Vira
-
TG: రైతులకు శుభవార్త.. మూడో విడతలో రుణమాఫీ నిధులు విడుదల
సాక్షి, వైరా: తెలంగాణలో మూడో విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు. 14.45లక్షల మంది రైతులకు మూడో విడతలో రుణాలను విడుదల చేశారు. ఇక, ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో రూ.12వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.👉వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 140 కోట్ల మంది స్వేఛ్చావాయువులు పీల్చేలా కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చింది. ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్‌కు అడ్డా. వరంగల్ డిక్లరేషన్‌లో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ మాట్టిచ్చారు. మే 6, 2022న రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తున్నాం. ఎనిమిది నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఈరోజు రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం.. చేశాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం.. చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. మేం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు. సీతారామ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత మాది. 2026 కల్లా సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో 3400 ఇళ్లను మంజూరు చేశాం. సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణకు ఇచ్చారు. ఆ గ్యారంటీలను అమలు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. 65వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు గాడిత గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి. బీఆర్ఎస్ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేడు చరిత్రలో లిఖించదగిన రోజు. సాధ్యం కాదన్న రూ.2లక్షల రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. రుణమాఫీ చేయలేమని అందరూ అన్నారు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. సంకల్పాన్ని నిజం చేశాం. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే.. ఆ డబ్బులు వడ్డీలకే సరిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ కూడా చేయలేదు. సీఎం రేవంత్ ఆదేశించిన మరుక్షణమే రైతుల ఎకౌంట్లలోకి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ ఒక్కటే కాదు.. రైతుల సమస్యలపై కూడా దృష్టిపెట్టాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా వ్యవసాయ శాఖకు నిధులు కేటాయించాం. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య తేడాను చూడండి. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు రుణమాఫీనే నిదర్శనం. ఆర్థిక మంత్రిగా రుణమాఫీ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కీలక అడుగులు వేస్తున్నాం. రూ.36వేల కోట్ల పెట్టుబడులను సీఎం తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రాకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేసింది. ఇందిరాసాగర్‌ను రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. రూ.1000 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.23వేల కోట్లకు పెంచారు. డబ్బులు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ మానసపుత్రిక అని మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరాకు కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు. దోపిడీ చేయడం కోసమే వాళ్లకు మానసపుత్రిక. గోదావరిపైనే ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌తో రూ.23వేల కోట్లకు అంచనాలు పెంచి దోపిడీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ ప్రాజెక్ట్‌లు కట్టిందా? బీఆర్ఎస్ ఎక్కువ కట్టిందా? అనే చర్చకు సిద్ధం. 👉మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతారామకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. తెలంగాణలో రైతులకు ఈరోజు పండుగ రోజు. గత బీఆర్ఎస్ సర్కార్ నాలుగుసార్లు రుణమాఫీ చేస్తే మిత్తిలకు కూడా సరిపోలేదు. రూ.31వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మకం. ఆరేళ్లలోనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూ.600 కోట్లు ఇచ్చాం. ఎంత ఖర్చు అయినా సరే మిగిలిన పనులు పూర్తి చేస్తాం.👉మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం సంతోషకరం. తెలంగాణలో మార్పు కోసమే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఎన్నికల కష్టాలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది.👉మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.2లక్షలు రుణమాఫీ చేయలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది. గతంలో సీతారామ ద్వారా బీఆర్ఎస్ ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. ఇందిర, రాజీవ్ ప్రాజెక్ట్‌లను రీడిజైన్ చేసి సీతారామ తెచ్చారు. సీతారామ ప్రాజెక్ట్‌ను పదేళ్లు సాగదీస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీతారామ పనులు వేగవంతం చేశాం. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తాం.👉మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు గోదావరి నీటిని తీసుకొచ్చాం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తికి కట్టుబడి ఉన్నాం అంటూ కామెంట్స్ చేశారు. -
కూతురు సమస్యను వెంటనే తీర్చారు.. కానీ
సాక్షి, ఖమ్మం: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేల సంఖ్యలో టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలాగైతే విద్యార్థులకు చదువు ఎక్కడ దొరుకుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి సమస్యల గురించి ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతుల గురిచేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో అప్రజాస్వమ్య పరిస్థితులు తలెత్తాయన్న ఆయన.. ‘‘ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఉద్యోగాన్ని కోల్పోయిన నీ కూతురు కవిత పరిస్థితిని కొన్ని రోజులు కూడా భరించలేకపోయావు. ఆమెకు నిరుద్యోగ సమస్య ఉందని గుర్తించి వెంటనే ఎమ్మెల్సీ ద్వారా సమస్యను తీర్చావు’’ అంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ పాలనా తీరుతో నిరుద్యోగులు, యువత తీవ్ర నిరాశ నిస్సృహల్లో ఉన్నారని వారు గనుక తిరగుబాటు మొదలుపెడితే.. ప్రజాస్వామ్య ఉనికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. (చదవండి: అంత సులభం కాదు.. తొందరపాటు చర్యే! ) అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతో పాటు.. ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇంటికో ఉద్యోగం వెంటనే ఇచ్చేలా నియామకాలు చేపట్టాలని భట్టి డిమాండ్ చేశారు. ‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని ఉద్యోగాల ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ జరిగేంత వరకూ.. దీనిని కూడా మేము నమ్మం. గతంలో 16 వేల కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ తరువాత.. ఇప్పటివరకూ వాళ్లను ట్రైనింగ్‌కు పంపలేదు’’ అని భట్టి విక్రమార్క ప్రభుత్వ తీరును విమర్శించారు. -
మౌనంగానే ఎదగమని..
అతడు ఎవరితోనూ మాట్లాడడు... ఎవరి మాటనూ వినడు. అలాగని.. అతడు ఎవరి మాట వినని మొండిఘటమేమీ కాదు. విధి అలా మార్చిందంతే. పుట్టుకతోనే అతడికి మూగతో పాటు వినికిడి లోపం. అయినా తన లోకంలోనే ఉండిపోలేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంలా మల్చుకున్నాడు. వైకల్యాన్ని జయించి అందరిలా.. అందరివాడిలా ముందుకు సాగుతున్నాడు. సంజ్ఞలతోనే పనులన్నీ చక్కబెడుతున్నాడు. వైరాకు చెందిన యువకుడు మొలా శరత్రాహుల్ విజయగాథ ఇది. వైరాలోని బీసీకాలనీకి చెందిన మొలా సుందర్రావు, విజయకుమారి దంపతుల కుమారుడు శరత్ రాహుల్(24)కి పుట్టకతోనే రుగ్మతలు ఆవరించాయి. చిన్నప్పటి నుంచి అతడు మాట్లాడలేడూ వినలేడు. అయినా అతడు ఆత్మస్థైర్యాన్ని చిరుప్రాయం నుంచే అలవర్చుకున్నాడు. స్థానిక అజరయ్య శ్రీనికేతన్ విద్యాలయంలో పదో తరగతి పూర్తి చేశాడు. పాఠ్యాంశాలు వినిపించకపోయినా సజ్ఞలతోనే అర్థం చేసుకున్నాడు. మంచి మార్కులతోనే ఉత్తీర్ణత సాధించాడు. ఆత్మవిశ్వాసమే ఆసరా తన వైకల్యాన్ని చూసుకుని మదనపడడం కన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే మేలని భావించాడు శరత్ రాహుల్. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినా (ఇప్పుడు రిటైర్డ్) ఆయనపై ఆధార పడలేదు. ఏదో పనిచేసి తన కాళ్లపై తాను నిలబడాలని సంకల్పించాడు. లక్ష్యసాధన కోసం ముందడుగు వేశాడు.మేకానిజంపై ఉన్న మక్కువతో వైరాలోని ఓ ఇంజనీరింగ్ షాపులో పనికి కుదరాడు. ఏ వస్తువునైనా తన మేధస్సుతో ఇట్టే రిపేర్ చేసే సహజత్వం కలిగిన రాహుల్ వెల్డింగ్ పనిని కొద్దికాలంలోనే సమగ్రంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడి వేతనం రూ. 7 వేలు. అంతేకాదు.. ఎలాంటి శిక్షణ లేకుండానే ద్విచక్రవాహనాలు, విద్యుత్ మోటార్లు రిపేర్, హౌస్వైరింగ్ చేయడంలో అతడు పట్టుసాధించాడు. మాటలు రాకపోయినా... మాట్లాడడం రాకపోయినా శరత్ రాహుల్ సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచంతో సంభాషిస్తున్నాడు. ఫేస్బుక్ ద్వారా మిత్రులతో తన భావాలు పంచుకుంటున్నాడు. అంతేకాదు... సెల్‌ఫోన్ వినియోగంలోనూ రాహుల్ శైలి వినూత్నమే. సంభాషిచడం సాధ్యం కాదు కనుక ఎస్ఎంఎస్ల ద్వారా తన భావాలను అవతలి వారికి తెలియజేస్తున్నాడు. పని ఒత్తిడి వల్ల ఇంటికి వెళ్లడం ఆలస్యమైతే ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుంటాడు. నాలుగేళ్లుగా శరత్ రాహుల్‌కు ఇది మంచి సాధనంగా మారింది. ఇంతటి ఆత్మస్థైర్యం కలిగిన ఈ యువకుడిని చూసి స్థానికులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. -
పుస్తకాల్లేవ్ !
వైరా : విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా జిల్లాలోని పలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందలేదు. ఓవైపు త్రైమాసిక పరీక్షలు ప్రారంభం కావస్తుండగా.. పుస్తకాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పాఠశాలల సిబ్బంది పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. దీంతో జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 10 గురుకుల పాఠశాలల్లో అదే పరిస్థితి... జిల్లాలోని వైరా, అడవిమల్లెల, ములకలపల్లి, కల్లూరు, నేలకొండపల్లి, ఎర్రుపాలె ం, టేకులపల్లి, దమ్మపేట, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు, బాలుర పాఠశాలల్లో సగానికి పైగా విద్యార్థులను పుస్తకాల కొరత వేధిస్తోంది. ఆయా పాఠశాలల్లో 5 నుంచి పదో తరగతి వరకు సుమారు 7,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో సగం మంది పుస్తకాలు లేక తరగతి గదుల్లో ఖాళీగానే కూర్చుంటున్నారు. అందాల్సిన పుస్తకాలివే.... 5వ తరగతిలో ఈవీఎస్, తెలుగు, గణితం, ఇంగ్లిష్, 6వ తరగతిలో తెలుగు, గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం, 7వ తరగతిలో హిందీ, గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాలు, 8వ తరగతిలో గణితం, భౌతికశాస్త్రం, బయాలజీ, సోషల్, 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్, 10లో ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్ పుస్తకాలు ఇప్పటి వరకు 50 శాతానికి పైగా రావాల్సి ఉంది. అగమ్యగోచరంగా ‘పది’ విద్యార్థులు... ఈ ఏడాది పదో తరగతిలో సిలబస్ మారడంతో గత ఏడాది పుస్తకాలను తీసుకునే అవకాశం కూడా లేదు. వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలలో 79 మంది విద్యార్థులు ఉండగా వారిలో సగానికి పైగా మంది పుస్తకాలు లేకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది సిలబస్ మారడం, పుస్తకాల కొరతతో ఉపాధ్యాయునులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఏజేసీ పరిశీలనలో కూడా ఇవే సమస్యలు... ఏజేసీ బాబురావు ఇటీవల వైరాలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే య గా, తాము పుస్తకాలు లేకుండానే పాఠాలు వింటున్నామని పలువురు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చినా.. నేటికీ విద్యాశాఖాధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. -
జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం
వైరా, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా తనను, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా మండలం ముసలిమడుగులోని పురాతన అభయాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన హనుమజ్జయంతి ఉత్సవాల లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌తో కలిసి ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే ఎజెండాగా తమ పార్టీ పని చే స్తుందని చెప్పారు. జిల్లా ప్రజలు విజ్ఞులని, అందుకే వైరా, ఆశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి మహానేత రుణం తీర్చుకున్నారని అన్నారు. పేద , మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, కార్మికులకు నిత్యం అందుబాటులో ఉండి వారి పక్షాన పార్టీ పనిచేస్తుందన్నారు. తమను గెలిపించిన ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అండదండలతోనే గెలుపొందామని, వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో పార్టీకి సేవలందిస్తామన్నారు. కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని, ఏ క్షణంలోనైనా వారి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పొంగులేటికి తొలి వినతిపత్రం... ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌కు మండలంలోని చెరుకు రైతులు, ముసలిమడుగు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. వైరా రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సాగులో ఉన్న చెరకు పంటకు సాగు నీరు విడుదల చేయాలని, గ్రామంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. దీనికి స్పందించిన పొంగులేటి సాగునీటి సమస్యపై వెంటనే నీటిపారుదల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, వైరా, గరికపాడు సర్పంచ్‌లు బాణోత్ వాలీ, శీలం కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు తన్నీరు జ్యోతి, తడికమళ్ల నాగేశ్వరరావు, నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోషయ్య, షేక్ లాల్‌మహ్మద్, తన్నీరు నాగేశ్వరరావు, చింతనిప్పు రాంబాబు, కొరివి నర్సింహరావు, సుబ్బిరెడ్డి, దేవరాజ్, కౌసర్, తేలప్రోలు నర్సింహరావు, బాణోత్ కృష్ణ పాల్గొన్నారు.