జంతర్‌మంతర్ వద్ద ఆందోళన దృశ్యం
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి గణితం, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షల కొత్త తేదీలను మూడు రోజుల్లో ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు. ఈ రెండు ప్రశ్నపత్రాలు లీకయ్యాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో తిరిగి పరీక్ష నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న జవడేకర్.. దోషులెవరైనా వదిలిపెట్టమని గురువారం హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల భయాందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరగాలనే రెండు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్ అనితా కార్వాల్ చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు 25 మందిని విచారించారు.
జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల నిరసన..
రెండు సబ్జెక్టులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం ఉదయం భారీగా గుమిగూడిన విద్యార్థులు ‘వుయ్ వాంట్ జస్టిస్’ అని నినదించారు. ‘ మా జీవితాలతో ఆటలు ఆపండి’, ‘ మళ్లీ పరీక్షలను విద్యార్థులకు కాకుండా వ్యవస్థకు నిర్వహించండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. పరీక్షల ముందు రోజు దాదాపు అన్ని ప్రశ్నాపత్రాలు బహిర్గతమయ్యాయని, పునఃపరీక్ష జరిగితే అన్ని సబ్జెక్టులకు జరగాలని చాలా మంది విద్యార్థులు డిమాండ్ చేశారు. కొందరు చేసిన తప్పుకు విద్యార్థులందరినీ శిక్షించడం సరికాదని పదో తరగతి విద్యార్థిని భవికా యాదవ్ ఆవేదన వ్యక్తం చేసింది.
జవదేకర్‌ను తొలగించండి: కాంగ్రెస్
సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతానికి సంబంధించి జవదేకర్, సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్ కార్వాల్‌లను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మోదీ ప్రభుత్వం ఎగ్జామ్ మాఫియాను ప్రోత్సహిస్తోందని, లీకేజీ లాంటి సంఘటనలు లక్షలాది విద్యార్థుల ఆశలు, భవిష్యత్తును చిదిమేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ హెచ్చరించారు. రోజుకో లీకు(డేటా లీకేజీని ప్రస్తావిస్తూ) బయటికి రావడం ‘చౌకీదార్’ బలహీనతకు నిదర్శనమని ప్రధాని మోదీకి పరోక్షంగా చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment