మెదక్ గోదాం నుంచి ప్రారంభమైన పంపిణీ
పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మెదక్ పాఠ్యపుస్తక నిల్వ కేంద్రం నుంచి జిల్లాలోని పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించినట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా విద్య అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో పాతికేళ్ల నుంచి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 143 ఉన్నత, 132 ప్రాథమికోన్నత, 632 ప్రాథమిక, 7 మోడల్, 15 కేజీబీవీ పాఠశాలలున్నాయి.
ఇందులో సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ 6,02,517 పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటికే మెదక్‌లోని పాఠ్యపుస్తక నిల్వ కేంద్రంలో 34,521 పుస్తకాలు నిల్వ ఉన్నాయి. ఇంకా 5,67,996 పుస్తకాలు అవసరముండగా శుక్రవారం నాటికి 4,49,480 పుస్తకాలు వచ్చాయి. మరో 1,18,516 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. 1 నుంచి 10వ తరగత వరకు విభిన్న మీడియంలలో కలసి 165 టైటిల్స్ అవసరం ఉండగా ఇప్పటి వరకు 117 టైటిల్స్ వచ్చాయి. మరో 48 రావాల్సి ఉంది. ఇప్పటికే హవేలిఘణపూర్, మెదక్, శంకరంపేట(ఏ), రేగోడ్ మండలాలకు పంపిణీ చేసినట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆతర్వాత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వివిధ మండలాలకు సరఫరా చేస్తామన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై బార్‌కోడ్ ముద్రించినట్లు సమాచారం. పుస్తకాల పంపిణీ తర్వాత అక్విటెన్స్ కూడా పాఠశాలల వారీగా రికార్డు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధిత హెచ్‌ఎంలదే పూర్తి బాధ్యత ఉంటుందని తెలిసింది.
బడులు తెరిచే నాటికి పూర్తి
జూన్1న పాఠశాలలు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేస్తాం. నిర్ణయించిన షెడ్యూల్‌కనుగుణంగా ఎంఈఓలు పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లే చర్యలు చేపట్టాలి. ఇంకా కొన్ని టైటిల్స్, పుస్తకాలు రావాల్సి ఉంది. అవి రాగానే అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో అందజేస్తాం. –శ్రీకాంత్, గోదాం ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment