
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాల వారీగా అంతర్ జిల్లా బదిలీలు కోరుకునే వారికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించింది. బదిలీలు కోరుకునే అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత షెడ్యూల్లో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా జూన్ 30 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనలు..
► ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్మాస్టర్లు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
► ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలో జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండాలి.
► స్పౌజ్ కేటగిరీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట పబ్లిక్ సెక్టార్ సంస్థలు, యూనివర్సిటీలు, హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియేట్, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
► స్పౌజ్ కేటగిరీకి సంబంధించి హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియేట్‌లో పనిచేస్తున్న వారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
► మ్యూచువల్ కేటగిరీలో కేటగిరీ, మేనేజ్‌మెంట్ ఒక్కటే అయి ఉంటేనే అనుమతిస్తారు.
► మ్యూచువల్ బదిలీల్లో టీచర్ల సమ్మతి(కన్సెంట్)తో పాటు ఎంఈవో, డిప్యుటీ డీఈవో సమ్మతి ఇస్తూ కౌంటర్ సైన్ చేయాలి.
► ఒక టీచర్ ఒక టీచర్‌కు మాత్రమే కన్సెంట్ ఇవ్వాలి.
► అనధికారిక గైర్హాజరు, సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కొంటున్న వారు, సస్పెన్షన్‌లో ఉన్న వారు దరఖాస్తుకు అనర్హులు
► ఆన్‌లైన్ దరఖాస్తులనే స్వీకరిస్తారు. ఒకసారి దరఖాస్తు చేస్తే అదే అంతిమం అవుతుంది. గతంలో అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తు చేశాక వాటిని డౌన్‌లోడ్ చేసి ఎంఈవో సంతకానికి సమర్పించాలి. ఎంఈవో, హెచ్‌ఎం, డిప్యూటీ డీఈవోలు రికార్డులను పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరం డీఈవోలకు సమర్పించాలి.
బదిలీల షెడ్యూల్ ఇలా
► ఆన్‌లైన్ దరఖాస్తు, ఎంఈవోకు సమర్పణ: జూన్ 30 నుంచి జూలై 6 వరకు
► పరిశీలించిన దరఖాస్తులను ఎంఈవో, డీఈవోలకు సమర్పణ: జూలై 7 నుంచి 11 వరకు
► డీఈవోలు దరఖాస్తుల పరిశీలన: జూలై 12 నుంచి జూలై 17 వరకు
► డీఈవోలు పాఠశాల విద్య కమిషనర్ పరిశీలనకు జాబితా సమర్పణ : జూలై 19
► కమిషనర్ పరిశీలన అనంతరం తుది జాబితా : జూలై 20 నుంచి 26 వరకు
► ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనల సమర్పణ: జూలై 29
కమిషనర్ ప్రతిపాదనల సమర్పణ అనంతరం సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖల ఆమోదం అనంతరం టీచర్లకు అంతర్ జిల్లా బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. ఆ తేదీలను తర్వాత వెల్లడిస్తారు
Comments
Please login to add a commentAdd a comment