ఈ రాతలకు ‘బుక్‌’ చేయాల్సిందే!  | Eenadu Fake News books prices Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఈ రాతలకు ‘బుక్‌’ చేయాల్సిందే! 

Published Tue, Jul 26 2022 4:17 AM | Last Updated on Tue, Jul 26 2022 7:46 AM

Eenadu Fake News books prices Andhra Pradesh - Sakshi

రెండున్నర దశాబ్దాలుగా ప్రయివేటు స్కూళ్ల పాఠ్య పుస్తకాలను ముద్రించేది ఇద్దరు ముగ్గురు పబ్లిషర్లే. ఇక ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలయితే ఆ పుస్తకాలకు వసూలు చేసే మొత్తానికి ఒక పద్ధతీ పాడూ లేదు. పైపెచ్చు విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలు గడిచేదాకా పుస్తకాలు అందుబాటులోకి వచ్చేవి కావు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు తప్పుగా అనిపించలేదు. ఎన్నడూ భారీగా వసూలు చేసే ప్రయివేటు పాఠశాలల్ని గానీ, సకాలానికి అందివ్వలేని పబ్లిషర్లను గానీ... వారిని నియంత్రించలేని ప్రభుత్వాన్ని గానీ ప్రశ్నించలేదు.  

ఈ ఏడాది నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ పద్ధతిని మార్చారు. పబ్లిషర్ల కోసం ఓపెన్‌ టెండర్లు పిలిచారు. ధరలను ప్రభుత్వమే నిర్ణయించింది. అంతకన్నా ఎక్కువకు విక్రయించడానికి వీల్లేదంటూ... విద్యార్థుల తల్లిదండ్రులపై పెను భారం పడకుండా చేసింది. ఓపెన్‌ టెండర్లలో ఎక్కువ మంది పబ్లిషర్లు ఎంపికయ్యారు కనక పుస్తకాల సరఫరా కూడా బాగానే ఉంది. కాకపోతే ఇదంతా చేసింది చంద్రబాబు కాదు కనక... షరా మామూలుగా రామోజీ విమర్శల రాగం అందుకున్నారు. ప్రయివేటు స్కూళ్లతోను, పబ్లిషర్లతోను కుమ్మక్కును నిరూపించే రాతలకు దిగారు. పుస్తకాలెక్కడ? అంటూ అబద్ధాలు అచ్చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... 

ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలను ముద్రించడం, విక్రయించటం వంటివి చేయటానికి ప్రయివేటు పబ్లిషర్లను అనుమతిస్తూ 2006– 07 విద్యా సంవత్సరంలోనే నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓపెన్‌ టెండర్ల ద్వారా ప్రయివేటు పబ్లిషర్లకు అప్పగించింది. దీనికి వారు ఏటా పుస్తకం ధరలో ఐదు శాతాన్ని రాయల్టీగా చెల్లించాలి. ఇదిగో... నాటి నుంచి గతేడాది వరకూ పుస్తక ముద్రణను ఎమెస్కో బుక్స్, విజయవాణి ప్రింటర్స్, ప్రజాశక్తి దినపత్రిక, విశాలాంధ్ర చేస్తూ వచ్చాయి. అయితే ఈ విద్యా సంవత్సరానికి (2022–23) టెండర్లు పిలిచేటపుడు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి.

ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, తరగతిని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నాయని ఫిర్యాదులొచ్చాయి. పైపెచ్చు ప్రభుత్వం సరఫరా చేసే పుస్తకాల కంటే ఆక్స్‌ఫర్డ్, రత్నసాగర్, ఓరియెంట్‌ బ్లాక్‌స్వాన్, మాక్స్‌మిల్లర్‌ వంటి ప్రయివేటు పబ్లిషర్లు ముద్రించే పుస్తకాలను వాడటానికే ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇవి ఖరీదైనవి కావడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంతేకాక ప్రయివేటు స్కూళ్లు ఇలా చేయటం వల్ల విద్యార్థులు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్టీ) రూపొందించిన నాణ్యమైన కంటెంట్‌ ఉన్న పాఠ్యపుస్తకాలకు దూరమవుతున్నారనీ ప్రభుత్వం గుర్తించింది.

వీటన్నిటికీ తోడు... గత మూడేళ్లుగా ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులెవరూ తమ పుస్తకాలను కొనుగోలు చేయడం లేదని పేర్కొంటూ పబ్లిషర్లు 25 శాతమే రాయల్టీ చెల్లించారు. వారు విక్రయించిన పాఠ్యపుస్తకాల వివరాలను, ఆడిటింగ్‌ నివేదికలను కూడా ప్రభుత్వానికి సమర్పించలేదు. ఇవన్నీ చూశాక... ప్రచురణకర్తలు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదని, తక్కువ నాణ్యత గల పేపర్‌పై రంగులతో ముద్రిస్తున్నారని, అది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని గుర్తించింది. ధరలు అధికంగా ఉండటంతో నియంత్రించాలని భావించింది. 


ప్రైవేటుకూ ప్రభుత్వమే పుస్తకాల సరఫరా... 
ప్రైవేటు విద్యారంగంలో జరుగుతున్న పుస్తక దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వ విద్యార్థులతో సమానంగా ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలను ముద్రించి సరఫరా చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 3న ప్రభుత్వం నిర్ణయించింది. గతం కంటే నాణ్యమైన పుస్తకాలు ముద్రించేందుకు వీలుగా టెండర్లు పిలవగా 83 సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో 57 సంస్థలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్‌టీపీఎల్‌ నుంచి పేపర్‌ అందిన తేదీ నుంచి 20 రోజుల్లో పుస్తకాల ముద్రణ, సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ఈ 57 సంస్థలకూ వాటి సామర్థ్యానికి అనుగుణంగా ముద్రణ వర్క్స్‌ను కేటాయించారు. దీనికంటే ముందే... అవసరమైన పేపరు సరఫరా చేస్తామని ఈ ఏడాది మార్చిలోనే ఎన్‌టీపీఎల్‌ అంగీకరించింది. దాంతో మార్చి 28, మే 26 తేదీల్లో విద్యాశాఖ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి ప్రైవేట్, అన్‌–ఎయిడెడ్‌ పాఠశాల పిల్లలకు విద్యాశాఖే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని స్పష్టంచేసింది. ఈ మేరకు అధికారులు వారికి అవగాహన కల్పించారు.  

మొదటి సెమిస్టర్‌ నాటికే 1,25,14,786 పుస్తకాలు... 
ఈ విద్యా సంవత్సరంలో 24,44,942 మంది విద్యార్థులు స్టేట్‌ సిలబస్‌తో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్నట్లు లెక్కతేల్చగా, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు 18,02,879 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరమని ఇండెంట్‌ ఇచ్చాయి. మిగిలిన విద్యార్థులు పాత పుస్తకాలను ఉపయోగించుకుంటారని తెలిపాయి. దీని ప్రకారం ఈ జూలై 25వ తేదీ మొదటి సెమిస్టర్‌ నాటికి జిల్లాల్లోని విద్యార్థులకు అవసరమైన 1,39,84,625 పాఠ్య పుస్తకాల్లో 1,25,14,786 పుస్తకాలను సరఫరా చేసింది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు నిర్ణయించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement