లక్ష్యం ముందు తలవంచిన విధి
వారు ఏడాదంతా కష్టపడి చదివారు. విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతిలో ఉత్తీర్ణులుగా నిలిచి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి విధి పరీక్ష పెట్టింది. ఇంట్లో తల్లి శవం ఉండగా.. ఓ కూతురు.. నిన్నటి వరకు తనతో ఆడుకున్న చెల్లెలు విగతజీవిగా పడి ఉండగా ఓ అన్న దుఃఖాన్ని దిగమింగి విధి పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలను రాశారు. మరో చోట చేతులు లేవని దిగులు చెందకుండా పరీక్ష రాస్తే.. తన అనారోగ్యానికి కుంగిపోకుండా సహాయకుడి ద్వారా పరీక్ష రాసి ఆదర్శంగా నిలిచిందో విద్యార్థిని. వరంగల్ జిల్లాలో పరీక్షకు కొద్ది గంటల ముందే తండ్రి మరణించగా, కన్నీరుమున్నీరవుతూ పరీక్ష రాసి వచ్చింది. మరో విద్యార్థినికి తండ్రి మరణించిన విషయం పరీక్షా కేంద్రం వద్దగానీ తెలియలేదు.
ఇంట్లో తల్లి శవం..
ఇల్లెందు: తల్లి మృతదేహం ఇంట్లో ఉండగానే ఆ కూతురికి ‘విషమపరీక్ష’ ఎదురైంది. ఓ పక్క తల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోపక్క ఆమె పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తిరుమలాపురంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన బానోత్ నాగేశ్వరరావు-కౌసల్యల కూతురు రుక్ష్మిణీబాయి ఇల్లెందు బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఎస్టీ(న్యూ) బాలికల హాస్టల్‌లో ఉంటోంది. రుక్మిణీబారుు తల్లి కౌసల్య ఆదివారం మృతి చెందింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం స్వగ్రామంలో కౌసల్య అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతుండగానే, రుక్మిణీబారుు ఇల్లెందులోని గురుకుల పాఠశాల సెంటర్‌లో పదోతరగతి పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగియగానే వెళ్లి తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.
కాలితో పరీక్ష
సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థి భానుప్రసాద్ కాలితో పరీక్ష రాశాడు. ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భానుప్రసాద్‌కు పుట్టినప్పటి నుంచి రెండు చేతులు చచ్చుబడి పోవడంతో కుడి కాలితో రాయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షకు హాజరై కాలితో పరీక్ష రాశాడు.
పక్షవాతంతో పరీక్షకు..
కడెం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న తపన ముందు విధి తలవంచింది. పరీక్షలకు రెండు నెలల ముందు పక్షవాతం బారిన పడిన ఆ విద్యార్థిని మొక్కవోని ధైర్యంతో పరీక్షలకు హాజరైంది. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామానికి చెందిన మునిగంటి భూలక్ష్మీ, లక్ష్మణ్‌ల కూతురు రజిత మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకులంలో పదో తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం ఒక్కసారిగా ఆమె పక్షవాతం బారిన పడింది. ఎడమ చేరుు, ఎడమ కాలు పని చేయడం లేదు. అప్పటి నుంచి కుటుంబమంతా విషాదంలో ఉండగా, సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షకు రజిత తల్లి సహాయం తో హాజరైంది. కడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరీ క్షకు హాజరైంది. అధికారుల అనుమతితో సహాయకుడితో పరీక్ష రాసింది.
పరీక్షకు కొద్ది గంటల ముందే..
వరంగల్: వరంగల్ జిల్లా జనగామ మండ లం యశ్వంతాపూర్‌కు చెందిన కట్ట అయోధ్య(40) ఆటో నడుపుతూ భార్య, నలుగురు పిల్లలను పోషించేవాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. సోమవారం వేకువజామున గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. అయితే, అయోధ్య రెండో కూతురు శ్వేత రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షకు కొద్ది గంటల మెందే తండ్రి చనిపోవడంతో బోరున విలపించింది. అరుునా తిరిగి ధైర్యం తెచ్చుకుని పరీక్షకు హాజరైంది. అలాగే, వర్ధన్నపేటకు చెందిన గుడికందుల దేవేందర్(39) కూతురు కావ్య స్థానిక అరబిందో పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దేవేందర్ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆదివారం రాత్రి తాను పని చేసే పెట్రోల్ బంక్‌కు వెళ్లి.. సోమవారం వేకువజామున అస్వస్థతకు గురయ్యూడు. 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. సోమవారం ఉదయం మృతి చెందాడు. అరుుతే తండ్రి మరణవార్త కావ్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తోటి స్నేహితులతో కలసి ఉత్సాహంగా పరీక్ష కేంద్రానికి వచ్చాక.. మరి కొందరు మిత్రుల ద్వారా విషయం తెలిసింది. బోరున విలపించిన కావ్యకు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పడంతో పరీక్ష రాసింది.
సోదరి చనిపోయినా..
ధరూరు: తోడబుట్టిన సోదరి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన దరెప్ప, లక్ష్మీలకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. దరెప్ప ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. వీరి రెండవ కుమార్తె బేబీ(12) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పెద్దకుమారుడు రాజు పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోదరి మృతదేహం ఇంట్లో ఉండగా, రాజు సోమవారం తెలుగు పరీక్ష రాశాడు. తర్వాత సోదరి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
స్నేహితుడి సహాయంతో..
జహీరాబాద్: స్నేహితుడి సహాయంతో ఓ మరుగుజ్జు పదో తరగతి పరీక్ష రాశాడు. సోమవారం మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల కేంద్రానికి టి.శ్రీకాంత్(మరుగుజ్జు)ను అతని స్నేహితుడు చవాన్ కిషన్ ఎత్తుకుని తీసుకొచ్చాడు. శ్రీకాంత్‌కు రాయడం రానందునా స్నేహితుడి సహాయం తీసుకునేందుకు పరీక్ష కేంద్రం నిర్వాహకులు అనుమతించారు. జహీరాబాద్ మండలం గుడ్‌పల్లికి చెందిన శ్రీకాంత్ సమీపంలోని మొగుడంపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివాడు.