పాఠ్య పుస్తకాలకు తడ‘బడి’.. | Telangana Govt Schools Textbook printing New academic year | Sakshi
Sakshi News home page

పాఠ్య పుస్తకాలకు తడ‘బడి’..

Published Mon, May 16 2022 12:43 AM | Last Updated on Mon, May 16 2022 3:18 PM

Telangana Govt Schools Textbook printing New academic year - Sakshi

► వేసవి సెలవుల అనంతరం జూన్‌ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరంలోనే 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎక్కువ సంఖ్యలో పాఠ్య పుస్తకాలను ముద్రించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియే పూర్తికాక పోవడంతో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది.

► పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఫిబ్రవరి, మార్చి నుంచే మొదలవ్వాల్సి ఉంది. సాధారణంగా ఏప్రిల్, మేలో పుస్తకాల ముద్రణ పూర్తయినా, విద్యార్థులకు జూలై వరకూ అందని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పుస్తకాల ముద్రణ పెరగడంతో పాటు, ఇప్పటివరకు ముద్రణకు టెండర్లే ఖరారు కాకపోవడంతో స్కూళ్లు తెరిచినా కనీసం రెండు నెలల వరకు పుస్తకాల పంపిణీ జరిగే అవకాశం కన్పించడం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది జూన్‌ 13 నుంచి మొదలయ్యే విద్యా సంవత్సరంలోనే 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్‌    స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈ దిశగా కార్యాచరణ కన్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించే పరిస్థితి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే స్కూళ్లు తెరిచినా, కనీసం రెండు నెలల వరకూ విద్యార్థి చేతికి పుస్తకం వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. రెండేళ్లుగా కరోనా వల్ల విద్యా సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. అరకొరగా నడిచినా పాఠశాల విద్యపై కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని ప్రభుత్వ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తు తం తిరిగి గాడిలో పడుతున్న సమయంలో పాఠ్యపుస్తకాలు ఆలస్యం కానుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల విద్య కమిషనర్‌ దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

రెండు భాషలతో పెరిగిన ముద్రణ
ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్‌ 2భాషల్లో (బై లింగ్వల్‌) పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించింది. ఒక వైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు భాషలో పాఠాలను ముద్రిస్తారు. దీంతో పుస్తకం బరువు దాదాపు రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించారు. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 (ఎస్‌ఏ–1) వరకు ఉన్న సిలబస్‌ను ఒక పుస్తకంలో, ఎస్‌ఏ–2లో ఉన్న సిలబస్‌తో మరో పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ప్రింట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 24 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వీటిని అందజేస్తారు. ఉచితంగా అందించే పుస్తకాలను 2.10 కోట్ల వరకు, ప్రైవేటులో విక్రయానికి మరో 1.40 కోట్ల పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. గతంలో ఉచితంగా అందించే పుస్తకాలకు రూ. 60 కోట్లు వెచ్చిస్తే... ఇప్పుడు రూ.120 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు.

ఖరారు కాని టెండర్లు
ప్రభుత్వ ముద్రణాలయంలో యంత్రాలన్నీ చాలావరకు పాతబడి, ముద్రణకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఫలితంగా ప్రైవేటు ముద్రణాలయాల్లో వీటిని ముద్రించాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, పరిశ్రమల శాఖ నుంచి ఓ అధికారి, ప్రభుత్వ ముద్రణాలయం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.

అయితే ఇప్పటివరకు ఈ కమిటీ సీనియస్‌గా భేటీ అయిన దాఖలాల్లేవు. కమిటీ భేటీ లేకుండానే టెండర్ల ప్రక్రియ చేపట్టారనే విమర్శలున్నాయి. పేపర్‌ అందించేందుకు తమిళనాడు పేపర్‌ మిల్స్, పంజాబ్‌కు చెందిన సాతియా పేపర్స్, చండీగఢ్‌కు చెందిన మరో సంస్థ టెండర్లు వేసింది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. పుస్తకాలు ఆలస్యంగా వస్తే బోధనతో పాటు విద్యార్థులు చదువుకోవడమూ కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జూన్‌ నెలాఖరు లక్ష్యంగా పెట్టుకున్నాం
పుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్లు ఈ నెల 16న తెరుస్తాం. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఎల్‌–1ను గుర్తించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ద్విభాష ముద్రణ కావడం వల్ల ఈసారి పుస్తకాల ముద్రణ ఎక్కువ సంఖ్యలో చేయాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా పుస్తకాలు ముద్రించే ప్రయత్నం చేస్తున్నాం. స్కూళ్ళు తెరిచే సమయానికి కొన్ని పుస్తకాలు అందించడంతో పాటు అన్ని పుస్తకాలను జూన్‌ నెలాఖరులోగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– ఎస్‌ శ్రీనివాసచారి (డైరెక్టర్, ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌)

సకాలంలో పుస్తకాలు ఇవ్వాలి : చెరుకు ప్రద్యుమ్నకుమార్‌ (ప్రభుత్వ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ సెంటర్, కరీంనగర్‌)
ఆంగ్ల భాషలో బోధన చేపడుతున్న నేపథ్యంలో ముందే విద్యార్థుల చేతికి పుస్తకాలు అందాలి. అప్పుడే వాళ్ళకు కొత్త విధానంపై కొంత అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన ప్రిపరేషన్‌ చేసుకునే వీలుంటుంది. పుస్తకాలు ఆలస్యమైతే సిలబస్‌ పూర్తి కోసం బోధనను పరుగులు పెట్టించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 

ప్రతి ఏటా ఆలస్యంతో ఇబ్బంది
పాఠ్య పుస్తకాల ముద్రణ ఆలస్యం ప్రతి ఏటా ఇబ్బందిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తిరిగి తీసుకుని, లైబ్రరీలో భద్రపరిచి, కొత్త వారికి ఇవ్వాలి. దీనివల్ల ఆలస్యం సమస్య తలెత్తదు. ప్రభుత్వ ఖజానాపై భారమూ తగ్గుతుంది.
– మామిడోజు వీరాచారి (లోకల్‌ కేడర్‌ ప్రభుత్వ టీచర్ల సంఘం అధ్యక్షుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement