
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సీబీఎస్‌ఈ పేపర్ లీక్ వ్యవహారం నానాటికి ముదురుతోంది. 12వ తరగతి ఎకానామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ పేపర్లు లీక్ కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో స్టూడెంట్ యూనియన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలకు దిగారు. అంతేకాకుండా సీబీఎస్‌ఈ కార్యాలయం వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇతర పేపర్లలో కూడా ప్రశ్నలు చాలా సులువుగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల అందరికీ లీకైన పేపర్ల పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నేను అందులో ఒక్కడిని : మంత్రి
పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నేరస్తుల్ని తప్పకుండా శిక్షిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలనని, తాను వారిలో ఒక్కడినేనని ఆయన పేర్కొన్నారు.