వైరా : విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా జిల్లాలోని పలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందలేదు. ఓవైపు త్రైమాసిక పరీక్షలు ప్రారంభం కావస్తుండగా.. పుస్తకాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పాఠశాలల సిబ్బంది పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. దీంతో జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
జిల్లాలో 10 గురుకుల పాఠశాలల్లో అదే పరిస్థితి...
జిల్లాలోని వైరా, అడవిమల్లెల, ములకలపల్లి, కల్లూరు, నేలకొండపల్లి, ఎర్రుపాలె ం, టేకులపల్లి, దమ్మపేట, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు, బాలుర పాఠశాలల్లో సగానికి పైగా విద్యార్థులను పుస్తకాల కొరత వేధిస్తోంది. ఆయా పాఠశాలల్లో 5 నుంచి పదో తరగతి వరకు సుమారు 7,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో సగం మంది పుస్తకాలు లేక తరగతి గదుల్లో ఖాళీగానే కూర్చుంటున్నారు.
అందాల్సిన పుస్తకాలివే....
5వ తరగతిలో ఈవీఎస్, తెలుగు, గణితం, ఇంగ్లిష్, 6వ తరగతిలో తెలుగు, గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం, 7వ తరగతిలో హిందీ, గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాలు, 8వ తరగతిలో గణితం, భౌతికశాస్త్రం, బయాలజీ, సోషల్, 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్, 10లో ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్ పుస్తకాలు ఇప్పటి వరకు 50 శాతానికి పైగా రావాల్సి ఉంది.
అగమ్యగోచరంగా ‘పది’ విద్యార్థులు...
ఈ ఏడాది పదో తరగతిలో సిలబస్ మారడంతో గత ఏడాది పుస్తకాలను తీసుకునే అవకాశం కూడా లేదు. వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలలో 79 మంది విద్యార్థులు ఉండగా వారిలో సగానికి పైగా మంది పుస్తకాలు లేకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది సిలబస్ మారడం, పుస్తకాల కొరతతో ఉపాధ్యాయునులు సైతం ఇబ్బంది పడుతున్నారు.
ఏజేసీ పరిశీలనలో కూడా ఇవే సమస్యలు...
ఏజేసీ బాబురావు ఇటీవల వైరాలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే య గా, తాము పుస్తకాలు లేకుండానే పాఠాలు వింటున్నామని పలువురు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చినా.. నేటికీ విద్యాశాఖాధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు.
పుస్తకాల్లేవ్ !
Published Wed, Sep 10 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement