విద్యార్థినుల విన్యాసాలు
పశ్చిమగోదావరి, నిడదవోలు: యోగాసనాలు, మాస్‌డ్రిల్, సూర్య నమస్కారాల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరుస్తున్నారు. విద్యాబుద్ధులతో పాటు ఉపాధ్యాయులు వీటిపై కూడా శిక్షణ ఇవ్వడంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలు అధిగమించేందుకు యోగాసనాలు, సూర్యనమస్కారాలు దోహదపడతాయని, ముఖ్యంగా పదో తరగతి విద్యార్థినులు పరీక్షల సమయంలో ఒత్తిళ్లను సునాయాసంగా ఎదుర్కోవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. నిడదవోలు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రతి శుక్ర, శనివారాల్లో 7,8 పీరియడ్లు విద్యార్థినులకు సూర్యనమస్కారాలు, యోగాసనాలు, కెలస్థానిక్స్ వ్యాయామం, కోలాటం, పిరమిడ్ ప్రదర్శనపై ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. హైస్కూల్‌లో 72 మంది విద్యార్థినులు వీటిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.
శిక్షణలో భాగంగా అమ్మాయిల విన్యాసాలు, యోగాసనాలు ఆకట్టుకుంటున్నాయి. వృశ్చికాసనం, సింహసనం, కాలభైరవ ఆసనం, ద్విపాద హస్తాసనం, కూర్మాసనం, కర్ణపీడాసనం తదితర ఆసనాలను చిన్నారులు సులువుగా ప్రదర్శిస్తున్నారు. యోగానాలను ప్రదర్శిస్తూ తోటి విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. మాస్‌డ్రిల్‌లో సుమారు 50 మంది విద్యార్థినులు యోగసనాలను ప్రదర్శిస్తూ మిగిలిన విద్యార్థులను ఉత్తేజపరుస్తున్నారు. కెలస్థానిక్స్ వ్యాయామం, డబుల్ లెజ్యుమెన్స్, వండ్స్, హూప్స్, కోలాటం, సూర్యనమస్కాలు క్రమం తప్పకుండా ప్రదర్శించడంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం నిండుకుంటుంది. ప్రధానంగా ధ్యానం, యోగ సాధనలో విశిష్టస్థానం పొందిన సూర్య నమస్కారాల సాధనలో మంచి ప్రతిభ చూపుతున్నారు. ఇందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయురాలు కృషిచేస్తున్నారు.
శారీరక, మానసికఉల్లాసం కోసం..
విద్యార్థులకు మానసిక, శారీరక శ్రమ ఎంతో అవసరం. పాఠశాలలో విద్యార్థినులకు క్రమం తప్పకుండా యోగాసనాలతో పాటు కెలస్థానిక్స్ వ్యాయామం, డబుల్ లెజ్యుమెన్స్, వండ్స్, హూప్స్, కోటాటం, సూర్యనమస్కాలు తప్పకుండా చేయిస్తున్నాం. పదో తరగతి పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు ఇవి చేయడంతో రక్తప్రసరణ పూర్తిస్థాయిలో ఉంటుంది. తద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తరగతి గదుల్లో గంటలు కొద్ది కూర్చున్న విద్యార్థులకు మాస్‌డ్రిల్‌తో నూతనోత్సాహం వ స్తుంది. బద్దకం పోయి చదువులో చక్కగా రాణిస్తూ ఉత్సాహంగా ఉంటారు. –వి.లక్ష్మీ, హెచ్‌ఎం, నిడదవోలు
ఒత్తిళ్లకు దూరంగా..
హైస్కూల్‌లో శుక్ర, శనివారా ల్లో మాస్‌డ్రిల్, యోగాసనా లు, సూర్యనమస్కారాలను చేయించడం ద్వారా విద్యార్థినులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. యోగాసనాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తున్న విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థుల శరీర ఆకృతి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యవంతమైన ఆలోచనలకు యోగా ఉపయోగపడుతుంది. వివిధ ఆసనాలను ఎంతో సులభంగా విద్యార్థినులు వేయడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. –పీబీ కృష్ణకుమారి,వ్యాయామ ఉపాధ్యాయులు, నిడదవోలు
Comments
Please login to add a commentAdd a comment