సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటివరకూ 63 శాతమే పంపిణీ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా 37 శాతం పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టేలా కన్పిస్తోంది. అయితే, మరో పది రోజుల్లో మొత్తం పుస్తకాలను విద్యార్థుల వద్దకు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే బోధన మొదలైంది. సర్కారీ బడుల్లో మాత్రం పుస్తకాల కొరత కారణంగా బోధన చేపట్టలేదు. దీన్ని కప్పి పుచ్చుకోవడానికి బ్రిడ్జ్ కోర్సు పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. జూలైలోనూ పుస్తకాలు ఇవ్వకుండా, బోధన మొదలవ్వకపోతే విద్యార్థుల్లో ప్రమాణాలు ఎలా పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. విద్యా శాఖ అంచనా ప్రకారం దాదాపు 1.67 కోట్ల పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. బడులు మొదలై నెల రోజులకుపైగా గడిచినా ఇప్పటివరకూ 1.07 కోట్ల పుస్తకాలనే బడులకు పంపారు. ఇంకా 60 లక్షల పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులందరికీ సరిపడా పుస్తకాలు లేకపోవడంతో పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులూ తికమక పడుతున్నారు.
ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే స్థానికంగా ఇబ్బందులొస్తున్నాయని అంటున్నారు. దీంతో స్కూళ్లకు చేరిన పుస్తకాలను కూడా పంపిణీ చేయడం లేదు. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన చేపట్టాల్సి ఉండటంతో ద్విభాషలో పుస్తకాలు ముద్రించారు.
పది రోజుల్లో ఇస్తాం: శ్రీనివాసచారి, డైరెక్టర్ ప్రభుత్వ పుస్తక ముద్రణ విభాగం
పుస్తకాలకు అవసరమైన కాగితం ఆలస్యంగా రావడంతోనే సకాలంలో ముద్రించలేకపోయాం. ఇప్పటికే 63 శాతం జిల్లాలకు పంపాం. వాటిని వెంటనేపంపిణీ చేయమని చెప్పాం. మిగతావి కూడా మరో పది రోజుల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment