బహుమతిగా సచిన్ బ్యాట్
న్యూఢిల్లీ:ఇటీవల ఇంటర్ స్కూల్ టోర్నీలో చెలరేగిపోయి వెయ్యికి పైగా పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనావాడేకు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి అరుదైన బహుమతి లభించింది. సచిన్ టెండూల్కర్ స్వహస్తాక్షరితో రాసిన బ్యాట్ ను ధనావాడేకు కానుకగా ఇచ్చాడు. ఈ విషయాన్ని తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. ధనావాడే రికార్డు సృష్టించిన మరుక్షణమే ముందుగా అతనికి అభినందనలు తెలిపిన సచిన్.. బ్యాట్ ను బహుమతిగా ఇచ్చి ఉన్నతిని చాటుకున్నాడని బీసీసీఐ తెలిపింది.
గత రెండు రోజుల క్రితం ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే చరిత్రను సృష్టించి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణవ్.. 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో అజేయంగా 1009 పరుగులు చేసి క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇదిలా ఉండగా ప్రణవ్ ను మహారాష్ట్ర మంత్రి ఏక నాథ్ షిండే ఒక బొకే ఇచ్చి సత్కరించారు. దీంతో పాటు ఒక క్రికెట్ కిట్ ను అతనికి బహుకరించారు. ఈ సందర్భంగా ఏక్ నాథ్ మాట్లాడుతూ.. ఆ 15 ఏళ్ల కుర్రాడు భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిరోహించాలంటూ ఆశీర్వదించారు. తమ ప్రభుత్వానికి సాధ్యమైన సహకారాన్ని ప్రణవ్ కు అందిస్తామని మంత్రి ఏక్నాథ్ మరోసారి ప్రభుత్వం తరపున హామి ఇచ్చారు.