సాక్షి, ముంబై : ఇటీవల నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తూ, త్వరలోనే పదో తరగతి, ప్లస్ టూ విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్లు లీకయిన నేపథ్యంలో మళ్లీ పరీక్షలు నిర్వహించబోవడంపై పలువురు బాలీవుడ్ నటులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు.
ఫర్హాన్ అక్తర్ : ‘వారి తప్పేం లేకున్నా విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరమైన విషయం. దీన్ని ఎదుర్కొవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
వివేక్ ఒబేరాయ్ : ‘పేపర్ లీక్ అవ్వడం అన్యాయం. ఇన్నాళ్లు కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరిగింది. రెండోసారి పరీక్ష రాసేవారికి మరో అవకాశం లభించినట్లు. గతంలో కంటే ఈ సారి ఇంకా బాగా పరీక్ష రాయండి’ అని పేర్కొన్నారు.
రాహుల్ ధోలకియా : ‘పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని తెలిసి నేను చాలా నిరాశచెందాను. పరీక్షలంటేనే నాకు చాలా కోపం. విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామంటే నాకు చాలా కోపం వస్తుంది. పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని’ అభిప్రాయపడ్డారు.
ఈ సంవత్సరం 16,38,428 విద్యార్థులు పదో తరగతి కోసం, 11,86,306 మంది విద్యార్థులు ప్లస్ టూ తరగతి బోర్డు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరికి తిరిగి పరీక్షలు ఏ తేదీలలో నిర్వహిస్తారనే అంశం, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక వారంలోపు సీబీఎస్‌ఈ వెబ్సైట్‌లో పెడతామని బోర్డు తెలిపింది. ప్లస్ టూ ఎకనామిక్స్ పేపర్, పదో తరగతి మ్యాథ్స్ పేపర్లు లీక్ అయ్యాయి. ఈ పేపర్స్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు అంటూ పరీక్షలకు కొద్ది రోజుల ముందు చేతితో ప్రశ్నలు రాసి ఉన్న పేపర్ సోషలో మీడియాలో వైరల్ అయింది. అందులో ఉన్న ప్రశ్నలే సీబీఎస్‌ఈ తయారు చేసిన ప్రశ్న పత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment