుందనేది ప్రభుత్వం అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే జిల్లా సమాఖ్య తమకు అందుబాటులో ఉన్న టైలర్లతో కుట్టించి, ఐదారు రూపాయల మార్జిన్ తీసుకునేది. కానీ రెండేళ్ల క్రితం జిల్లా సమాఖ్యను తప్పించి, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ)లకు దుస్తులు కుట్టించే బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. ఆ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు తమకు తెలిసిన దర్జీలతో కుట్టించేవి. రెండేళ్ల కాలపరిమితితో ఏర్పడిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు ఈ ఏడాది మార్చిలో పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం పాఠశాలలు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల్లేవు.
దీంతో ఈ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో ఏకంగా జిల్లా సమాఖ్యకే కుట్టు బాధ్యతల్ని అప్పగించేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, మహిళలకు ఉపాధి కల్పించినట్టవుతుందని ప్రాథమిక విద్య శాఖ కమిషనర్ సంధ్యారాణి రాష్ట్ర స్థాయిలో ప్రతిపాదించినట్టు తెలిసింది. కానీ, టీడీపీ నేతలు ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. జిల్లా సమాఖ్యకు అప్పగిస్తే తమకు లబ్ధి చేకూరదన్న ఉద్దేశంతో జిల్లా సమాఖ్య ప్రతిపాదన తీసుకొచ్చిన కమిషనర్‌నే ఏకంగా బదిలీ చేయించినట్టు ఆరోపణలున్నాయి. మహిళల స్వయం ఉపాధికి దోహదపడే నిర్ణయాన్ని వ్యతిరేకించారన్న భావన బయటకెళ్తే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందన్న భయంతో కంటి తుడుపుగా కొన్ని మండలాలను జిల్లా సమాఖ్యకు అప్పగించి, మిగతా వాటిని తమ పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు వ్యూహరచన చేశారు. అందులో భాగంగా సూచన ప్రాయ ఆదేశాలిస్తూ నిర్ణయ అధికారాన్ని కలెక్టర్లకు వదిలేశారు.
మల్లగుల్లాలు
జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థులు లక్షా 72వేల మంది ఉన్నారు. వీరందరికీ రెండేసి జతలు చొప్పున యూనిఫాంలను అందించాల్సి ఉంది. ఒక్కొక్క జతకు రూ. 200 చొప్పున కేటాయింపులు జరిగాయి. ఆప్కో నుంచి కొనుగోలు కూడా చేసేశారు. జతకు రూ. 40 చొప్పున కుట్టు చార్జీలు చెల్లించనున్నారు. ఈ లెక్కన రెండు జతలకు రూ. 80 కుట్టు చార్జీలవుతాయి. ఈ లెక్కన లక్షా 72వేల మంది విద్యార్థుల దుస్తుల కుట్టు చార్జీల కింద రూ. కోటీ 37లక్షల వరకు ఖర్చు పెట్టనున్నారు. జిల్లా సమాఖ్యకు కొన్ని కేటాయించేసి, మిగతావి తమకిచ్చేయాలని టీడీపీ నేతలు అధికారుల్ని సతాయించడం ప్రారంభించారు. ఈ క్రమంలో 12మండలాల పాఠశాలల విద్యార్థుల దుస్తుల కుట్టు బాధ్యతల్ని జిల్లా సమాఖ్యకు అప్పగించారు. మిగతా మండలాల్ని కేటాయించే విషయమై తర్జనభర్జన పడుతున్నారు. తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. భారీ మొత్తంలో కావడంతో కొటేషన్ లేకుండా ప్రైవేటు వ్యక్తులకిస్తే విమర్శలకు గురి కావల్సి వస్తుందని, అలాగని నేతల సిఫార్సుల మేరకు ఇవ్వకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయిస్తే తప్పనిసరిగా కొటేషన్ పిలవాల్సిందే. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇవ్వవల్సి ఉంటుంది. అలా చేస్తే నేతల సిఫార్సుల మేరకు కట్టబెట్టే అవకాశం ఉండదు.దీన్ని దృష్ట్యా అధికారులు సందిగ్ధంలో పడ్డట్టు తెలిసింది.