క్రికెట్ సంచలనంపై పోలీస్ జులుం
ముంబై: అది ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో గల సుభాష్ మైదాన్. శనివారం సాయంత్రం అక్కడ ఓ కేంద్ర మంత్రి హెలికాప్టర్ దిగబోతోందన్న సమాచారంతో పోలీసుల హడావిడి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి విమానం దిగడానికి ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అత్యుత్సాహం ప్రదర్శించి ’క్రికెట్ సంచలనం’ ప్రణవ్‌ను స్టేషన్‌కు తరలించి.. తప్పుడు కేసు బుక్ చేయడానికి ప్రయత్నిచారు.
ప్రణవ్ ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఓ ఇన్నింగ్స్‌లో అజేయంగా 1009 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన కుర్రాడు. ఏ స్థాయిలో నైనా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్‌తో పాటు పలువురు క్రికెట్ క్రీడా దిగ్గజాల మన్ననలు అందుకున్నాడు. అయితే.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ హెలికాఫ్టర్ కోసం ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు ప్రణవ్ పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
ప్రాక్టీస్‌లో ఉన్న ప్రణవ్‌ను అక్కడ నుంచి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే మైదానం వదిలి వెళ్లడానికి ప్రణవ్ నిరాకరించాడు. క్రీడా స్థలాన్ని పొలిటికల్ లీడర్స్ హెలికాప్టర్‌లు దిగడానికి ఎందుకు కేటాయిస్తారని వాదించాడు. దీంతో ఎస్సై కదమ్ ప్రణవ్‌పై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న ప్రణవ్ తండ్రి ప్రశాంత్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రణవ్‌తో పాటు తండ్రిని పోలీసులు తీసుకెళ్లి జీపులో పడేసి.. బజార్‌పెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన పోలీసులు తమపై తప్పుడు కేసు బనాయించాలని చూశారని ప్రణవ్ వాపోయాడు.
ఆ ప్రాంతంలో రెండు ఉర్దూ పాఠశాలల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కేంద్ర మంత్రి జవదేకర్.. వాస్తవానికి ఆ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ విషయంలో తప్పు పోలీసులదే అని జవదేకర్ స్పష్టం చేశారు. పోలీసుల తీరుపట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.