ముంబై:ఇంటర్ స్కూల్ టోర్నీలో వెయ్యి పరుగులకు పైగా సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేకు చేయూతనిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇక నుంచి ప్రణవ్ కు అయ్యే విద్యా, క్రికెట్ కోచింగ్ ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావేదే ఆ కుర్రాడి ప్రతిభను కొనియాడుతూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ' ప్రణవ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఒక కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇది రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణం. అందుచేత ఆ 15 ఏళ్ల యువకుడికి నాణ్యమైన క్రికెట్ కోచింగ్ ఇప్పించడంతో పాటు, విద్యాపరమైన ఖర్చులను మహారాష్ట్ర సర్కారే భరాయించాలని నిర్ణయించింది 'అని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఆటో డ్రైవర్ అయిన ఆ కుర్రాడి తండ్రిని వినోద్ తావేదే కలిసి అభినందించారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన కల్యాణ్ లో ఉన్న కేసీ గాంధీ స్కూల్లో ప్రణవ్ 10 వ తరగతి చదువుతున్నాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో ఆ స్కూల్ తరపున బరిలోకి దిగిన ప్రణవ్.. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన న మ్యాచ్‌లో 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009 (నాటౌట్) పరుగులు చేశాడు.సుమారుగా 395 నిమిషాల పాటు క్రీజ్ ను అంటిపెట్టుకుని ఉన్న ప్రణవ్ 312.38 స్ట్రైక్ రేట్ తో ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం. అంతకుముందు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉన్న 116 సంవత్సరాల ప్రపంచ రికార్డు చెరిగిపోవడమే కాకుండా, 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.
'ఆ కుర్రాడి విద్యా, కోచింగ్ ఖర్చులు ప్రభుత్వానివే'
Published Tue, Jan 5 2016 6:55 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement
Advertisement