Free text books
-
తెలంగాణ: పుస్తకాల ముద్రణ ఇంకా ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటివరకూ 63 శాతమే పంపిణీ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా 37 శాతం పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టేలా కన్పిస్తోంది. అయితే, మరో పది రోజుల్లో మొత్తం పుస్తకాలను విద్యార్థుల వద్దకు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే బోధన మొదలైంది. సర్కారీ బడుల్లో మాత్రం పుస్తకాల కొరత కారణంగా బోధన చేపట్టలేదు. దీన్ని కప్పి పుచ్చుకోవడానికి బ్రిడ్జ్ కోర్సు పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. జూలైలోనూ పుస్తకాలు ఇవ్వకుండా, బోధన మొదలవ్వకపోతే విద్యార్థుల్లో ప్రమాణాలు ఎలా పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. విద్యా శాఖ అంచనా ప్రకారం దాదాపు 1.67 కోట్ల పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. బడులు మొదలై నెల రోజులకుపైగా గడిచినా ఇప్పటివరకూ 1.07 కోట్ల పుస్తకాలనే బడులకు పంపారు. ఇంకా 60 లక్షల పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులందరికీ సరిపడా పుస్తకాలు లేకపోవడంతో పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులూ తికమక పడుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే స్థానికంగా ఇబ్బందులొస్తున్నాయని అంటున్నారు. దీంతో స్కూళ్లకు చేరిన పుస్తకాలను కూడా పంపిణీ చేయడం లేదు. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన చేపట్టాల్సి ఉండటంతో ద్విభాషలో పుస్తకాలు ముద్రించారు. పది రోజుల్లో ఇస్తాం: శ్రీనివాసచారి, డైరెక్టర్ ప్రభుత్వ పుస్తక ముద్రణ విభాగం పుస్తకాలకు అవసరమైన కాగితం ఆలస్యంగా రావడంతోనే సకాలంలో ముద్రించలేకపోయాం. ఇప్పటికే 63 శాతం జిల్లాలకు పంపాం. వాటిని వెంటనేపంపిణీ చేయమని చెప్పాం. మిగతావి కూడా మరో పది రోజుల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. -
చదువులు.. చతికిలబడి!
మెదక్ : జిల్లాలో 46 మండలాలు ఉండగా, అందులో ముగ్గురు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు. మిగిలిన 43 మంది గెజిటెడ్ హెచ్ఎంలు తాత్కాలికంగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో సుమారు సగం మంది హెచ్ఎంలు ఇటీవల జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అయితే వీరి స్థానాల్లో ఆగస్టు 1 నాటికి ఆయా మండలాల్లోని సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంలకు ఎంఈఓలుగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు లోగడ ప్రకటించారు. ఈ మేరకు జూలై 23 నాటికి సీనియర్ ప్రధానోపాధ్యాయుల జాబితాను కూడా తెప్పించుకున్నారు. కానీ, నేటికీ కొత్తవారికి బాధ్యతలు అప్పజెప్పలేదు. జంట బాధ్యతలతో పనిభారం సిద్దిపేట డివిజన్లో నలుగురికి, సంగారెడ్డి డివిజన్లో 8 మంది, మెదక్ డివిజన్లో ఐదుగురు కొత్త ఎంఈఓలుగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. జోగిపేట డివిజన్లో కూడా పాత ఎంఈఓలు పనిచేసిన మండలాల్లో కొంతమంది సీనియర్ హెచ్ఎంలు బదిలీపై రావడంతో వారందరి వివరాలను డీఈఓ కార్యాలయానికి పంపినట్లు జోగిపేట డిప్యూటీ ఈఓ పోమ్యా నాయక్ తెలిపారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీ అయిన స్థానాల్లో పాతవారినే కొనసాగిస్తున్నారు. వారిలో చాలా మంది సుమారు 60 కి.మీ. దూరంలో గల స్కూళ్లకు హెచ్ఎంలుగా బదిలీ అయ్యారు. వీరు ప్రస్తుతం అటు ప్రధానోపాధ్యాయ బాధ్యతలు, ఇటు ఎంఈఓ విధులు నిర్వర్తించలేక ఇబ్బందులు పడుతున్నారు. మండల విద్యాశాఖకు ముఖ్య అధికారైన ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ లేక పాఠశాలల్లో విద్యావ్యవస్థ కుంటుపడుతుంది. గత నెలలో జరిగిన మండల కాంప్లెక్స్ సమావేశాల్లో పాత ఎంఈఓలు మొక్కుబడిగా పాల్గొన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ సమావేశాల్లో బాలల సంఘాలు, హరితహారం, ఫార్మేటీవ్-1లకు సంబంధించిన ప్రశ్నపత్రాల తయారీ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఇటు మండలాల్లో జీత భత్యాలు, మధ్యాహ్న భోజన బిల్లులు, మరోవైపు వారు పనిచేసే పాఠశాలల్లో అవే పనులు చేయాల్సి రావడంతో పనిభారం ఎక్కువవుతుందని వాపోతున్నారు. అందని పాఠ్యపుస్తకాలు... పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఇప్పటి వరకు కొన్ని పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ పూర్తి కాలేదు. జిల్లాకు 2,22,015 పుస్తకాలు అవసరం. ఇప్పటికి 19,16,137 మాత్రమే సరఫరా అయ్యాయి. సక్సెస్ స్కూళ్లలోని ఆంగ్ల మాధ్యమంలో 50 శాతం పుస్తకాలే పంపిణీ అయ్యాయి. మరోవైపు ఈ నెల 12న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ డివిజన్లలో ‘ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జాబిషన్’లు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి ఎంఈఓలు లేకపోవడంతో వీటి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
కుట్టులోగుట్టు!
యూనిఫాం కుట్టేందుకు అధికార పార్టీకి అనుకూలమైన ఏజెన్సీలకు అప్పగింత {పతిఫలంగా అధికార పార్టీ నేతలకు 10 శాతం కమీషన్ 37 మండలాల్లో మాత్రమే యూనిఫాం పంపిణీ 16 మండలాల విద్యార్థులకు అందని వైనం {పతి ఏటా ఇదే పరిస్థితి.. ముందస్తు చర్యలు కరువు {పభుత్వ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం విద్యార్థులకు తప్పని ఇబ్బందులుయూనిఫాం.. మారిన అర్థాలు.. ప్రభుత్వ ఉద్దేశం.. అందరూ సమానమే.. ధనిక, పేద అనే తేడా లేకుండా తరగతి గదిలో అందరూ సమానమేననే భావన విద్యార్థులలో కలిగించడానికి ప్రభుత్వం యూనిఫాం (ఒకే రకమైన దుస్తులు)ను ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాం అందజేయాలి. అధికారుల కొత్త నిర్వచనం.. అందరికీ ఒకే కొలతలు.. ఎత్తు, లావు, పొట్టి అనే తేడా లేకుండా తరగతి గదిలో అందరూ సమానమేనని చెప్పడానికి ప్రస్తుతం ఒకే సైజు యూనిఫాం (ఒకే విధమైన కొలతలతో) పంపిణీ చేస్తున్నారు. దీంతో కొందరికి వదులుగా, మరికొందరికి టైటుగా ఉంటున్నాయి. ఆరు నెలలు గడిచినా యూనిఫాం అందజేయలేదు. కర్నూలు విద్య : అధికార పార్టీకి చెందిన నేతలు కమీషన్‌కు కక్కుర్తిపడి పేద విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫాంను కుట్టేందుకు తమకు అనుకూలమైన ఏజెన్సీలకు మాత్రమే ఇప్పించుకున్నారు. కుట్టే బాధ్యతలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అధికార పార్టీ నాయకులకు 10 నుంచి 15 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో సర్వశిక్ష అభియాన్‌లో పని చేస్తున్న ఓ అధికారి బినామీ పేరు మీద 10 ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కుట్టు కూలిలో కమీషన్‌తో క్లాత్‌ను సరఫరా చేసే ఆప్కో అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు 10 శాతం కమీషన్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 37 మండలాల్లో యూనిఫాం పంపిణీ జిల్లాలో మొత్తం 2798 ప్రభుత్వం పాఠశాలలు ఉండగా ఇందులో 3,45,442 విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి రెండేసి జతలు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాం బట్టకు రూ.160 , కుట్టు కూలి జతకు రూ.40 ప్రకారం రెండు జతలకు రూ.400 మంజూరు చేస్తుంది. 2014-15 విద్యా సంవత్సరానికి గాను యూనిఫాంలకు రూ.13.81 కోట్లు కేటాయించింది. జిల్లాలో సుమారు 3 వేల స్కూల్ యాజమాన్య కమిటీలు ఉన్నాయి. యూనిఫాంలకు అయ్యే ఖర్చులను సర్వశిక్ష అభియాన్ అధికారులు ఆయా పాఠశాల యాజమాన్య కమిటీల ఖాతాల్లో జమ చేశారు. అయినా పూర్తి స్థాయిలో యూనిఫాం పంపిణీ చేయలేదు. జిల్లాలో కేవలం ఇప్పటి వరకు 37 మండలాలకు చెందిన విద్యారులకు మాత్రమే యూనిఫాం అందజేశారు. మిగతా 16 మండలాలకు దుస్తులు అందజేయలేదు. పాత కొలతలు.. కొత్త అవస్థలు..! విద్యార్థుల యూనిఫాం కోసం క్లాత్‌ను పంపిణీ చేస్తున్న అప్కో అధికారులు నాసిరకమైన బట్టను అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ళుగా ఏ ఏడాది కూడా నిర్ణిత గడువులోపు విద్యార్థులకు దుస్తులను అందించిన దాఖలాలు లేవని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యా సంవత్సర ప్రారంభంలోనే విద్యార్థుల దుస్తుల కొలతలు తీసుకోవాల్సి ఉంది. కుట్టు కూలి తక్కువగా ఉందని..ప్రభుత్వం ఇచ్చే ధర గిట్టదని స్థానికులు ముందుకు రారని ఏజెన్సీలకు కట్టబెడుతున్నారు. దుస్తులు కుట్టు కూలి పెంచకపోవడంతో ఏజెన్సీలు ఎలాంటి కొలతలు తీసుకోకుండానే తరగతి వారీగా సుమారుగా ఇష్టానుసారంగా కుట్టుతుండడంతో విద్యార్థులకు సరిపోవడం లేదు. ఇటీవల గోనెగండ్ల మండల కేంద్రంలో ఉన్న ఓ స్కూల్‌కి పంపిణి చేయగా సగానికిపైగా సరైన కొలతలు లేకుండా కుట్టడంతో తిరిగి కుట్టించుకున్నట్లు ఆ స్కూల్ టీచర్లు చెబుతున్నారు. కొంత మంది విద్యార్థులకు దుస్తులు సరిపోకపోవడంతో ఇళ్ల దగ్గరే విడిచి పెట్టి రంగుల దుస్తుల్లోనే స్కూళ్లకు వస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఏజెన్సీలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. యూనిఫాం కుట్టుతో సంబంధం లేదు 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు జత యూనిఫాంకు నిధులు వచ్చాయి. ఈ మొత్తం ఆయా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాలకు జమ చేశాం. 45 మండలాలకు చెందిన యూనిఫాం కుట్టు పూర్తి అయింది. మిగతా మండలాలకు చెందిన యూనిఫాం త్వరలోనే కుట్టు పూర్తి చేసి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కుట్టుతో మాకేలాంటి సంబంధం లేదు. కుట్టించేందుకు స్కూల్ యాజమాన్య కమిటీలకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. వారు స్థానికంగా కుట్టించినా..ఏజెన్సీలతో కుట్టించినా అది వారిష్టం. - మురళీధర్ రావు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి