పాఠ్యపుస్తకాల్లో 36-24-36.. కేంద్రమంత్రి ఆగ్రహం
మహిళల శరీర కొలతల గురించి పాఠ్యపుస్తకంలో అభ్యంతరకరంగా ప్రచురించిన ప్రచురణకర్త మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఒక ప్రైవేటు పబ్లిషర్ ప్రచురించిన ఈ పుస్తకంలో.. మహిళలకు, పురుషులకు శరీరాకృతిలో చాలా తేడా ఉంటుందని చెప్పారు. మహిళల్లో అయితే 36-24-36 కొలత అత్యుత్తమమని అన్నారు. అందుకే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాంటి పోటీలలో ఈ కొలతలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. పురుషులకైతే.. వి షేప్ బాగుంటుందని అన్నారు. అయితే.. ఆరోగ్యం, శారీరక విద్యకు సంబంధించిన ఈ పుస్తకాన్ని తాము అసలు 12వ తరగతి విద్యార్థులకు ఇవ్వమని చెప్పలేదని సీబీఎసఈ అంటోంది.
పుస్తకంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల గురించి అసలు ఎక్కడా అనకూడని విషయాలను ఏకంగా పుస్తకంలో ప్రచురించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎస్‌ఈ పాఠశాలలన్నీ కేవలం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలని, అప్పుడు మాత్రమే వారికి సరైన చదువు అబ్బుతుందని, అదే అందరికీ మంచిదని ఆయన చెప్పారు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించానన్నారు. సీబీఎస్‌ఈ స్కూళ్లన్నింటిలో సరైన పుస్తకాలు ఉండేలా చూడాలని చెప్పారు.
ఢిల్లీకి చెందిన న్యూ సరస్వతి హౌస్ అనే ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకంలో ఆ పేజీ ఉన్న భాగం వరకు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో సీబీఎస్‌ఈ నుంచి హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ వరకు ప్రతి ఒక్కరూ గట్టిగా స్పందించారు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు తమ గుర్తింపు ఉన్న స్కూళ్లకు ప్రైవేటు పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలు వాడాలని తాము చెప్పబోమని సీబీఎస్‌ఈ తెలిపింది. ఇంతకుముందు కూడా పుస్తకాల విషయంలో ఇలాగే తప్పులు దొర్లాయి. బి అంటే బాంబు అని, సి అంటే చాకు అని ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని స్కూళ్లలో ఉపయోగించిన పుస్తకాల్లో ప్రచురించారు.