పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, వాళ్ల చిన్ననాటి సంగతులు తలచుకుని తల్లిదండ్రులు మురిసిపోతుండటం మామూలే. అయితే వారి హృదయాన్ని మెలిపెట్టి పశ్చాత్తానికి లోను చేసే జ్ఞాపకాలూ కొన్ని ఉంటాయి. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రాను ఇప్పటికీ బాధిస్తూ, కన్నీళ్లు పెట్టించే అలాంటి ఒక జ్ఞాపకం.. కూతురి చదువు విషయంలో తానెంతో కటువుగా ప్రవర్తించటం!
ప్రియాంకను ఏడేళ్ల వయసులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు మధు చోప్రా‘‘నేను మంచి తల్లిని కాదేమో నాకు తెలీదు. ‘వద్దమ్మా.. ప్లీజ్..’ అని ఎంత వేడుకుంటున్నా వినకుండా నేను ప్రియాంకను బలవంతంగా బోర్డింగ్ స్కూల్లో చేర్పించాను. ప్రతి శనివారం సాయంత్రం నా డ్యూటీ అయిపోయాక ట్రెయిన్ ఎక్కి ప్రియాంకను చూడ్డానికి బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లే దాన్ని. ప్రియాంక అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. తను ఆ వాతావరణంలో ఇమడలేక పోయింది.
‘‘అమ్మా.. నేనూ నీతో ఇంటికి వచ్చేస్తా..’’ అని నన్ను చుట్టుకుపోయి ఏడ్చేది. ఆ ఏడుపు ఇప్పుడు గుర్తొస్తే నాకూ కన్నీళ్లొచ్చేస్తాయి. ‘లేదు, నువ్విక్కడ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది’ అని చెప్పేదాన్ని. తనకేమీ అర్థమయ్యేది కాదు. తన కోసం నేను ఆదివారం కూడా అక్కడే ఉండిపోయేదాన్ని. అది చూసి ప్రియాంక టీచర్ ఒకరోజు నాతో ‘మీరిక ఇక్కడికి రావటం ఆపేయండి’ అని గట్టిగా చెప్పేశారు..‘ అని ‘సమ్‌థింగ్ బిగ్గర్ టాక్ షో’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు మధు చోప్రా.
ప్రియాంక తండ్రి అశోక్ చోప్రాకు ప్రియాంకను బోర్డింగ్ స్కూల్లో చేర్పించటం అస్సలు ఇష్టం లేదు. అయితే మధు చోప్రా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. కొంతకాలం ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు కూడా. (ఇప్పుడు ఆయన లేరు).
ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ – ‘‘ప్రియాంక తెలివైన అమ్మాయి. ఆ తెలివికి పదును పెట్టించకపోతే తల్లిగా నా బాధ్యతను సరిగా నెరవేర్చినట్లు కాదు అనిపించింది. అందుకే లక్నోలోని లా మార్టినియర్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలనుకున్నాను. అందులో సీటు కోసం ప్రియాంక చేత ఎంట్రెన్స్ టెస్టు కూడా రాయించాను. తను చక్కగా రాసింది. అడ్మిషన్ వచ్చేసింది. ఆ విషయాన్ని నా భర్తకు చెబితే ఆయన నాపై ఇంతెత్తున లేచారు.
‘ఇదే నీ నిర్ణయం అయితే, వచ్చే ఫలితానికి కూడా నువ్వే బాధ్యురాలివి’ అని అన్నారు. ఏమైతేనేం చివరికి అంతా బాగానే జరిగింది. ప్రియాంక తన కాళ్లపై తను నిలబడింది’’ అని ΄ాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు మధు చోప్రా.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు వారిని దూరంగా ఉంచవలసి వచ్చినందుకు బాధపడటం సహజమే. అయితే పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే యజ్ఞంలో ఆ బాధ ఒక ఆవగింజంత మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment