మోర్తాడ్ : విద్యాహక్కు చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సామగ్రి (పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు, యూనిఫాం)ని ప్రభుత్వమే సరఫరా చేయాలి. కేవలం యూని ఫాంలు, పాఠ్య పుస్తకాలతోనే సరిపెడుతున్నారు.
జిల్లాలో 1,573 ప్రాథమిక, 265 ప్రాథమికోన్నత, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 41 ఎయిడెడ్ , 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2.40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలు పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు విద్యా సామగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. ముందుగా టెండర్‌లను నిర్వహించి సామగ్రిని ప్రభుత్వం సేకరించకపోవడంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు విద్యార్థులకు సరఫరా కాలేదు.
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో విద్యా సామగ్రి కొనుగోలు వారికి తలకు మించిన భారంగా మారిం ది. విద్యా సామగ్రి ధరలు మార్కెట్‌లో భారీ గానే పెరిగాయి. పెరిగిన ధరలకు అనుగుణం గా విద్యార్థుల కుటుంబాల ఆదాయం పెరగలేదు. దీంతో ప్రభుత్వంపై వారు ఆధారపడి ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలి
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలి. ప్రభుత్వం చట్టాన్ని పాటించక పోతే ఎలా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విద్యాహక్కు చట్టంలో విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చట్టం ప్రకారం పని చేయాలి.- సత్యానంద్, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఎలా ‘నోట్’ చేసుకోవాలి
Published Fri, Jul 11 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement