‘పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే పిల్లలు పాఠ్యప్తుకాలతో బడికి రావాలి.. ఆ మేరకు పుస్తకాల పంపిణీ చేపట్టండి’ ఏటా విద్యాశాఖకు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు ఇవీ. కానీ అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. పుస్తకాలు మాత్రం పుణ్యకాలం గడిచిపోయాక విద్యార్థి చేతికందుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 17 రోజుల్లో పాఠశాలల తలుపులు తెరుచుకోనుండగా.. ఇంతవరకూ ఒక్క పుస్తకమూ జిల్లాకు చేరలేదు.
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలలు మరో 17 రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటిదాకా జిల్లాకు ఒక్కటంటే ఒక్క పుస్తకమూ చేరలేదు. ముద్రణ కూడా ఇంకా పూర్తి కాలేదు. ముద్రణ పూర్తయి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరి ఇక్కడి నుంచి మండలాలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేర్చి విద్యార్థుల చేతికి అందేలోపు పుణ్యకాలం కాస్తా పూర్తవుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఏడాది ముచ్చటే : బడులు తెరిచిన తర్వాత ఓవైపు సిలబస్ జరుగుతుండడం, మరోవైపు పాఠ్యపుస్తకాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. అయితే మూడేళ్ల కిందట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ పాఠశాలలవిద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలనే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లా చరిత్రలో తొలిసారిగా ఆ ఏడాది పాఠ్యపుస్తకాలు పాఠశాలలు ప్రారంభం నాటికే వచ్చేశాయి. అయితే ఇది కేవలం ఆ ఏడాదికి మాత్రమే పరిమితమైంది. తర్వాత ఏడాది నుంచి షరా మూమాలే. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, కన్నడ, ఉర్దూ మీడియం 1–10 తరగతుల విద్యార్థులకు సుమారు 23,80,250 పాఠ్యపుస్తకాలు అవసరం. మిగులుస్టాకు 2,74,621 పుస్తకాలు ఉన్నాయి. ఇవిపోను 21,05,629 పుస్తకాలు అవసరం. ముద్రణా సంస్థ నుంచి ఇప్పటిదాకా ఒక్క పుస్తకమూ రాలేదు.
ఆన్‌లైన్ కష్టాలు
ఈ సంవత్సరం ఇండెంట్ వివరాలను ఆన్‌లైన్‌లో పంపాలని రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో గతేడాది ముద్రణ సంస్థ నుంచి జిల్లా కేంద్రానికి చేరిన పుస్తకాల వివరాలను జిల్లా అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అలాగే జిల్లానుంచి ఆయా మండలాలకు పంపిన పాఠ్య పుస్తకాల వివరాలు, మండలాల నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేసిన పుస్తకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అయినా కూడా రాష్ట్ర అధికారులు ఒక నిర్ణయానికి రాలేదు. తాజాగా మరోసారి ఎంఈఓల నుంచి ఇండెంట్ కోరారు. దీన్నిబట్టి చూస్తుంటే ఈ సంవత్సరం ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయన్న దానిపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టత లేదని తెలుస్తోంది. గడువు ముంచుకొస్తుండడంతో యూడైస్ లెక్కల ఆధారంగా విద్యార్థుల నంఖ్యను తీసుకుని ఆ ప్రకారం విడతల వారీగా పుస్తరాలు ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో తొలివిడతగా ముద్రించిన పుస్తకాలను త్వరలోనే జిల్లాకు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
విద్యార్థి చేతికి అందేదెప్పుడో
పుస్తకాలు ముద్రణ సంస్థ నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని గోడౌన్‌కు చేరుతాయి. అక్కడి నుంచి మండల పాయింట్లకు పంపుతారు. మండల పాయింట్ల నుంచి స్కూళ్లకు పంపి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ తతంగం పూర్తి కావాలంటే కనీసం రెండునెలలకు పైగా సమయం అవుతుంది. అప్పటిదాకా విద్యార్థులు బడులకు వెళ్లి ఏమి చదువుకుంటారో, ఉపాధ్యాయులు వారికి ఎలా పాఠాలు చెబుతారో అధికారులకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment