సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు.
8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు
రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు.
విందామన్నా.. నెట్‌వర్క్‌తో ఇబ్బంది
చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్‌వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు.
పుస్తకాలు ఇవ్వలేదు
మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది.
- సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట
ఏమి అర్థం కావడం లేదు
ఆన్‌లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్‌లైన్‌లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు.
- రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల
పుస్తకాలు లేకుండా విద్య ఎలా?
ఆన్‌లైన్‌లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్‌లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి.
- తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment