Pranav Dhanawade
-
క్రికెట్ సంచలనంపై పోలీస్ జులుం
ముంబై: అది ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో గల సుభాష్ మైదాన్. శనివారం సాయంత్రం అక్కడ ఓ కేంద్ర మంత్రి హెలికాప్టర్ దిగబోతోందన్న సమాచారంతో పోలీసుల హడావిడి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి విమానం దిగడానికి ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అత్యుత్సాహం ప్రదర్శించి ’క్రికెట్ సంచలనం’ ప్రణవ్ను స్టేషన్‌కు తరలించి.. తప్పుడు కేసు బుక్ చేయడానికి ప్రయత్నిచారు. ప్రణవ్ ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఓ ఇన్నింగ్స్‌లో అజేయంగా 1009 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన కుర్రాడు. ఏ స్థాయిలో నైనా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్‌తో పాటు పలువురు క్రికెట్ క్రీడా దిగ్గజాల మన్ననలు అందుకున్నాడు. అయితే.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ హెలికాఫ్టర్ కోసం ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు ప్రణవ్ పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రాక్టీస్‌లో ఉన్న ప్రణవ్ను అక్కడ నుంచి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే మైదానం వదిలి వెళ్లడానికి ప్రణవ్ నిరాకరించాడు. క్రీడా స్థలాన్ని పొలిటికల్ లీడర్స్ హెలికాప్టర్లు దిగడానికి ఎందుకు కేటాయిస్తారని వాదించాడు. దీంతో ఎస్సై కదమ్ ప్రణవ్‌పై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న ప్రణవ్ తండ్రి ప్రశాంత్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రణవ్‌తో పాటు తండ్రిని పోలీసులు తీసుకెళ్లి జీపులో పడేసి.. బజార్పెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన పోలీసులు తమపై తప్పుడు కేసు బనాయించాలని చూశారని ప్రణవ్ వాపోయాడు. ఆ ప్రాంతంలో రెండు ఉర్దూ పాఠశాలల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కేంద్ర మంత్రి జవదేకర్.. వాస్తవానికి ఆ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ విషయంలో తప్పు పోలీసులదే అని జవదేకర్ స్పష్టం చేశారు. పోలీసుల తీరుపట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
సెలక్టర్లకు వెయ్యి పరుగులు సరిపోలేదా?
ముంబై:ఇటీవల ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో వెయ్యి పరుగులకు పైగా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనావాడే గుర్తున్నాడు కదా! జనవరి నెలలో ఆర్య గురకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేసీ గాంధీ స్కూల్ కు ప్రాతినిథ్యం వహించిన ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు. దాంతో ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్.. ప్రపంచ క్రికెట్లో ఓ సంచలనంగా మారిపోయాడు. ఓ కొత్త హీరో వచ్చాడంటూ కితాబులూ ఇచ్చేశాం. ఆపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చి ఆ కుర్రాడిని అభినందిండమూ చూశాం. మరి, ఇన్ని పరుగులు చేసిన ఆ ముంబై కుర్రాడి ప్రతిభ సెలక్టర్లు కనిపించలేనట్లే ఉంది. అండర్ -16 జట్టుకు సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను ఎంపిక చేసిన సెలక్టర్లు, ప్రణవ్ను అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు అర్జున్‌కు ఇటీవల చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్ మారిపోయింది. ఒక ఆటో డ్రైవర్ కొడుకు కావడంతోనే ప్రణవ్ను ఎంపిక చేయలేదంటూ విమర్శల వర్షం కురుస్తోంది. వరల్డ్ రికార్డు సాధించిన ప్రణవ్ను ఎంపిక చేయకుండా, ఎటువంటి రికార్డులేని అర్జున్ ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం సచిన్ కుమారుడు కావడం వల్లే అర్జున్ను ఎంపిక చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే వెస్ట్ జోన్ అండర్-16 జట్టుకు ప్రణవ్ అర్హుడు కాదని, కేవలం ముంబై అండర్ -16 జట్టుకు మాత్రమే అర్హుడని సెలక్టర్లు వివరణ ఇచ్చినా, ఆన్ లైన్ దుమారం మాత్రం ఆగలేదు. -
బహుమతిగా సచిన్ బ్యాట్
న్యూఢిల్లీ:ఇటీవల ఇంటర్ స్కూల్ టోర్నీలో చెలరేగిపోయి వెయ్యికి పైగా పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనావాడేకు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి అరుదైన బహుమతి లభించింది. సచిన్ టెండూల్కర్ స్వహస్తాక్షరితో రాసిన బ్యాట్ ను ధనావాడేకు కానుకగా ఇచ్చాడు. ఈ విషయాన్ని తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. ధనావాడే రికార్డు సృష్టించిన మరుక్షణమే ముందుగా అతనికి అభినందనలు తెలిపిన సచిన్.. బ్యాట్ ను బహుమతిగా ఇచ్చి ఉన్నతిని చాటుకున్నాడని బీసీసీఐ తెలిపింది. గత రెండు రోజుల క్రితం ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే చరిత్రను సృష్టించి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణవ్.. 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో అజేయంగా 1009 పరుగులు చేసి క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉండగా ప్రణవ్ ను మహారాష్ట్ర మంత్రి ఏక నాథ్ షిండే ఒక బొకే ఇచ్చి సత్కరించారు. దీంతో పాటు ఒక క్రికెట్ కిట్ ను అతనికి బహుకరించారు. ఈ సందర్భంగా ఏక్ నాథ్ మాట్లాడుతూ.. ఆ 15 ఏళ్ల కుర్రాడు భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిరోహించాలంటూ ఆశీర్వదించారు. తమ ప్రభుత్వానికి సాధ్యమైన సహకారాన్ని ప్రణవ్ కు అందిస్తామని మంత్రి ఏక్నాథ్ మరోసారి ప్రభుత్వం తరపున హామి ఇచ్చారు. -
పరిణతికి సలామ్
ప్రణవ్ ధనావ్‌డే 1009 పరుగులతో క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించడం గురించి అందరం మాట్లాడుకున్నాం. కానీ 15 ఏళ్ల పిల్లాడు ఆ ముందు రోజు రాత్రి భరించిన ఉత్కంఠ, వేయి పరుగుల స్కోరును చేర డానికి అనుభవించిన ఒత్తిడి... కేవలం అతనికి మాత్రమే తెలుసు. పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా చూపించలేని నిబ్బరంతో, ఎంతో పరిణతితో ఆడిన ప్రణవ్‌కు సలామ్ చెప్పాల్సిందే. ముంబై: సోమవారం సాయంత్రం వరకూ ప్రణవ్ ముంబైలో రోజూ క్రికెట్ ఆడే స్కూల్ పిల్లలకు ఏ మాత్రం భిన్నం కాదు. ఆడుకోవాలి. ఇంటికెళ్లి కొద్దిసేపు చదువుకోవాలి. తొమ్మిది గంటలకల్లా భోంచేసి నిద్ర పోవాలి. ఈ షెడ్యూల్ మారితే మళ్లీ తెల్లవారుజామునే లేచి ప్రాక్టీస్‌కు వెళ్లడం కష్టం. సోమవారం స్కూల్ మ్యాచ్‌లో 652 పరుగులు చేయగానే తాను ప్రపంచ రికార్డు సృష్టించానని ప్రణవ్‌కు తెలిసింది. అయితే అప్పటికి ఈ విషయం మీడియాకు తెలియలేదు. ఎప్పటిలాగే ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఈ లోగా ముంబై క్రికెట్ సంఘం స్కోర్లను చూసే మీడియా ప్రతినిధులకు కొంతమందికీ విషయం తెలిసింది. ఎవరితను? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అంతే ఇంటి దగ్గర సందడి మొదలైంది. ఈ విషయం క్రమంగా ముంబై అంతటా తెలిసింది. చుట్టాలు, స్నేహితులు, తెలిసిన వాళ్లు, తెలియనివాళ్లతోనూ ఇల్లు నిండిపోయింది. అందరూ అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కానీ అదే సమయంలో రేపు మళ్లీ వెళ్లి మ్యాచ్ ఆడాలని గుర్తొస్తోంది. ఈలోగా ఎవరో అన్నారు... రేపు వేయి పరుగులు చేస్తాడని. అంతే... తొలిసారి ప్రణవ్ మనసులో వేయి అనే మాట పడింది. ఒత్తిడి పెరిగింది. రాత్రి 12 గంటలకు గానీ ఇల్లు సద్దుమణగలేదు. నిద్ర పోదామంటే రావడం లేదు. ఏదో తెలియని సంతోషం ఒక వైపు... రేపు ఏంటనే ఉత్కంఠ మరోవైపు. మొత్తం హడావుడి ఉదయం మైదానానికి వెళ్లి వార్మప్ పూర్తి చేసే సమయానికి కళ్యాణ్ ప్రాంత ఎమ్మెల్యే నరేంద్ర పవార్ వచ్చేశాడు. చుట్టూ అనుచరులు, పోలీసులు హడావుడి పెరిగింది. ‘వేయి చేయాలి’... అది ఆశీర్వాదమా? లేక ఒత్తిడా..? ఇదంతా కోచ్ హరీశ్ శర్మ గమనిస్తూనే ఉన్నారు. బ్యాటింగ్‌కు వెళ్లేముందు ప్రణవ్ను పక్కకు తీసుకెళ్లారు. ఏం చెప్పారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రణవ్ బ్యాటింగ్‌కు వెళ్లాడు. లంచ్ సమయానికి 921 పరుగులు చేశాడు. ఈ లోగా ఆ ప్రాంత పోలీస్ కమిషనర్ మైదానానికి వచ్చారు. స్థానికంగా ఉండే ఆటోడ్రైవర్ల దగ్గరి నుంచి విషయం తెలిసిన వారితో మైదానం తిరునాళ్లలా మారింది. ఇక మీడియా సందడి సరే సరి. పూర్తిగా నిండిన స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడటానికే ఎంతోమంది క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతారు. మరి 15 ఏళ్ల పిల్లాడు ఇంత ఒత్తిడిని అధిగమించాలంటే ఎంత పరిణతి కావాలి. ఆ ఒత్తిడిని తట్టుకుని వేయి పరుగుల మార్కును అందుకున్నాడంటే నిజంగానే అదో అద్భుతం. ‘రెండో రోజు బ్యాటింగ్‌కు ముందు చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఒక్కసారి వెళ్లి ఆడటం మొదలుపెట్టాక, రికార్డులు, వేయి మార్కు అన్నీ మరచిపోయాను. మధ్యలో ఏవైనా అరుపులు వినిపించినా... నన్ను నేను నియంత్రించుకున్నాను’ అని ప్రణవ్ చెప్పాడు. ఎంసీఏ స్కాలర్షిప్ ప్రణవ్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఏంసీఏ) స్కాలర్షిప్ ఇవ్వనుంది. ఇప్పటి నుంచి డిసెంబరు 2021 వరకు ఐదేళ్ల పటు ప్రతి నెలా పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. తన ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రణవ్ను భారత మాజీ క్రికెటర్లు వెంగ్‌సర్కార్, అజిత్ వాడేకర్ బుధవారం సన్మానించారు. -
'ఆ కుర్రాడి విద్యా, కోచింగ్ ఖర్చులు ప్రభుత్వానివే'
ముంబై:ఇంటర్ స్కూల్ టోర్నీలో వెయ్యి పరుగులకు పైగా సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేకు చేయూతనిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇక నుంచి ప్రణవ్ కు అయ్యే విద్యా, క్రికెట్ కోచింగ్ ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావేదే ఆ కుర్రాడి ప్రతిభను కొనియాడుతూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ' ప్రణవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇది రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణం. అందుచేత ఆ 15 ఏళ్ల యువకుడికి నాణ్యమైన క్రికెట్ కోచింగ్ ఇప్పించడంతో పాటు, విద్యాపరమైన ఖర్చులను మహారాష్ట్ర సర్కారే భరాయించాలని నిర్ణయించింది 'అని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఆటో డ్రైవర్ అయిన ఆ కుర్రాడి తండ్రిని వినోద్ తావేదే కలిసి అభినందించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన కల్యాణ్ లో ఉన్న కేసీ గాంధీ స్కూల్లో ప్రణవ్ 10 వ తరగతి చదువుతున్నాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో ఆ స్కూల్ తరపున బరిలోకి దిగిన ప్రణవ్.. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన న మ్యాచ్‌లో 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు.సుమారుగా 395 నిమిషాల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఉన్న ప్రణవ్ 312.38 స్ట్రైక్ రేట్ తో ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం. అంతకుముందు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉన్న 116 సంవత్సరాల ప్రపంచ రికార్డు చెరిగిపోవడమే కాకుండా, 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది. -
ప్రణవ్‌కు సచిన్ అభినందన
ముంబై: క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందలతో ముంచెత్తాడు.అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరును లిఖించుకున్న సచిన్.. ప్రణవ్ వెయ్యి పరుగుల రికార్డుకు ముగ్ధుడయ్యాడు. ఒక రికార్డుల వేటలో అపారమైన స్వీయ అనుభవం ఉన్న సచిన్.. ప్రణవ్ రికార్డు వెనుక అపారమైన కృషి దాగి వుందని కొనియాడాడు. ' అజేయంగా 1000 పరుగులకు పైగా చేసి అన్ని స్థాయి క్రికెట్ రికార్డులను తిరగరాశావు. నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నీ కృషే నీకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. నీవు ఇంకా ఎన్నో మైలు రాళ్లు అధిగమిస్తూ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నా'అని సచిన్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణవ్.. ఓ ఇన్నింగ్స్ లో అజేయంగా 1009 పరుగుల ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో పరుగుల వరద పారించాడు. తొలిరోజు 78 ఫోర్లు, 30 సిక్సర్లు సాయంతో 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధన్వాడే.. రెండో రోజు మరో 29 సిక్సర్లు, 51 ఫోర్లతో చెలరేగిపోయి అజేయంగా నిలిచాడు. అనంతరం ప్రణవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీ గాంధీ స్కూల్ 1465 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.