
బీజింగ్: స్కూల్‌కు, కాలేజీకి వెళ్తున్నామని చెప్పి... డుమ్మాలు కొట్టే విద్యార్థుల ఆటలు ఇకపై సాగవు. ఎందుకంటే మీరెక్కడున్నా ఇట్టే చెప్పేసే స్మార్ట్ యూనిఫామ్స్ వచ్చేస్తున్నాయి. అద్భుతాలకు అడ్డాగా చెప్పుకునే చైనా ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. స్కూల్ ఎగ్గొట్టి బయట తిరుగుతున్న విద్యార్థులకు చెక్ పెట్టేందుకు ‘స్మార్ట్ యూనిఫామ్స్’ను ప్రయోగిస్తోంది. యూనిఫామ్‌లకు అమర్చిన చిప్‌ల ద్వారా విద్యార్థులు ఏ సమయంలో స్కూల్‌కి వచ్చారో? ఎప్పుడు బయటికి వెళ్లారో? లొకేషన్‌తోసహా తల్లిదండ్రులేకాదు.. పాఠశాలల యాజామాన్యాలు కూడా పర్యవేక్షించవచ్చు.
‘‘విద్యార్థులు స్కూల్‌లో ప్రవేశించగానే ఫోటో, వీడియో తీసేందుకు స్మార్ట్ యూనిఫామ్‌లు సాయం చేస్తాయి’’ అని గిఝౌ ప్రావిన్స్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపాల్ ర్యాన్ రుగ్జియాంగ్ పేర్కొన్నారు. ఈ స్కూల్‌లో గతేడాది నవంబర్ నుంచే స్మార్ట్ యూనిఫామ్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ విద్యార్థులు అనుమతి లేకుండా స్కూల్ నుంచి బయటికి వెళ్తే వెంటనే ఆటోమేటిక్ వాయిస్ అలారం మోగుతుందట. స్కూల్ తలుపులపై అమర్చిన ఫేషియల్ రికగ్నిషన్ డివైజ్‌లను యూనిఫామ్‌లకు అనుసంధానం చేయడం వల్ల.. ఎవరైనా యూనిఫామ్ మార్చుకునేందుకు ప్రయత్నించినా ఇట్టే తెలిసిపోతుందట. విద్యార్థులు తప్పిపోయినా, తరగతులు ఎగ్గొట్టినా ఎక్కడున్నారో తెలుసుకునేందుకు స్మార్ట్ యూనిఫామ్‌లు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. యూనిఫామ్‌లోని చిప్‌తో అనుసంధానమైన యాప్ ద్వారా విద్యార్థులకు హోమ్‌వర్క్‌లు, నోటిఫికేషన్లు కూడా పంపుతున్నారట!
Comments
Please login to add a commentAdd a comment