సెలక్టర్లకు వెయ్యి పరుగులు సరిపోలేదా?
ముంబై:ఇటీవల ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో వెయ్యి పరుగులకు పైగా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనావాడే గుర్తున్నాడు కదా! జనవరి నెలలో ఆర్య గురకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేసీ గాంధీ స్కూల్ కు ప్రాతినిథ్యం వహించిన ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు. దాంతో ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్.. ప్రపంచ క్రికెట్లో ఓ సంచలనంగా మారిపోయాడు. ఓ కొత్త హీరో వచ్చాడంటూ కితాబులూ ఇచ్చేశాం. ఆపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన క్రికెట్ బ్యాట్ను బహుమతిగా ఇచ్చి ఆ కుర్రాడిని అభినందిండమూ చూశాం.
మరి, ఇన్ని పరుగులు చేసిన ఆ ముంబై కుర్రాడి ప్రతిభ సెలక్టర్లు కనిపించలేనట్లే ఉంది. అండర్ -16 జట్టుకు సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను ఎంపిక చేసిన సెలక్టర్లు, ప్రణవ్ను అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు అర్జున్కు ఇటీవల చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్ మారిపోయింది. ఒక ఆటో డ్రైవర్ కొడుకు కావడంతోనే ప్రణవ్ను ఎంపిక చేయలేదంటూ విమర్శల వర్షం కురుస్తోంది. వరల్డ్ రికార్డు సాధించిన ప్రణవ్ను ఎంపిక చేయకుండా, ఎటువంటి రికార్డులేని అర్జున్ ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం సచిన్ కుమారుడు కావడం వల్లే అర్జున్ను ఎంపిక చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే వెస్ట్ జోన్ అండర్-16 జట్టుకు ప్రణవ్ అర్హుడు కాదని, కేవలం ముంబై అండర్ -16 జట్టుకు మాత్రమే అర్హుడని సెలక్టర్లు వివరణ ఇచ్చినా, ఆన్ లైన్ దుమారం మాత్రం ఆగలేదు.