టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ గోవా ఆల్‌రౌండర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అర్జున్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. 84 పరుగులకే ఆలౌట్ అయింది.
గోవాకు ప్రాతినిథ్యం
కాగా ముంబైకి చెందిన అర్జున్ టెండుల్కర్ దేశవాళీ క్రికెట్లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన అర్జున్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా! ఇక 25 ఏళ్ల అర్జున్ రంజీ ట్రోఫీ 2024-25లో ప్లేట్ గ్రూపులో ఉన్న గోవా.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తలపడుతోంది.
పొర్వోరిమ్‌లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్‌లో బుధవారం ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే అటాక్ మొదలుపెట్టిన గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
టాప్-5 వికెట్లు అతడి ఖాతాలోనే
అర్జున్ ధాటికి టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కకావికలమైంది. ఓపెనర్ నబాం హచాంగ్‌ను డకౌట్ చేయడంతో వికెట్ల వేట మొదలుపెట్టిన అర్జున్.. మరో ఓపెనర్ నీలం ఒబి(22), వన్‌డౌన్ బ్యాటర్ చిన్మయ్ పాటిల్(3), నాలుగో స్థానంలో వచ్చిన జే భస్వార్(0), ఐదో నంబర్ బ్యాటర్ మోజీ ఎటె(1)లను పెవిలియన్‌కు పంపాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన
తద్వారా అర్జున్ టెండుల్కర్.. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన(5 Wicket Haul) నమోదు చేశాడు. ఇక అర్జున్‌తో పాటు గోవా బౌలర్లలో కేత్ పింటో రెండు, మోహిత్ రేడ్కర్ మూడు వికెట్లతో రాణించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే కుప్పకూలిన అరుణాచల్ ప్రదేశ్.. 84 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.
ముంబై తరఫున
కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అర్జున్ టెండుల్కర్ ఈమేరకు ఉత్తమ ప్రదర్శన కనబరచడం.. అతడికి సానుకూలాంశంగా మారింది. ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
ఇక సచిన్ టెండుల్కర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.
అయితే, రిటెన్షన్స్‌లో భాగంగా ఐదుగురిని అట్టిపెట్టుకున్న ముంబై.. అర్జున్‌ను వదిలివేసింది. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలంపాట జరుగనుంది.
చదవండి: ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ మా దేశంలోనే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే!
Comments
Please login to add a commentAdd a comment