కేఎస్‌సీఏ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో (కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్బుత ప్రదర్శనతో మెరిశాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల ఘనత నమోదు చేశాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అర్జున్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ 13 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం అభినవ్ తేజ్‌రాణా సెంచరీతో (109) కదంతొక్కడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసింది. గోవా ఇన్నింగ్స్‌లో మంతన్ కుట్కర్ అర్ద సెంచరీతో (69) రాణించాడు.
భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక..సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. అర్జున్ 13.3 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో గోవా భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ మొత్తంలో అర్జున్ 26.3 ఓవర్లు వేసి 87 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. వచ్చే వారం 25వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న అర్జున్.. సీనియర్ లెవెల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. ఇందులో 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ అర్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ తన కెరీర్‌లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment