పరిణతికి సలామ్
ప్రణవ్ ధనావ్‌డే 1009 పరుగులతో క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించడం గురించి అందరం మాట్లాడుకున్నాం. కానీ 15 ఏళ్ల పిల్లాడు ఆ ముందు రోజు రాత్రి భరించిన ఉత్కంఠ, వేయి పరుగుల స్కోరును చేర డానికి అనుభవించిన ఒత్తిడి... కేవలం అతనికి మాత్రమే తెలుసు. పెద్ద పెద్ద క్రికెటర్లు కూడా చూపించలేని నిబ్బరంతో, ఎంతో పరిణతితో ఆడిన ప్రణవ్‌కు సలామ్ చెప్పాల్సిందే.
ముంబై: సోమవారం సాయంత్రం వరకూ ప్రణవ్ ముంబైలో రోజూ క్రికెట్ ఆడే స్కూల్ పిల్లలకు ఏ మాత్రం భిన్నం కాదు. ఆడుకోవాలి. ఇంటికెళ్లి కొద్దిసేపు చదువుకోవాలి. తొమ్మిది గంటలకల్లా భోంచేసి నిద్ర పోవాలి. ఈ షెడ్యూల్ మారితే మళ్లీ తెల్లవారుజామునే లేచి ప్రాక్టీస్‌కు వెళ్లడం కష్టం. సోమవారం స్కూల్ మ్యాచ్‌లో 652 పరుగులు చేయగానే తాను ప్రపంచ రికార్డు సృష్టించానని ప్రణవ్‌కు తెలిసింది. అయితే అప్పటికి ఈ విషయం మీడియాకు తెలియలేదు. ఎప్పటిలాగే ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఈ లోగా ముంబై క్రికెట్ సంఘం స్కోర్లను చూసే మీడియా ప్రతినిధులకు కొంతమందికీ విషయం తెలిసింది.
ఎవరితను? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అంతే ఇంటి దగ్గర సందడి మొదలైంది. ఈ విషయం క్రమంగా ముంబై అంతటా తెలిసింది. చుట్టాలు, స్నేహితులు, తెలిసిన వాళ్లు, తెలియనివాళ్లతోనూ ఇల్లు నిండిపోయింది. అందరూ అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కానీ అదే సమయంలో రేపు మళ్లీ వెళ్లి మ్యాచ్ ఆడాలని గుర్తొస్తోంది. ఈలోగా ఎవరో అన్నారు... రేపు వేయి పరుగులు చేస్తాడని. అంతే... తొలిసారి ప్రణవ్ మనసులో వేయి అనే మాట పడింది. ఒత్తిడి పెరిగింది. రాత్రి 12 గంటలకు గానీ ఇల్లు సద్దుమణగలేదు. నిద్ర పోదామంటే రావడం లేదు. ఏదో తెలియని సంతోషం ఒక వైపు... రేపు ఏంటనే ఉత్కంఠ మరోవైపు.
మొత్తం హడావుడి
ఉదయం మైదానానికి వెళ్లి వార్మప్ పూర్తి చేసే సమయానికి కళ్యాణ్ ప్రాంత ఎమ్మెల్యే నరేంద్ర పవార్ వచ్చేశాడు. చుట్టూ అనుచరులు, పోలీసులు హడావుడి పెరిగింది. ‘వేయి చేయాలి’... అది ఆశీర్వాదమా? లేక ఒత్తిడా..? ఇదంతా కోచ్ హరీశ్ శర్మ గమనిస్తూనే ఉన్నారు. బ్యాటింగ్‌కు వెళ్లేముందు ప్రణవ్‌ను పక్కకు తీసుకెళ్లారు. ఏం చెప్పారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రణవ్ బ్యాటింగ్‌కు వెళ్లాడు. లంచ్ సమయానికి 921 పరుగులు చేశాడు. ఈ లోగా ఆ ప్రాంత పోలీస్ కమిషనర్ మైదానానికి వచ్చారు. స్థానికంగా ఉండే ఆటోడ్రైవర్ల దగ్గరి నుంచి విషయం తెలిసిన వారితో మైదానం తిరునాళ్లలా మారింది.
ఇక మీడియా సందడి సరే సరి. పూర్తిగా నిండిన స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడటానికే ఎంతోమంది క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతారు. మరి 15 ఏళ్ల పిల్లాడు ఇంత ఒత్తిడిని అధిగమించాలంటే ఎంత పరిణతి కావాలి. ఆ ఒత్తిడిని తట్టుకుని వేయి పరుగుల మార్కును అందుకున్నాడంటే నిజంగానే అదో అద్భుతం. ‘రెండో రోజు బ్యాటింగ్‌కు ముందు చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఒక్కసారి వెళ్లి ఆడటం మొదలుపెట్టాక, రికార్డులు, వేయి మార్కు అన్నీ మరచిపోయాను. మధ్యలో ఏవైనా అరుపులు వినిపించినా... నన్ను నేను నియంత్రించుకున్నాను’ అని ప్రణవ్ చెప్పాడు.
ఎంసీఏ స్కాలర్‌షిప్
ప్రణవ్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఏంసీఏ) స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. ఇప్పటి నుంచి డిసెంబరు 2021 వరకు ఐదేళ్ల పటు ప్రతి నెలా పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. తన ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రణవ్‌ను భారత మాజీ క్రికెటర్లు వెంగ్‌సర్కార్, అజిత్ వాడేకర్ బుధవారం సన్మానించారు.